Sakshi News home page

వాయిస్‌ విని వైరస్‌ గుట్టు చెప్పేస్తుంది

Published Tue, Sep 6 2022 5:49 AM

Smartphone App May Detect COVID 19 Infection Through People Voice - Sakshi

లండన్‌: కృత్రిమ మేథ మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కోవిడ్‌ జాడను ఇట్టే పసిగట్టి చెప్పే నూతన స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ‘మనిషి గొంతు విని అతనికి కోవిడ్‌ సోకిందో లేదో ఈ యాప్‌ చెప్పగలదు. కోవిడ్‌ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో ఫలితాలు ఇస్తుంది. ఎలాంటి ఖర్చు లేకుండా, త్వరగా, సులభంగా కోవిడ్‌ జాడ కనిపెట్టే విధానమిది. వాయిస్‌ను రికార్డ్‌ చేసి చెక్‌ చేస్తే సరిపోతుంది.

నిమిషంలో ఫలితం వచ్చేస్తుంది. అల్పాదాయ దేశాల్లో ఇది ఎంతో ఉపయోగకరం’ అని పరిశోధకులు చెప్పారు. స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో నిర్వహించిన యురోపియన్‌ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌లో ఈ యాప్‌ సంబంధ వివరాలను బహిర్గతంచేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఈ యాప్‌ 89 శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తుందని రీసెర్చ్‌లో పాల్గొన్న అధ్యయనవేత్తలు పేర్కొన్నారు. కోవిడ్‌ కారణంగా వ్యక్తి గొంతులో శ్వాస మార్గం, స్వరపేటికలు ఇన్ఫెక్షన్‌కు గురవుతాయి.

దాంతో వచ్చిన మార్పులను ఈ యాప్‌ గుర్తిస్తుందని నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిచ్‌ యూనివర్సిటీ మహిళా పరిశోధకులు వఫా అజ్బవీ చెప్పారు. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ గణాంకాల నుంచి సేకరించిన స్వరనమూనాలను ఈ యాప్‌లో పొందుపరిచారు. ఆరోగ్యవంతులు, అస్వస్తులైన వారివి కలిపి 4,352 మందికి చెందిన 893 ఆడియో శాంపిళ్లను తీసుకున్నారు. ఇందులో 308 మంది కోవిడ్‌ రోగుల వాయిస్‌లూ ఉన్నాయి. యాప్‌ టెస్ట్‌లో భాగంగా నోటితో మూడు నుంచి ఐదుసార్లు గట్టిగా శ్వాస తీసుకోవాలి. మూడు సార్లు దగ్గాలి. స్క్రీన్‌ మీద చిన్న వాక్యాన్ని చదవాలి. వీటిని రికార్డ్‌ చేసిన యాప్‌ నిమిషంలో ఫలితాలు చూపిస్తుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement