FIFA World Cup 2022: కిక్కిరిసిన అభిమానులు.. ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి.. కాస్త అటు ఇటు అయినా..!

Qatar Fifa World Cup Fan Zone Descends Into Crowd Chaos - Sakshi

దోహా: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫుట్ బాల్ ప్రపంచకప్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఫిఫా వరల్డ్‌కప్‌కు ఈ దేశం తొలిసారి ఆతిథ్యం ఇస్తుండటంతో అభిమానులు ఊహించిన  దానికంటే భారీ స్థాయిలో తరలివచ్చారు. దీంతో ఖతర్-ఈక్వెడార్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంచెం ‍అటు ఇటు అయినా ఊహించని పరిణామాలు ఎదురయ్యేవని మ్యాచ్ తిలకించడానికి వెళ్లిన అభిమానులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు.

టోర్నమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా దోహాలో స్టేడియం వద్ద వరల్డ్‌కప్ ఫ్యాన్ జోన్‌ను ఏర్పాటు చేశారు. అయితే అభిమానులు అంచనాలకు మించి వేలాదిగా తరలివచ్చారు. దీంతో ప్రవేశద్వారాలను మూసివేశారు అధికారులు. భారీగా పోలీసులను మోహరించారు. అభిమానులు రక్షణ గీత దాటకుండా పోలీసులు లాఠీలు, కవచాలు పట్టుకుని నిలువరించారు. దీంతో ఫ్యాన్ జోన్ సమీపంలో జనం భారీగా గూమిగూడి ఊపిరికూడా సరిగ్గా పీల్చుకోలేని విధంగా కిక్కిరిసిపోయారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్లలో మ్యాచ్‌ను వీక్షించారు.
అయితే మ్యాచ్‌ సమయంలో తాము నరకం చూసినట్లు స్టేడియం వద్దకు వెళ్లిన ఇరాక్‌ అభిమాని హతె ఎల్ బెరారీ పేర్కొన్నాడు. తాను దుబాయ్‌లో పనిచేస్తున్నానని మ్యాచ్ కోసమే ఖతర్ వచ్చినట్లు చెప్పాడు.  పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని వాపోయాడు.

చనిపోయేవారు..
'జనం చనిపోయేవారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఇలాంటి భారీ సమూహంలో పరిస్థితి అటూ ఇటూ అయితే వాళ్లు తట్టుకోలేరు. దేవుడి దయ వల్ల నేను కాస్త పొడుగ్గా ఉండటంతో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపడలేదు. కానీ కొంతమంది చిన్నారులను చూసినప్పుడు వాళ్లను పైకి ఎత్తుకోమని తల్లిదంద్రులకు చెప్పాను. పిల్లలు ఈ పరిస్థితిలో ఊపిరి సరిగ్గా పీల్చుకోలేరు. నా కుటుంబం మ్యాచ్ తిలకించడానికే వచ్చింది. కానీ నేను వాళ్లను చేరుకోలేకపోయాను. ఏం చేయాలో తెలియలేదు. ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు.' అని అభిమాని వివరించాడు.
ఆ ఘటన గుర్తుకొచ్చింది..
లాంజ్‌ ఏంజెలెస్‌కు చెందిన మరో అభిమాని లూయిస్ రేయ్స్ కూడా భయానక పరిస్థితిని వివరించాడు. కొద్దిరోజుల క్రితం దక్షిణ కొరియాలో తొక్కిసలాటలో 150 మంది చనిపోయిన ఘటన తనకు గుర్తుకు వచ్చిందని చెప్పాడు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే ఉండని, జనం నలిగిపోయారని వివరించాడు. ఒక్క అడుగు ముందుకు గానీ, వెనక్కి గానీ వేయలేని పరిస్థితి ఉందని పేర్కొన్నాడు. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని, భయటకు వెళ్లిపోమని తన కుమారుడికి చెప్పినట్లు తెలిపాడు.

అయితే ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? లేదా అరెస్టయ్యారా? అనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. ప్రీ వరల్డ్‌కప్‌ కన్సర్ట్‌ సందర్భంగా శనివారం రాత్రి కూడా ఇలాంటి పరిస్థితే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఖతర్ జట్టు ఈక్వెడార్ చేతిలో 2-0 తేడాతో ఓడిపోయింది. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే తొలి మ్యాచ్‌లో ఆతిథ్యజట్టు ఓటమి పాలవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
చదవండి: వహ్వా! అయ్యో ఆతిథ్య జట్టు...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top