Russia-Ukraine War: అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి!

Russia-Ukraine War: Special Stoty On Russia President Vladimir Putin, Ukraine and Belarus - Sakshi

పుతిన్‌కు శిరోభారంగా యుద్ధం

వికటిస్తున్న దుస్సాహసం

ఇమేజీకి ఇంటాబయటా డ్యామేజీ

అధ్యక్ష ఎన్నికల్లో విజయంపై కన్ను

యుద్ధాన్ని అప్పటిదాకా సాగదీసే యత్నం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం రెండో ఏడాదిలోకి చొరబడింది. దురాక్రమణ ప్రయత్నాలు జోరుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాది మారణహోమం తర్వాత కూడా వ్లాదిమిర్‌ వ్లాదిమిరోవిచ్‌ పుతిన్‌ రాజ్యకాంక్ష ఏమాత్రం చల్లారలేదు.

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉక్రెయిన్‌పై ఉరుకులు పరుగుల మీద విరుచుకుపడ్డ రష్యాకు, తన అస్త్రాలేవీ పనికిరాకుండా పోయాయని జ్ఞానోదయం కలగడానికి ఎంతోసేపు పట్టలేదు. బాహుబలిగా కాలుదువ్విన పుతిన్‌ ఏడాది తిరిగేసరికి ప్రపంచం దృష్టిలో విలన్‌ అయ్యారు. సొంత ప్రజల దృష్టిలోనూ బాహుబలి హోదాను ఒకింత కోల్పోయారు. ఇంతకీ పుతిన్‌ ఊహించినదేమిటి? ఆయనకు ఎదురైందేమిటి...?

ఎస్‌ రాజమహేంద్రారెడ్డి: పూర్వపు సోవియట్‌ యూనియన్‌ రిపబ్లిక్కులన్నింటినీ మళ్లీ ఒకే తాటిమీదకు తేవాలన్నది తన లక్ష్యమని పుతిన్‌ చెప్పుకుంటారు. పొరుగు దేశాలైన ఉక్రెయిన్, బెలారస్‌ కూడా ఒకప్పుడు రష్యాలో అంతర్భాగమేనని అంటారాయన. రెండేళ్ల క్రితం ఆయన రాసిన ఓ సుదీర్ఘ వ్యాసంలో కూడా ఈ విషయాన్ని సుస్పష్టం చేశారు.

బెలారస్‌తో రష్యాకు ఎలాంటి విభేదాలూ లేవు. పైగా ఉక్రెయిన్‌పై దాడిలో రష్యాకు ఆదినుంచీ అది వెన్నుదన్నుగా ఉంది. రష్యా తొలుత ఉక్రెయిన్‌లో చొరబడేందుకు తన భూభాగాన్ని అనుమతించింది కూడా. ఎటొచ్చీ పుతిన్‌కు పేచీ అల్లా ఉక్రెయిన్‌తోనే! ఆ దేశ సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి కూడా రష్యా ఎన్నడూ ఇష్టపడలేదు. రష్యా, ఉక్రెయిన్‌ ఒకే దేశమన్నదే పుతిన్‌ గట్టి నమ్మకం. 

లోగుట్టు వేరే
నిగూఢంగా చూస్తే మాత్రం, ఈ గొడవంతా పైపై పటారమే. అసలు విషయం ఏమిటంటే సుదీర్ఘ కాలం పాటు రష్యాకు తిరుగులేని నాయకునిగా వెలిగిపోవాలన్నది పుతిన్‌లో అంతర్లీనంగా ఉన్న ఆశగా చెప్తారు. మూడేళ్ల క్రితం ఆయన ఆ దిశగా ప్రయత్నం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణతో రాజ్యాంగాన్ని మార్చి అధ్యక్షునిగా 16 ఏళ్లపాటు నిరాటంకంగా కొనసాగేలా కొత్త చట్టం తెచ్చేందుకు క్రెమ్లిన్‌ ప్రయత్నించింది. ఆ సమయంలో రష్యా టీవీ పుతిన్‌ కీర్తనలు, గుణగానాలతో హోరెత్తేది.

‘కల్లోల సాగరంలాంటి ప్రపంచంలో రష్యా నౌకను సమర్థంగా నడిపిస్తున్న కెప్టెన్‌ పుతిన్‌’ అంటూ ఊదరగొట్టేవారు. క్రెమ్లిన్‌ దృష్టిలో పుతిన్‌ సకల కళావల్లభుడు, సకలశాస్త్ర పారంగతుడు. అందుకే జూడో, రేసింగ్, స్విమ్మింగ్, హార్స్‌ రైడింగ్‌ విన్యాసాల్లో పుతిన్‌ సాహసకృత్యాల తాలూకు ఫొటోలను తరచూ ప్రపంచం ముందుకు తెస్తూంటుంది క్రెమ్లిన్‌. రష్యా ప్రజలను ప్రభావితం చేసి పుతిన్‌ పట్ల ఆరాధనా భావాన్ని పెంపొందించే ప్రయత్నాల్లో క్రెమ్లిన్‌ ఎంచుకున్న మార్గమిది.

అసలు విషయమేమిటంటే 2024లో రష్యా అధ్యక్ష ఎన్నికలున్నాయి. ఆలోపు ఏదో ఒక ఘనకార్యం చేసి పుతిన్‌ కీర్తిని అమాంతం పెంచేయడం క్రెమ్లిన్‌ లక్ష్యం. పశ్చిమ దేశాల కనుసన్నల్లో సాగుతున్న ఉక్రెయిన్‌ను ఓ దారికి తెస్తే బాహుబలి పుతిన్‌ సత్తా ఏమిటో తెలుస్తుందని, అధ్యక్ష ఎన్నికల్లో మంచి ప్రచారాస్త్రంగా మారుతుందని క్రెమ్లిన్‌ థింక్‌టాంక్‌ అంచనా. అనుకున్నదే తడవుగా దాడికి దిగడం, ఆరంభంలో కొన్ని ప్రాంతాను ఆక్రమించి ఎగిరి గంతెయ్యడం... తర్వాత ఉక్రెయిన్‌ధాటికి తట్టుకోలేక వాటిని వదిలేసి తోకముడవడం చకచకా జరిగిపోయాయి.

అయినా సరే, ఇప్పటికీ ఉక్రెయిన్‌పై దాడిని తప్పుగా పుతిన్‌ అంగీకరించడం లేదు. రెండు మూడు రోజుల క్రితం మాట్లాడుతూ ఇదంతా పశ్చిమ దేశాల కుట్రేనని సెలవిచ్చారు! దానికి జవాబుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఏకంగా ఉక్రెయిన్‌ యుద్ధభూమిలో అడుగుపెట్టారు! ఈ పోరులో తమ వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టారు. ఉక్రెయిన్‌ను గెలవడం రష్యా తరం కాదని అక్కడే మీడియాముఖంగా ప్రకటించేశారు. బహుశా పుతిన్‌ కూడా ఇలాంటి సవాలు కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు! ఏదోలా వచ్చే ఏడాది రష్యా అధ్యక్ష ఎన్నికల దాకా యుద్ధం కొనసాగాలన్నదే ఆయన అభిమతమని పరిశీలకుల అంచనా. యుద్ధం సమాధుల మీద 2024 అధ్యక్ష ఎన్నికలను నెగ్గాలని పుతిన్‌ భావిస్తున్నట్టు చెబుతున్నారు.

ఆపద్ధర్మ పాత్రతో మొదలై...
1999లో బోరిస్‌ యెల్సిన్‌ ఆకస్మిక రాజీనామాతో ఆపద్ధర్మ అధ్యక్షునిగా తొలిసారి గద్దెనెక్కిన పుతిన్‌ 2000–2004, 2004–08ల్లో రెండు దఫాలుగా అధ్యక్షునిగా కొనసాగారు. అప్పట్లో రష్యా అధ్యక్ష పదవీకాలం నాలుగేళ్లే. తర్వాత 2008 నుంచి 2012 దాకా ఆయన ప్రధానిగా ఉన్నారు. ఈ దశలో రాజ్యాంగ సవరణల ద్వారా అధ్యక్ష పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచారు. తర్వాత 2012 నుంచి 2018 దాకా, 2018 నుంచి ఇప్పటిదాకా పుతిన్‌ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. 2024 మార్చితో పదవీకాలం ముగుస్తుంది. ఒక వ్యక్తి వరుసగా రెండుసార్లకు మించి అధ్యక్షునిగా ఉండరాదన్న నిబంధనను కూడా రాజ్యాంగ సవరణ ద్వారా మార్చారు.

ఫలితంగా 2024తో పాటు 2030 ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం పుతిన్‌కు సంక్రమించింది. ఈ రెండుసార్లూ గెలిస్తే 2036 దాకా ఆయనే రష్యా అధినేతగా చక్రం తిప్పుతారు. అలా ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా ఒకే యుద్ధంతో అటు రాజ్యకాంక్షను, ఇటు పదవీకాంక్షనూ నెరవేర్చుకోవాలని పుతిన్‌ పట్టుదలగా ఉన్నారు. అందుకే యుద్ధానికి ఇప్పుడప్పట్లో ముగింపు పలికేందుకు ససేమిరా అంటున్నారు. యుద్ధంలో వెనకబడుతున్నట్టు అన్పించినప్పుడల్లా అణ్వాయుధ బూచితో ప్రపంచాన్ని బెదిరిస్తున్నారు. అటు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా అమెరికా మద్దతుతో లొంగేది లేదంటూ దీటుగా తలపడుతున్నారు. చివరికి గెలుపెవరిదైనా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మాత్రం వైరి వర్గాలు రెండింటినీ వెంటాడుతూనే ఉంటాయి. చరిత్ర చెక్కిలిపై యుద్ధం ఎప్పుడూ ఓ కన్నీటి బిందువే! చెరిగిపోని మచ్చే!!

కొసమెరుపు
ఏడాది యుద్ధం బాహుబలిగా వ్లాదిమిర్‌ పుతిన్‌కున్న పేరుప్రతిష్టలను బలి తీసుకుంటే, పూర్వాశ్రమంలో సినిమాల్లో కమేడియన్‌ పాత్రలు పోషించిన వొలోదిమిర్‌ జెలెన్‌స్కీని మాత్రం నిజజీవితంలో హీరోను చేసింది! 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top