ఉక్రెయిన్ చేతిలో ఓడిపోతున్న రష్యా..!! | Russias Costly War High Losses Limited Gains | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్ చేతిలో ఓడిపోతున్న రష్యా..!!

Jul 5 2026 7:17 PM | Updated on Jul 6 2026 7:40 AM

Russias Costly War High Losses Limited Gains

నాలుగేళ్ల క్రితం.. 2022 ఫిబ్రవరి 24న మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఇప్పుడు ఎవరూ ఊహించని ఒక సంచలన మలుపు తిరిగింది. ఒకప్పుడు ఉక్రెయిన్‌ను కేవలం మూడు రోజుల్లో లొంగదీసుకుంటామని భావించిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌కు, ఇప్పుడు 2026లో కోలుకోలేని షాక్ తగిలిందా? ఐదో ఏట అడుగుపెట్టిన ఈ యుద్ధంలో ఉక్రెయిన్ పైచేయి సాధిస్తోందా? రష్యా సైనిక వ్యవస్థతో పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలే స్థితికి చేరుకుందా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆర్డర్ వేసినట్లు 2026 చివరి నాటికి డాన్‌బాస్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించడం రష్యాకు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు పుతిన్ ముందు రెండే దారులు ఉన్నాయి. ఆ దారులు ఏంటి? ఉక్రెయిన్ భారీ గ్రౌండ్ అటాక్స్‌కు బదులుగా ఏ కొత్త యుద్ధ వ్యూహాన్ని అమలు చేస్తోంది? ఉక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థలో ఏ ప్రధాన రంగం ఎక్కువగా దెబ్బతింది? 

మొదటగా రష్యా సాధించిన పురోగతిని ఒక్కసారి గమనిస్తే.. 2014లో మొదటి విడతగా రష్యా కేవలం 7 శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత 2022లో పూర్తిస్థాయి దండయాత్ర మొదలుపెట్టినప్పుడు.. గరిష్టంగా 27 శాతం భూభాగాన్ని తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంది. కానీ, ఉక్రెయిన్ ఎదురుదాడితో అది 18 శాతానికి పడిపోయింది. అయితే, గత మూడున్నరేళ్లుగా రష్యా సాధించింది ఏంటో తెలుసా? కేవలం ఒకటిన్నర శాతం (1.5%) అదనపు భూభాగం మాత్రమే! వినడానికి ఇది చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఈ చిన్న ముక్క కోసం రష్యా చెల్లించిన మూల్యం ఎంతో తెలిస్తే మీ గుండె గుభేల్ మంటుంది. 

గత మూడున్నరేళ్లలో ఈ 1.5 శాతం భూమిని గెలవడానికి దాదాపు 5 లక్షల మంది మరణించినట్లు.. మరో 7 లక్షల మంది తీవ్రంగా లేదా పాక్షికంగా గాయాలపాలైనట్లు అంతర్జాతీయ నిఘా వర్గాల విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 10 లక్షలకు పైనే ఉంటుందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీ కంటే చిన్నదైన ఈ భూభాగం కోసం రష్యా ఇంతటి రక్తపాతాన్ని చవిచూడాల్సి వచ్చింది. అంటే రష్యాలోని మొత్తం పోరాడే వయసున్న యువకుల్లో 3 శాతం మంది ఈ యుద్ధంలో తుడిచిపెట్టుకుపోయారు. 21వ శతాబ్దంలో ఇంతటి ఘోరమైన గణాంకాలు బహుశా ఏ దేశానికీ లేవు.

అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే.. రష్యా సైనికుల మరణాల రేటు 2026లో విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం రష్యా నెలకు సగటున 35 వేల మంది సైనికులను నష్టపోతోంది. రష్యా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల యువకులకు సాధారణ జీతం కంటే 7 నుంచి 8 రెట్లు ఎక్కువ డబ్బులు, ఉచిత భూములు, రుణాల మాఫీ ఆశ చూపి సైన్యంలో చేర్చుకున్నప్పటికీ.. ఇప్పుడు చనిపోతున్న వారి సంఖ్యతో పోలిస్తే కొత్తగా చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అంటే, రష్యాకు ఇప్పుడు 'మ్యాన్‌పవర్' కొరత స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ కూడా దాదాపు 6 లక్షల మంది సైనికులను కోల్పోయింది. జనాభా పరంగా చూస్తే ఉక్రెయిన్‌కు ఇది 7 శాతం నష్టం. అందుకే ఉక్రెయిన్ తన పాత వ్యూహాన్ని మార్చింది. రష్యా ఆక్రమించిన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సైనికులను పంపే భారీ గ్రౌండ్ అటాక్స్ పద్ధతిని పక్కన పెట్టి.. 'అసిమెట్రిక్ వార్‌ఫేర్' అంటే డ్రోన్ల ద్వారా రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసే సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుంది.

అవును, ఉక్రెయిన్ ఇప్పుడు సరిహద్దుల పొడవునా వందల కిలోమీటర్ల మేర ఒక 'డ్రోన్ గోడ' నిర్మించింది. దాదాపు 150కి పైగా స్థానిక కంపెనీలతో మిలియన్ల కొద్దీ FPV డ్రోన్లను తయారు చేయిస్తోంది. ఈ డ్రోన్ల నిఘా వల్ల రష్యా సైన్యం కదలడమే కష్టంగా మారింది. గాయపడిన సైనికులను కాపాడటానికి హెలికాప్టర్లు కూడా రాలేకపోతున్నాయి. 

ఫలితంగా ఒకప్పుడు రష్యా వైపు గాయపడిన 10 మందిలో ఒకరు చనిపోతే, ఇప్పుడు ప్రతీ నలుగురిలో ఒకరు చనిపోతున్నారు. అంతేకాదు, ఉక్రెయిన్ ఏకంగా 1,750 కిలోమీటర్ల దూరం ప్రయాణించే లాంగ్-రేంజ్ డ్రోన్లతో రష్యా లోపలికి చొచ్చుకుపోతోంది. రష్యాకు ప్రధాన ఆదాయ వనరైన ఆయిల్, గ్యాస్ రిఫైనరీలపై ఉక్రెయిన్ 'కైనెటిక్ శాంక్షన్స్' పేరిట విరుచుకుపడుతోంది. మొన్న ఏప్రిల్, మే నెలల్లోనే దాదాపు 20 రష్యన్ ఆయిల్ రిఫైనరీలను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం రష్యా ఆయిల్ ఎగుమతులు రోజుకు 3 లక్షల బారెళ్లకు పడిపోయాయి. 2009 తర్వాత రష్యాలో ఇంత తక్కువ ఆయిల్ ఉత్పత్తి జరగడం ఇదే మొదటిసారి.

రష్యాకు తగులుతున్న షాక్‌లు ఇక్కడితో అయిపోలేదు. అంతరిక్షంలో ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా వాడుతున్న స్టార్‌లింక్ ఇంటర్నెట్ టెర్మినల్స్‌ను స్పేస్ ఎక్స్ సంస్థ బ్లాక్ చేసింది. దీనివల్ల రష్యా సైనిక కమ్యూనికేషన్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. అలాగే రష్యా ప్రభుత్వం దేశంలో టెలిగ్రామ్ యాప్‌ను బ్యాన్ చేయడం వల్ల వారి సొంత కమ్యూనికేషన్స్ కూడా దెబ్బతిన్నాయి. ఆర్థికంగా చూస్తే రష్యా పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. రష్యా తన ద్రవ్యోల్బణం కేవలం 5 శాతమే అని చెబుతున్నా, స్వీడన్ నిఘా వర్గాల ప్రకారం అది నిజానికి 15 శాతానికి పైనే ఉంది.

 రష్యా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఏకంగా 21 శాతానికి పెంచడమే దీనికి నిదర్శనం. యుద్ధం సుదీర్ఘంగా సాగుతుండటంతో రష్యా ప్రజల్లో పుతిన్ పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఒకప్పుడు 77 శాతం ఉన్న పుతిన్ అప్రూవల్ రేటింగ్ ఇప్పుడు 65 శాతానికి పడిపోయింది. బడ్జెట్ లోటును భర్తీ చేయడానికి రష్యా తలప్రాణం తోకకు వస్తోంది. కానీ ఉక్రెయిన్ కథ వేరు. ఐరోపా సమాఖ్య నుంచి ఉక్రెయిన్‌కు 90 బిలియన్ యూరోల వడ్డీ లేని భారీ రుణం మంజూరైంది. విశేషం ఏంటంటే.. ఈ అప్పును రష్యా చెల్లించాల్సిన యుద్ధ నష్టపరిహారం నుంచే వసూలు చేయాలని ఐరోపా సమాఖ్య భావిస్తోంది. జర్మనీ, బ్రిటన్, డెన్మార్క్ వంటి దేశాలు నేరుగా ఉక్రెయిన్‌తో కలిసి డ్రోన్లు, రాకెట్ ఇంధనాన్ని తయారు చేస్తున్నాయి.

ఇవన్నీ గమనిస్తుంటే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆర్డర్ వేసినట్లు 2026 చివరి నాటికి డాన్‌బాస్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించడం రష్యాకు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు పుతిన్ ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి.. అవమానాన్ని భరిస్తూనే యుద్ధాన్ని ఆపేసి సీజ్‌ఫైర్ (Ceasefire) ప్రకటించడం. రెండు.. మరో 2 లక్షల మందిని బలవంతంగా సైన్యంలోకి చేర్చుకుంటూ రెండో విడత జనరల్ మొబిలైజేషన్ ప్రకటించడం. కానీ రెండో దారి ఎంచుకుంటే రష్యా ప్రజల నుండి తీవ్ర తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా, 2026 సంవత్సరం ఉక్రెయిన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మరి రష్యా ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుంది? పుతిన్ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు? అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి. 

:: హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement