ఆకాశం నుంచి దూసుకొచ్చిన మృత్యువు.. అదృష్టం బాగుండటంతో

మహిళ బెడ్రూంలోకి దూసుకొచ్చిన ఉల్క
నిద్రిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదం
ఒట్టావా: మనిషి జీవితం అనేది ఈ విశ్వంలోనే అత్యంత మిస్టరీతో కూడిన విషయం. మన జీవితంలో ఏ నిమిషం ఏం జరుగుతుందో చెప్పడం ఎవరి వల్ల కాదు. జీవితంలో మనం కొన్ని ఆశ్చర్యకరమైన అంశాల గురించి వింటుంటాం. మన జీవితంలో కూడా అలా జరిగితే బాగుండు అనుకుంటాం. కానీ కొన్ని సార్లు అవి అటు ఇటు అయ్యి మన జీవితాలను ప్రమాదంలో పడేస్తాయి.
ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఈ కోవకు చెందిన వార్తే. సాధారణంగా చాలా మంది నక్షత్రం రాలిపడే సమయంలో ఏం కోరుకున్నా జరుగుతుందని నమ్ముతారు. కానీ అదే నక్షత్రం మీ బెడ్‌రూమ్‌లో రాలితే.. ఎలా ఉంటుంది.. ఊహించుకోవడానకే చాలా భయంకరంగా ఉంది కదా.. ఇదే సంఘటన వాస్తవ రూపం దాల్చింది కెనడాలో. ఆ వివరాలు..
అక్టోబర్ 4న ఈ సంఘటన చోటు చేసుకుంది.. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని రూత్ హామిల్టన్ అనే మహిళ తన బెడ్రూంలో నిద్రపోతుంది. ఉన్నట్టుండి ఏదో శబ్దం వినిపించడంతో ఆమె దిగ్గున లేచింది. చూస్తే.. రూత్ దిండుపై ఓ నల్లని వింత పదార్థం కనిపించింది. పరీక్షగా చూసి ఆమె షాకయ్యింది. ఎందుకంటే అదోక ఉల్క. రూత్ లేచిన వేళ బాగుండటంతో ఆమె పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఎందుకంటే ఉల్క ఆమె మీద కాకుండా.. దిండుపై పడటంతో ప్రమాదం తప్పింది. వెంటనే లేచి ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేసింది.
(చదవండి: కెనడాలో వింత వ్యాధి కలకలం.. ఇప్పటికే 48 మంది..)
ఈ సందర్భంగా రూత్ మాట్లాడుతూ.. ‘‘జీవితాన్ని తేలికగా తీసుకోకుడదని ఈ ప్రమాదంతో నాకు అర్థం అయ్యింది. శబ్దం వినపడగానే నేను బెడ్ మీద నుంచి లేవకపోతే ఏం జరిగి ఉండేదో ఆలోచించాలంటేనే భయంగా ఉంది. నేను చనిపోయి ఉండేదాని. అదృష్టం బాగుంటడంతో బతికి బయటపడ్డాను. ఈ నక్షత్రాన్ని నేను దాచుకుంటాను. నా మనవళ్లు దీన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు’’ అని తెలిపింది. ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది.