Salt Bae Restaurant Charges A Customer Rs 1.3 Crore Bill, See Netizens Shocking Reactions - Sakshi
Sakshi News home page

Salt Bae: వామ్మో వాయ్యో..! ఇదేం రెస్టారెంట్‌రా బాబూ! 10 మంది పార్టీకి రూ.కోటి 30 లక్షల బిల్లా?

Nov 21 2022 1:09 PM | Updated on Nov 21 2022 3:00 PM

Salt Bae Restaurant Rs 1-3 Crore Bill Says Quality Never Expensive - Sakshi

బంగాళాదుంపలు ఏమైనా చంద్రుడిపై కాస్తున్నాయా? ఎందుకంత ధర అని ఆగ్రహం వ్యక్తం చేశాడు

టర్కీకి చెందిన ప్రముఖ చెఫ్ నుస్రెత్ గోక్సె.. 'సాల్ట్ బే'గా చాలామందికి సుపరిచితమే. రెస్టారెంట్లో ఆహార పదార్థాలపై మోచేతి పైనుంచి ఉప్పుచల్లే ఈయన తీరుతో బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు పలు దేశాల్లో రెస్టారెంట్లు కూడా నిర్వహిస్తున్నారు. వీటిలో ధర కాస్త ఎక్కువే.

గతేడాది లండన్‌లో ఈయన రెస్టారెంట్‌లోని ధరలు చూసి అందరూ అవాక్కయ్యారు. మరీ ఇంత ఎక్కువా అని వాపోయారు. ఇప్పుడు అబుధాబిలోని సాల్ట్‌ బేకు చెందిన నుస్రే-ఈటీ రెస్టారెంట్‌లో ఓ బిల్లు చూసి నెటిజన్లు కంగుతిన్నారు. ఈ బిల్లు మొత్తం 6,15,065 దిర్హాంలు. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. అక్షరాలా రూ. కోటి 30 లక్షలు.

మొత్తం 10 మంది కలిసి అబుధాబిలోని సాల్ట్‌ బే రెస్టారెంట్‌కు వెళ్లారు. ఎక్కువగా ఆల్కహాలే ఆర్డర్ చేశారు. అందులో చాలా ఫేమస్ అయిన పిట్రస్‌  వైన్ కూడా ఉంది. 2009 నాటి ఈ వైన్‌కే దాదాపు రూ.కోటి రూపాయల బిల్లు అయింది. ఇతర ఫుడ్, వ్యాట్‌తో కలిపి మొత్తం రూ.1.3 కోట్ల బిల్లు అయింది.
ఈ బిల్లు రషీదును స్వయంగా తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేశాడు సాల్ట్ బే. 'నాణ్యత ఎప్పుడూ ఖరీదైనది కాదు'ని రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. మరీ ఆ రేంజ్‍లో ధరలు ఏంటని సాల్ట్‌బేను కొందరు ఏకిపారేశారు. కొంతమందైతే అతడ్ని అన్‌ఫాలో కూడా చేశారు.

ఎందుకంత ధర..?
అయితే ఈ బిల్లులో ఫ్రెంచ్ ఫ్రైస్ ధర 45 డాలర్లు(రూ.3,600)గా ఉంది. దీంతో ఓ నెటిజన్‌.. బంగాళాదుంపలు ఏమైనా చంద్రుడిపై కాస్తున్నాయా? ఎందుకంత ధర అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. హైన్‌కీన్ బీరు ధర కూడా 55 డాలర్లుగా ఉంది. ఇది ఒక్క బీరు ధరా? లేక 12 బీర్ల ప్యాక్‌కా? అని ఓ యూజర్ సెటైర్లు వేశాడు.

మరో నెటిజన్ అయితే.. సాల్ట్ ‍బేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నవ్వు పేద కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి స్వతహాగా ఈ స్థాయికి చేరుకున్నావు. నిన్ను చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు. కానీ నీ రెస్టారెంట్‌లో ధరలు ఇంత ఎక్కువగా ఎందుకున్నాయి. కేవలం సంపన్నుల కోసమేనా. నువ్వు చెఫ్ కాదు చీప్ అంటూ ఫైర్ అయ్యాడు.
మరోవైపు సాల్ట్ బే మాత్రం ఈ బిల్లుపై వస్తున్న విమర్శలు అసలు పట్టించుకోలేదు. తన స్టయిల్‌లోనే ముందుకు సాగుతున్నాడు. ఓ స్టీక్‌కు(కాల్చిన మాంసం ముద్ద) గోల్డ్ కోట్ చేసి ఉన్న ఫోటో షేర్ చేశాడు. ఫెడరల్ బ్యాంక్‌ 24 క్యారట్ల బంగారంతో ఈ స్టీక్‌కు కోటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్లు మరోసారి షాక్ అయ్యారు.
చదవండి: కిక్కిరిసిన అభిమానులు.. భయానక పరిస్థితి.. కొంచెం అటు ఇటు అయినా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement