Pakistan Crisis: Shehbaz Sharif Elected As New Pakistan Prime Minister - Sakshi
Sakshi News home page

పాక్‌ ప్రధానిగా షహబాజ్‌ షరీఫ్‌

Published Mon, Apr 11 2022 5:27 PM

Shehbaz Sharif Elected As New Pakistan Prime Minister - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌  23వ ప్రధానమంత్రిగా షహబాజ్‌ షరీఫ్‌ (70) సోమవారం ఎన్నికయ్యారు. పాక్‌ పార్లమెంట్‌లో ఇమ్రాన్‌పార్టీ వాకౌట్‌తో షరీఫ్‌ ఎన్నికకు ఎలాంటి వ్యతిరేకతా రాలేదు. షరీఫ్‌ పదవీ స్వీకారానికి ముందు అధ్యక్షుడు అరీఫ్‌ అలీ అనారోగ్యకారణాలు చూపుతూ సెలవు పెట్టారు. దీంతో షరీఫ్‌తో సెనేట్‌ చైర్మన్‌ సాదిక్‌ సంజ్రానీ ప్రమాణ స్వీకారం చేయించారు.  షరీఫ్‌ ఎన్నికతో గతనెల 8న ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో మొదలైన పాక్‌ రాజకీయ డ్రామాకు తెరపడినట్లయిందని నిపుణులు భావిస్తున్నారు. అంతకుముందు పార్లమెంట్‌లో షరీఫ్‌కు 174 ఓట్లు రావడంతో ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌కు ఆయన్ను ప్రధానిగా ప్రకటిస్తున్నట్లు స్పీకర్‌ అయాజ్‌ సిద్ధిఖీ తెలిపారు.

డిఫ్యూటీ స్పీకర్‌ ఖాసిమ్‌ సూరీ పక్కకు తప్పుకోవడంతో సిద్ధిఖీ సభను నడిపించారు. ప్రధానిగా ఎన్నికయ్యేందుకు పాక్‌ పార్లమెంట్‌లో 172 ఓట్లు కావాల్సి ఉంది. అనంతరం పార్లమెంట్‌నుద్దేశించి షరీఫ్‌ ప్రసంగించారు. పాక్‌ చరిత్రలో ఒక ప్రధానికి వ్యతిరేకంగా అవిశ్వాసం విజయం సాధించడం ఇదే తొలిసారన్నారు. చెడుపై మంచి గెలిచిందన్నారు. దేశానికి ఇది శుభదినమని, ఒక ఎంచుకున్న ప్రధానిని (ఇమ్రాన్‌) చట్టబద్ధంగా తొలగించిన రోజని ఆయన అభివర్ణించారు. పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు షహబాజ్‌ సోదరుడు. తన ఎన్నిక రోజు పాక్‌ రూపాయి బలపడడం ప్రజల్లో ఆనందానికి చిహ్నమన్నారు. అవిశ్వాసంపై సుప్రీంకోర్టు తీర్పును ఆయన ప్రశంసించారు. ఆ తీర్పు వచ్చిన రోజు పాక్‌ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

అంతా అబద్ధం
తమ ప్రభుత్వాన్ని పడదోసేందుకు విదేశీ కుట్ర జరిగిందన్న ఇమ్రాన్‌ వ్యాఖ్యలు డ్రామాగా షరీఫ్‌ విమర్శించారు. విదేశీ కుట్ర జరుగుతోందన్న వివాదాస్పద లేఖపై పార్లమెంట్‌ భద్రతా కమిటీకి వివరణ ఇస్తామన్నారు. సైన్యాధికారులు, ప్రభుత్వాధికారులు, ఐఎస్‌ఐ చీఫ్, విదేశాంగ కార్యదర్శి, సదరు లేఖ రాసిన రాయబారి సమక్షంలోనే కమిటీ సభ్యులకు వివరిస్తామన్నారు. ఈ వివాదంలో కుట్ర ఉందని తేలితే తాను రాజీనామాకైనా సిద్ధమన్నారు. నిజానికి సదరు ఉత్తరం మార్చి 7న వచ్చిందని, కానీ తాము అవిశ్వాసా న్ని అంతకుముందే నిర్ణయించుకున్నామని చెప్పారు.  ప్రపంచ రాజకీయాల్లో తమకు సహకరిస్తున్నందుకు ఆయన చైనాను ప్రశంసించారు.

పీటీఐ వాకౌట్‌: పాక్‌ కొత్త ప్రధాని ఎన్నిక సమావేశాన్ని మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు చెందిన పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ బహిష్కరించింది. అంతకుముందు పీటీఐ నేత, మాజీ విదేశాంగ మంత్రి ఖురేషీ మాట్లాడుతూ పాకిస్తాన్‌ ముందు ఆత్మ గౌరవం, బానిసత్వం అనే రెండు దారులున్నాయని చెప్పారు. తమ పార్టీ ఎన్నికలో పాల్గొనకుండా వాకౌట్‌ చేస్తోందని ప్రకటించారు. తమ పార్టీ సభ్యులంతా జాతీయ అసెంబ్లీ నుంచి రాజీనామా చేస్తారని, విదేశీ ఎజెండాతో పనిచేసే ఏ ప్రభుత్వంలో భాగస్వాములు కాబోరని  మాజీ మంత్రి ఫహాద్‌ చౌదరీ చెప్పారు.

షరీఫ్‌కు మోదీ అభినందనలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ కొత్త ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్‌ షరీఫ్‌కు భారత ప్రధాని మోదీ ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. భారత్‌ ఎప్పుడూ శాంతిని, స్థిరత్వాన్ని కోరుతుందన్నారు. ఉపఖండంలో ఉగ్రవాదం ఉండకూడదన్నది భారత్‌ అభిలాషన్నారు. అప్పుడే అభివృద్ధిపై దృష్టి సారించగలమన్నారు.

సవాళ్లు అనేకం
రాజీనామా చేసిన ఇమ్రాన్‌ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతోంది. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూస్తోంది. ఈ నేపథ్యంలో దేశ శాంతి భద్రతలను, ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టాల్సిన పెను సవాళ్లు షరీఫ్‌ ముందున్నాయి.  పార్లమెంట్‌లో షరీఫ్‌ పార్టీకి 86 సీట్లే ఉన్నాయి. పలు మిత్రపక్షాల సహకారంతో తాజా ప్రభుత్వం ఏర్పడింది. వీరిలో ఏ ఒక్కరు అలిగినా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది. వీరందరినీ సంతృప్తి పరచడం, నూతన నాయకత్వంపై ప్రజల్లో ఉన్న అంచనాలను అందుకోవడం కూడా షరీఫ్‌కు సవాలేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దేశంలో పలు చోట్ల ఉగ్రదాడులు జరుగుతున్నాయి. విదేశాంగ శాఖ పనితీరు మసకబారింది. భారత్‌తో ఉద్రిక్తతలు సరేసరి! వీటన్నింటినీ తట్టుకొని షరీఫ్‌ మనుగడ సాగించాల్సిఉంది.

షహబాజ్‌పై నేరారోపణ విచారణ వాయిదా
ఈనెల 27కు వాయిదా వేసిన పాక్‌ కోర్టు
లాహోర్‌: పాక్‌ కొత్త ప్రధాని షహబాజ్‌ షరీఫ్, ఆయన కుమారుడు హంజాపై మనీలాండరింగ్‌ కేసులో నేరారోపణను పాక్‌ కోర్టు ఏప్రిల్‌ 27కు వాయిదా వేసింది. ఆ రోజు వరకు వీరికి ప్రీ అరెస్టు బెయిల్‌ను కూడా మంజూరు చేసింది. దీంతో షరీఫ్‌ ప్రధాని అయ్యేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. కోర్టులో వ్యక్తిగత విచారణ నుంచి తనను ఒక్కరోజు మినహాయించాలని, తమ బెయిల్‌ను పొడిగించాలని అంతకుముందు షహబాజ్‌ వేసిన పిటిషన్‌ను ఫెడరల్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఏజెన్సీ(ఎఫ్‌ఐఏ) కోర్టు అనుమతించిందని కోర్టు అధికారి ఒకరు చెప్పారు. విచారణకు ఎఫ్‌ఐఏ టీమ్‌ న్యాయవాది హాజరుకానందున విచారణ వాయిదా పడింది. 2020లో షహబాజ్‌ ఆయన కుమారులు హంజా, సులేమాన్‌పై ఎఫ్‌ఐఏ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. సులేమాన్‌ అప్పట్లో యూకేకు పారిపోయారు. వీరంతా కలిసి 2008–18 కాలంలో 1,400 కోట్ల పాక్‌ రూపాయల మేర మోసం చేశారని
ఆరోపణలున్నాయి.  

త్వరలో పాక్‌కు నవాజ్‌
లండన్‌లో ఉంటున్న పాక్‌ మాజీ ప్రధాని, షహబాజ్‌ సోదరుడు నవాజ్‌ షరీఫ్‌ వచ్చేనెల్లో ఈద్‌ తర్వాత స్వదేశానికి వచ్చే అవకాశాలున్నాయని పీఎంఎల్‌ఎన్‌ పార్టీ నేతలు చెప్పారు. నవాజ్‌పై ఇమ్రాన్‌ ప్రభుత్వం పలు అవినీతి కేసులు నమోదు చేసింది. దీంతో ఆయన చికిత్స కోసమని కోర్టు అనుమతి తీసుకొని 2019లో దేశం విడిచి లండన్‌ వెళ్లారు.
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement