
సహచరులతో పంచుకున్న శుభాంశు రుచికి ఫిదా అయిపోయిన ఆ్రస్టొనాట్లు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో రెండు వారాలుగా ఎటు చూసినా భారతీయతే ఉట్టిపడుతోంది. తన కుశాగ్రబుద్ధి, మానసిక స్థైర్యం, పైలట్ నైపుణ్యాలతో ఇప్పటికే యాగ్జియం–4 మిషన్‌లోని సహచరులను అబ్బురపరిచిన భారత వ్యోమగామి, వాయుసేన గ్రూప్‌కెపె్టన్ శుభాంశు శుక్లా తాజాగా భారతీయ రుచులతో వారితో పాటు ఐఎస్‌ఎస్‌లోని మిగతా సహచరుల మనసు కూడా దోచుకున్నారు!
తనతో పాటు ఐఎస్‌ఎస్‌లోకి వెంట తీసుకెళ్లిన క్యారెట్ హల్వాను వారితో పంచుకున్నారు. రెండు వారాలుగా ఊపిరి సలపని పనులతో తలమునకలుగా ఉన్న వ్యోమగాములంతా శుక్రవారం ఆటవిడుపుగా, సరదా సరదాగా గడిపారు. చివరగా భోజనంలోకి నచ్చిన రుచులను తనివితీరా ఆస్వాదించారు. రొయ్యల వేపు డు స్టార్టర్‌తో మొ దలుపెట్టి చవులూరించే చికెన్ వంటకాల దాకా పలురకాలను ఆరగించా రు.
చివర్లో శుభాంశు వడ్డించిన క్యారె ట్ హల్వా, పెసరప ప్పు హల్వా విందుకే హైలైట్‌గా నిలిచా యి. ఇంతటి రుచి ఇంతకు ముందెన్న డూ ఎరగమంటూ సహచరులంతా ఆయన్ను మెచ్చుకున్నారు. హల్వాను జీవితంలో మర్చిపోలేనని వ్యోమగామి జానీ కిమ్ చెప్పుకొచ్చారు. రుచిలో తేడా రాకుండా దీర్ఘకాలం పాటు నిల్వ ఉండేలా ఆ మిఠాయిలను ఇస్రో, డీఆర్‌డీవో శుభాంశు కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశాయి.
శుభాంశును అలా కాపాడుకున్నాం: ఇస్రో చీఫ్
రాకేశ్ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అంతరిక్షంలో అడుగుపెట్టిన, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోకి ప్రవేశించిన తొలి భారతీయునిగా శుభాంశు పేరు కొద్ది వారాలుగా దేశమంతటా మార్మోగిపోతోంది. యువతతో పాటు దేశంలోని బాల బాలికలంతా ఆయనను ఓ హీరోగా, తమ స్ఫూర్తిప్రదాతగా చూస్తున్నారు.
ఇస్రో అప్రమత్తంగా వ్యవహరించబట్టి సరిపోయింది గానీ, లేదంటే ఇన్ని ఘనతలకు కారణమైన యాగ్జియం అంతరిక్ష యాత్ర ఆరంభమైన కాసేపటికే విషాదాంతమయ్యేదే! ఒళ్లు గగుర్పొడిచే ఈ వాస్తవాన్ని స్వయానా ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ బయట పెట్టారు. జూన్ ప్రథమార్ధంలో యాత్ర పలుమార్లు వాయిదా పడటం తెలిసిందే. ఆ క్రమంలో జూన్ 11 నాటి ప్రయోగాన్ని ఒక్క రోజు ముందు ఇస్రో పట్టుబట్టి ఆపించింది. ‘‘ఫాల్కన్–9 రాకెట్ తాలూకు బూస్టర్‌లో లీకేజీలను, పలు పగుళ్లను ఇస్రో బృందం జూన్ 10 సాయంత్రం గమనించింది.
అప్పటికప్పుడు చర్చించి ప్రయోగాన్ని ఆపాలని నా సారథ్యంలోని ఇస్రో బృందం నిర్ణయం తీసుకుంది. లేదంటే యాగ్జియం–4 ప్రయోగం విషాదాంతం అయ్యేదేమో! అలాకాకుండా చూడటం ద్వారా మన శుభాంశును, యాగ్జి యం మిషన్‌ను కాపాడుకున్నాం’’అని తాజా గా ఓ కార్యక్రమంలో ఇస్రో చీఫ్ వివరించారు. ‘‘మేం మరీ అతిగా స్పందిస్తున్నామని స్పేస్ ఎక్స్ బృందం తొలుత నిందించింది. అయినా మేం పట్టుబట్టి ప్రయోగాన్ని నిలిపేయించాం. ఫాల్కన్ రాకెట్లో పగుళ్లను మర్నాడు స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు ధ్రువీకరించారు’’అని తెలిపారు. నాసా, ఇస్రో సంయుక్త ప్రాజె క్టైన యాగ్జియం–4 జూన్ 26న విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లడం తెలిసిందే.
కుటుంబంతో శుభాంశు మాటామంతి
శుభాంశు శుక్రవారం లఖ్‌నవూలోని తన కుటుంబసభ్యులతో మాట్లాడారు. తను ప్రయోగాలన్నీ దిగి్వజయంగా పూర్తి చేసి సురక్షితంగా తిరిగి రావాలని ఆయన తల్లిదండ్రులు ఆశా, శంభూదళాళ్ శుక్లా ఆకాంక్షించారు. ‘‘ఐఎస్‌ఎస్‌లో తను ఎక్కడ పని చేసే దీ, రోజంతా ఎలా గడిపేదీ శుభాంశు మాకు పూసగుచ్చినట్టు చూపించాడు. అంతరిక్షం నుంచి భూమిని చూసేందుకు రెండు కళ్లూ చాలవట! తన విధులను పూర్తిగా ఆస్వాది స్తుండటం మాకెంతో సంతోషాన్నిస్తోంది’’అని చెప్పుకొచ్చారు.
– సాక్షి, నేషనల్ డెస్క్