‘లిక్కర్‌ వద్దు.. గంజాయి ముద్దు’.. ఎమ్మెల్యే ఉచిత సలహా!

Chhattisgarh BJP MLA Advised to Smoke Cannabis to Prevent Crimes - Sakshi

రాయ్‌పుర్‌: ఒక్కోసారి రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే క్రిష్ణమూర్తి బంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేరాలను అడ్డుకునేందుకు ఆల్కహాల్‌కు బదులుగా గంజాయి తాగాలని ఉచిత సలహా ఇచ్చారు. లిక్కర్ వల్లే దేశంలో అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గంజాయితో అలాంటి నేరాలు జరగవని జోస్యం చెప్పారు.

గౌరేలా పెంద్రా మర్వాహి జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు క్రిష్ణమూర్తి. ‘ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. గతంలో అసెంబ్లీలో కూడా దీనిపై చర్చించాను. ఆల్కహాల్‌ కారణంగా అత్యాచారం, హత్య, గొడవలు జరుగుతున్నాయని చెప్పాను. కానీ, ఎవరైనా భంగ్‌, గంజాయి తాగిన వారు ఇలాంటి నేరాలకు పాల్పడ్డారా? అని అసెంబ్లీలోనే అడిగాను. వ్యసనాల అవసరాలను తీర్చేందుకు, లిక్కర్‌ నిషేధించేందుకు ఓ కమిటీని వేశారు. ప్రజలను భంగ్‌, గంజాయి వైపు ఎలా మళ్లించాలని ఆ కమిటీ ఆలోచించాలి. మత్తు కావాలనుకున్న వారికి అలాంటివే అందించాలి.’ అని పేర్కొన్నారు.

బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది కాంగ్రెస్‌. మత్తు పదార్థాలను ఓ ప్రజాప్రతినిధి ఎలా ప్రమోట్‌ చేస్తారు? అని ప్రశ్నించింది. మరోవైపు.. ఈ విషయంపై ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ను అడగగా.. మత్తు ఏ రూపంలో ఉన్నా ప్రమాదకరమేనని తెలిపారు. దేశంలో గంజాయి విక్రయాలను చట్టబద్ధం చేయాలనుకుంటే ఆయన కేంద్రాన్ని డిమాండ్‌ చేయాలన్నారు.

ఇదీ చదవండి: హారన్‌ కొడితే తప్పుకోలేదని.. బధిరుడిని కత్తితో పొడిచి చంపిన బాలిక

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top