ఉక్రెయిన్‌ అణు విద్యుత్ కేంద్రంపై బాంబుల వర్షం.. లక్కీగా తప్పిన పెను ప్రమాదం

Russia Ukraine shelling Europe biggest nuclear power plant - Sakshi

కీవ్‌: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. డాన్బాస్ సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాలు భీకర దాడులకు దిగాయి. ఈ క్రమంలోనే ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం జపోరిజజియా ప్లాంట్‌పై బాంబుల వర్షం కురిసింది. అయితే ఈ చర్యపై ఉక్రెయిన్, రష్యా పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి. 

అణు విద్యుత్ ప్లాంట్‌పై దాడిలో షెల్స్‌ హై వోల్టేజ్ పవర్‌ లైన్‌పై పడినట్లు తెలుస్తోంది. దీని వల్ల రేడియేషన్‌ లీక్ కానప్పటికీ  ఆపరేటర్లు ఓ రియాక్టర్‌ను  డిస్ కనెక్ట్ చేశారు. యుద్ధం మొదలైన తొలినాళ్లలో మార్చిలోనే ఈ ప్లాంట్‌ను రష్యా తన అధీనంలోకి తీసుకుంది. అయితే అక్కడ పనిచేసేది మాత్రం ఉక్రెయిన్ టెక్నీషియన్లే.

ఐక్యరాజ్యసమితి న్యూక్లియర్ వాచ్‌ డాగ్‌ ఈ ప్లాంట్‌ను పరిశీలించేందుకు అనుమతి ఇ‍వ్వాలని అడిగింది. ఈ విద్యుత్ కేంద్రాన్ని రష్యా యుద్ధంలో రక్షక కవచంలా ఉపయోగించుకుంటోందని అమెరికా ఇటీవలే ఆరోపించింది.

అదృష్టం బాగుంది
అణువిద్యుత్ కేంద్రంపై భయానక దాడికి పాల్పడినందుకు రష్యాపై అణు ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ కోరారు. మరోవైపు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఉక్రెయినే  ఈ ప్లాంట్‌పై షెల్స్ దాడి చేసిందని, అదృష్టం కొద్ది రేడియో ధార్మిక శక్తి లీక్ కాలేదని వ్యాఖ్యానించింది. ఈ దాడి వల్ల ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయిందని పేర్కొంది. సమీప నగరంలోని ప్రజలు విద్యుత్, నీటి సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.

మరోవైపు ఉక్రెయిన్‌ పోర్టు నుంచి మూడు ధాన్యం ఓడలు శుక్రవారం బయలుదేరాయి. రష్యా దండయాత్ర మొదలైన  5 నెలల్లో ఉక్రెయిన్ ఓడ బయటకు వెళ్ళడం ఇదే తొలిసారి.
చదవండి: తైవాన్ జలసంధిపై చైనా బాంబుల వర్షం.. వీడియో విడుదల

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top