‘విలీనం’తో ఉక్రెనియన్లపై రష్యా ఉక్కుపాదం.. అణు కేంద్రం హెడ్ కిడ్నాప్

కీవ్: ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాలను విలీనం చేసుకున్నట్లు ప్రకటించింది రష్యా. ఆ రోజు నుంచే తమ ఆధీనంలోని ప్రాంతాల్లో ఉక్రెయిన్ మద్దతుదారులను అణచివేసే దుశ్చర్యలు మొదలు పెట్టింది. ఉక్రెయిన్ జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రస్తుతం రష్యా సేనల ఆధీనంలో ఉంది. ఈ క్రమంలో న్యూక్లియర్ ప్లాంట్ డైరెక్టర్ జనరల్ ఇహోర్ మురాషోవ్‌ను రష్యా కిడ్నాప్ చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎనెర్హోడార్‌కు వెళ్తున్న క్రమంలో మురాషోవ్ కారును అడ్డగించిన రష్యా సేనలు.. ఆయన కళ్లకు గంతలు కట్టి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు కీవ్ ప్రభుత్వ న్యూక్లియర్ ఏజెన్సీ ‘ఎనర్జోఆటమ్’ వెల్లడించింది.
మురాషోవ్ కిడ్నాప్.. జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ భద్రతను ప్రమాదంలో పడేసిందని ఎనర్జోఆటమ్ ప్రెసిడింగ్ పెట్రో కొటిన్ ఆందోళన వ్యక్తం చేశారు. మురాషోవ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. మురాషోవ్ కిడ్నాప్‌పై రష్యా, అంతర్జాతీయ అణు విద్యుత్ ఏజెన్సీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఇదీ చదవండి: Russia Ukraine War: ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు