
అధ్యక్షుడు పుతిన్ పాల్గొనాల్సిన కార్యక్రమాలూ రద్దు
మాస్కో: ఉక్రెయిన్ డ్రోన్ దాడులు తీవ్రతరం చేసిన నేపథ్యంలో రష్యా తన నేవీ డే వేడుకలపై కోత పెట్టింది. భద్రతాపరమైన ఆందోళనలతో బాల్టిక్ సముద్ర తీరంలోని సెయింట్ పీటర్స్‌బర్గ్, కలినిన్ గ్రాడ్‌లలో, సుదూర తూర్పు తీర నౌకాశ్రయంలో వార్షిక నేవీ డే ఉత్సవాల సందర్భంగా ఆదివారం చేపట్టాల్సిన యుద్ధ నౌకల పరేడ్‌లను రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని రష్యా అధికారులు తెలిపారు. సొంత నగరం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని నేవీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు పుతిన్ స్వయంగా హాజరు కావాల్సిన జరిగే కార్యక్రమాలను సైతం రద్దు చేసుకుంది.
ఈ విషయాన్ని అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ధ్రువీకరించారు. అన్ని రకాల పరిస్థితులను బేరీజు వేసుకున్నాకే ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు. భద్రతకు మించింది మరేది లేదని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి నుంచి వివిధ ప్రాంతాలపైకి ఉక్రెయిన్ ప్రయోగించిన 99 డ్రోన్లను కూల్చినట్లు ఆదివారం రక్షణ శాఖ తెలిపింది. వీటిలో సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంపైకి వచ్చినవి కూడా ఉన్నాయంది. లెమొనొసోవ్ ప్రాంతంలో డ్రోన్ శకలాలు పడి ఒక మహిళ గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. డ్రోన్ల భయంతో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని పుల్కొవో ఎయిర్‌పోర్టు అధికారులు ఆదివారం ఉదయం డజన్ల కొద్దీ విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ నగరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో అధ్యక్షుడు పుతిన్ పాల్గొన్నారు. యుద్ధ నౌకలను నిర్మించడంతోపాటు నేవీ శిక్షణను వేగవంతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.