ఎస్‌యూ–57 జెట్‌ను జట్టుగా తయారుచేద్దాం!  | Russian President Vladimir Putin big Su-57 offer as India, 5th-gen fighter jet | Sakshi
Sakshi News home page

ఎస్‌యూ–57 జెట్‌ను జట్టుగా తయారుచేద్దాం! 

Jun 6 2026 4:32 AM | Updated on Jun 6 2026 8:53 AM

Russian President Vladimir Putin big Su-57 offer as India, 5th-gen fighter jet

అత్యాధునిక ఐదోతరం స్టెల్త్‌ విమానం తయారీపై భారత్‌కు పుతిన్‌ భారీ ఆఫర్‌ 

సంయుక్తంగా దేశీయంగా ఉత్పత్తి చేద్దామని ప్రతిపాదన 

భారత వైమానికదళం బలోపేతానికి కృషిచేస్తామని ప్రతిన

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌: చిరకాల మిత్రదేశం భారత్‌కు తమ శక్తివంతమైన అత్యాధునిక యుద్ధవిమానాలను సైతం ధారాదత్తం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. దీంతో భారత వైమానికదళం మరింత పటిష్టవంతమయ్యేందుకు పుతిన్‌ భారత్‌కు భారీ ఆఫర్‌ ఇచ్చారు. రష్యాలో రెండో అతిపెద్ద నగరం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో భేటీలో పుతిన్‌ సుదీర్ఘంగా మాట్లాడారు. రష్యా అభివృద్ధిచేసిన ఐదో తరం స్టెల్త్‌ రకం ‘ఎస్‌యూ 57’జెట్‌ను భారత్‌తో కలిసి దేశీయంగా మరింత అధునాతనంగా తీర్చిదిద్దేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పుతిన్‌ వెల్లడించారు.

 ‘‘ఎస్‌యూ–57 రకం యుద్ధవిమానాన్ని మరింత అధునాతనంగా భారత్‌తో కలిసి, భారత్‌లో తీర్చిదిద్దేందుకు రష్యా సిద్ధంగా ఉంది. నిజానికి ఈ విమానాన్ని మేం సొంతంగా అభివృద్ధిచేశాం. కానీ ఇప్పుడు మిత్రదేశం భారత్‌లో తయారుచేసేందుకు ఆశపడుతున్నాం. ఈ విమానం విషయంలో ఎలాంటి షరతులు విధించదల్చుకోలేదు’’అని అన్నారు. ‘‘సమీకృత గగనతల రక్షణ వ్యవస్థల అభివృద్ధిలోనూ భారత్‌ను భాగస్వామిగా చేర్చుకోవాలని భావిస్తున్నాం. ఇతర యుద్ధరంగ ఉపకరణాల తయారీని సంయుక్తంగా ఆరంభిద్దాం. దీనిపై ఆలోచిస్తామని భారత్‌ గతంలోనే మాకు సమాచారం ఇచ్చింది’’అని పుతిన్‌ వెల్లడించారు. పుతిన్‌ ఆఫర్‌పై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్‌ జైశ్వాల్‌ స్పందించారు. ‘‘రక్షణ రంగ సంబంధం అంశంలో మీకు అదనపు సమాచారం కావాలంటే రక్షణమంత్రిత్వ శాఖనే బదులు ఇవ్వగలదు’’అని ఆయన అన్నారు. 

భారత్‌ వైఖరేంటి? 
అంతర్జాతీయంగా మారిన రాజకీయ¿ౌగోళిక పరిస్థితులు, ఉక్రెయిన్, పశి్చమాసియా యుద్ధాలతో భారత్‌ రక్షణ ఉత్పత్తుల సరఫరాలో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ముఖ్యంగా ఐదో తరం యుద్ధవిమానం కోసం వెతికి విసిగిపోయి చివరకు సొంతంగా తయారుచేయాలని నిశ్చయించుకుంది. ఇందులోభాగంగా ప్రతిష్టాత్మకంగా అత్యాధునిక బహుళార్థ యుద్ధవిమాన(ఏఎంసీఏ) ప్రాజెక్టుకు శ్రీకారంచుట్టింది. అయితే 2035లోపు ఈ విమానం అందుబాటులోకి వచ్చే అవకాశాలులేకపోవడంతో పుతిన్‌ ఆఫర్‌ను భారత్‌ అంగీకరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

భారత్‌–చైనా విషయంలో జోక్యం చేసుకోబోం 
‘‘చైనా, భారత్‌ మధ్య సున్నితమైన ద్వైపాక్షిక సంబంధాల్లో రష్యా ఎన్నడూ జోక్యంచేసుకోలేదు. ఇకమీదటా కలగజేసుకోబోం. రెండు దేశాలతో రష్యా సంబంధాలు సహజమైనవి. సరిహద్దు అంశం సహా వివాదాస్పద అంశాలన్నింటినీ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నా. భారత్‌–రష్యా బంధం చైనాను ఇబ్బంది పెట్టదు. అలాగే రష్యా–చైనా బంధం భారత్‌ను ఇబ్బందిపెట్టదు. భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దు విషయంపై చైనా, రష్యాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఇక పాకిస్తాన్‌ అనేది చైనా కనుసన్నల్లో నిర్ణయాలు తీసుకుంటోందని నేను భావించట్లేను’’అని అన్నారు. 

అలా చేస్తే అంతర్జాతీయ అస్థిరతే 
‘‘భారత్‌–రష్యా బంధాన్ని తుంచేయాలని పశి్చమదేశాలు కుట్రలు పన్నుతున్నాయి. మా బంధం బలహీనమైతే అంతర్జాతీయ అస్థిరతకు దారితీస్తుంది. భారత విదేశాంగ విధానం స్వతంత్రమైంది. భారత్‌తో రష్యా బంధం మరింత బలోపేతానికి కృషిచేస్తున్నాం. ప్రస్తుతమున్న 60 బిలియన్‌ డాలర్ల వాణిజ్యబంధాన్ని త్వరలో 100 బిలియన్‌ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వాణిజ్యం, పెట్టుబడులు సహా ఇంధనం, ఫార్మాసూటికల్స్, హైడ్రోకార్భన్ల వంటి కీలక రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచుకోవాల్సిఉంది. 

చక్కటి ఆర్థికాభివృద్ధి సాధిస్తూ భారత్‌ ప్రపంచంలోని మేటి ఆర్థికవ్యవస్థల్లో ఒకటిగా రాణిస్తోంది. ఈ ప్రగతి ఒక్క రోజులో వచ్చిందికాదు. మోదీ నాయకత్వంలో ఎంతో శ్రమతో భారత్‌ అద్భుతమైన పురోగతి సాధిస్తోంది. మా రెండు దేశాల మధ్య చిచ్చుపెట్టాలని చూసే దేశాలే చావుదెబ్బ తింటాయి’’అని పరోక్షంగా అమెరికాకు చురకలంటించారు. ‘‘ప్రధాని మోదీపై కొందరు(అమెరికా) ఒత్తిడిచేస్తున్నారు. ఎవరు ఒత్తిడి చేస్తున్నారనేది అనవసరం. మా దేశాల మధ్య సత్సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయి. భారత్‌ మాకు విశ్వసనీయమైన వ్యూహాత్మక భాగస్వామి’’అని పుతిన్‌ ఉద్ఘాటించారు.

దేవుడికే తెలుసు 
2036 ఏడాదిదాకా మీరే అధ్యక్షపీఠంపై కొనసాగుతారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు పుతిన్‌ తనదైన రీతిలో బదులిచ్చారు. నాకు 73 ఏళ్లు. 1999 నుంచి అధికారంలో ఉంటున్నాను. వచ్చే అధ్యక్ష ఎన్నికలపై నాకు ఎలాంటి ఆలోచన లేదు. అప్పటిదాకా ఏమాత్రం ఆరోగ్యంగా ఉంటానో ఆ దేవునికే తెలియాలి. ఇవాళ ఇక్కడ కూర్చున్న మనందరం రేపు, ఎల్లుండి, ఆ తర్వాతి రోజులకు కూడా చేయాల్సిన విధులను నిర్వర్తిస్తామో లేదో ఎవరికీ తెలీదు’’అని పుతిన్‌ వ్యాఖ్యానించారు. పుతిన్‌ తొలిసారిగా 1999లో ప్రధాని అయ్యారు. తర్వాత అధ్యక్షునిగా, ఆ తర్వాత ప్రధానిగా పనిచేశారు. మళ్లీ అధ్యక్షపీఠాన్ని అధిరోహించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement