రస్సోఫోబియా.. ఉక్రెయినీయన్ల ప్రాణాల కంటే ఎక్కువా?

Russian Ladies Russophobia Protest Misfire Amid Ukraine Massacre - Sakshi

ఒకవైపు యుద్ధ భయంతో ఉక్రెయిన్‌ పౌరులు దేశం విడిచిపారిపోతున్నారు. మరోవైపు యుద్ధంలో ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు. సాటి మనిషి ఆపదలో ఉంటే కనీసం స్పందించని కొందరు.. తిన్నది ఆరగక చేస్తున్న నిరసన గురించే ఇప్పుడు చెప్పబోతున్నాం. 

రష్యాలో ఉన్నత వర్గాలకు చెందిన కొందరు మహిళలు.. తమ లెదర్‌ హ్యాండ్‌ బ్యాగులను కత్తిరించి, ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఫ్రెంచ్‌(ఫ్రాన్స్‌) లగ్జరీ ఐటెమ్స్‌ బ్రాండ్‌ ‘చానెల్‌’.. తమ ప్రొడక్టులను రష్యన్‌ లేడీస్‌కు అమ్మకూడదని నిర్ణయించుకుంది. రష్యాపై ఈయూ ఆంక్షల నేపథ్యంలో చాలా కాలం కిందటే స్టోర్‌లను సైతం మూసేసింది చానెల్‌. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ తరుణంలోనే వీళ్లు ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు.   

రస్సోఫోభియా-సపోర్టింగ్‌ బ్రాండ్స్‌ ట్రెండ్‌కు వ్యతిరేకంగా ప్రముఖ మోడల్‌ విక్టోరియా బోన్యా, నటి మరినా ఎర్మోష్‌ఖినా తో పాటు టీవీ సెలబ్రిటీలు, డిస్కో జాకీలు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. కత్తెరతో తమ దగ్గరున్న చానెల్‌బ్యాగులను ముక్కలుగా కత్తిరించేస్తున్నారు. 

‘మాతృదేశం కోసం..’ అంటూ వాళ్లు చేస్తున్న పనికి కొంత అభినందనలు దక్కుతున్నా.. విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకవైపు ఉక్రెయిన్‌ పౌరులు ప్రాణ భయంతో దేశం విడిచిపోతున్నారు. తినడానికి తిండి కూడా దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అన్నింటికి మించి రష్యా బలగాలు.. ఉక్రెయిన్‌ గడ్డపై మారణహోమానికి తెగపడుతున్నాయి. ఇందులో ఏ ఒక్క అంశంపై స్పందించేందుకు ధైర్యం లేని వీళ్లు, కనీసం సాటి మనుషులకు సంఘీభావం తెలపని వీళ్లు.. ఇలా బ్యాగులను చింపేస్తూ నిరసన తెలపడం నిజంగా విడ్డూరం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top