కెనడాలో వింత వ్యాధి కలకలం.. ఇప్పటికే 48 మంది.. | Sakshi
Sakshi News home page

కెనడాలో వింత వ్యాధి కలకలం.. ఇప్పటికే 48 మంది..

Published Sat, Oct 9 2021 10:43 AM

Mysterious Brain Disease Spreading In Canada - Sakshi

గత రెండు మూడు యేళ్లుగా కోవిడ్‌ సృష్టించిన కల్లోలం అంతాఇంతాకాదు. ఆ భయం నుంచి ఇంకా తేరుకోకముందే మరో వింత వ్యాధి జనాల్లో వ్యాపిస్తోంది. ఈ వ్యాధి లక్షణాలు కూడా వింతగానే ఉన్నాయట.. 

అంతుచిక్కని ఈ వింత వ్యాధి కెనడాలో కలకలం సృష్టిస్తోంది. బ్రన్‌స్విక్‌ ప్రావిన్స్‌లో వెలుగుచూసిన ఈ సంఘటనలో ఇప్పటికే ఈ వ్యాధితో ఆరుగురు మరణించారు. కారణం తెలియని బ్రెయిన్‌ డిసీజ్‌తో పదుల సంఖ్యలో ప్రజలు ఆనారోగ్యబారీన పడుతున్నారు. అక్కడి ప్రాంతీయ మీడియా కథనాల ప్రకారం 48 మంది ఇప్పటికే ఈ వ్యాధి బారీన పడ్డట్టు సమాచారం. వీరంతా మతిమరుపు, తికమకపడటం వంటి వ్యాధి తాలూకు లక్షణాలతో హాస్పిటల్లలో చేరుతున్నారని తెలిసింది. ఈ గుర్తుతెలియని వ్యాధికి గల కారణాలు డాక్టర్లకు కూడా అంతుచిక్కడం లేదు.

తాజా నివేదికల ప్రకారం మరణించిన వారందరూ 18 నుంచి 85 యేళ్ల మధ్య వయసు వారు. మరణించిన వారంతా మానసిక వ్యాధితో మృతిచెం‍దినట్టు నివేదికలో చెప్పబడింది. ఈ వ్యాధి బారీన పడ్డవారిలో ఉద్రేకం,  మైకం, భ్రమలు, మతిమరుపు, కండరాల నొప్పులు అధిక స్థాయిలో పెరిగినట్టు గుర్తించారు. అక్కడి అధికారులు దీనికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపడుతున్నారు.

కాగా గత యేడాది చివరిలో కూడా ఇదే తరహాలో పెద్ద సంఖ్యలో అబ్‌నార్మల్‌ న్యూరోలాజికల్‌ కేసులు బయటపడినట్టు పబ్లిక్‌ హెల్త్‌ ఏజెన్సీ ఆఫ్‌ కెనడా హెచ్చరించింది. మరణించిన వారి మృతదేహాలను పరీక్షించడం ద్వారా దీనికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చింది. 

ఇప్పటికే రకరకాల వ్యాధులతో విసిగివేసారిపోయిన ప్రజలు.. ఎటునుంచి ఏ కొత్త వైరస్‌ రూపంలో ఏ వ్యాధి వ్యాపిస్తుందో తెలియక ప్రాణాలు గుప్పెట్టో పెట్టుకుని క్షణక్షణ గండంగా బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో మెదడుకు సంబంధించిన ఈ కొత్త వ్యాధి ప్రజల్లో భయందోళనలు రేకెత్తిస్తోంది.

చదవండి: ఈ హెర్బల్‌ టీతో మీ ఇమ్యునిటీని పెంచుకోండిలా..

Advertisement
Advertisement