Russia Sends Spacecraft To Moon, Weeks After Chandrayaan-3 Launch - Sakshi
Sakshi News home page

హిస్టరీ క్రియేట్‌ చేయాలనుకున్న ఇస్రోకు రష్యా కౌంటర్‌.. సరికొత్త రాకెట్‌ ప్రయోగం

Aug 11 2023 9:50 AM | Updated on Aug 11 2023 10:04 AM

Russia Sends Spacecraft To Moon - Sakshi

మాస్కో: ఇటీవలే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌–3 మిషన్‌ చంద్రుడికి మరింత చేరువైన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇస్రోకు ధీటుగా రష్యా సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడిపైకి ‘లునా - 25’ పేరుతో రాకెట్‌ను రష్యా ప్రయోగించింది. 

వివరాల ప్రకారం.. దాదాపు 50 ఏళ్ల తర్వాత మళ్లీ రష్యా.. చంద్రుడిపైకి మరోసారి రాకెట్‌ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ మేరకు రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌కాస్మోస్‌ రాకెట్‌కు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ ప్రాంతం నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2.10 గంటలకు ‘లునా -25’ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లినట్టు పేర్కొంది. కాగా, లునా-25 కేవలం ఐదు రోజుల్లోనే చంద్రుడి కక్ష్యలోకి చేరనున్నట్టు తెలిపింది. ఆ తర్వాత చంద్రుడిపై ఎవరూ చేరని దక్షిణ ధ్రువంలో.. మరో 3 లేదా 7 రోజుల్లో ల్యాండర్‌ను ల్యాండ్‌ చేసేలా రష్యా ప్రణాళికలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది.  అక్కడి వనరుల జాడను గుర్తించేందుకు ఏడాది పాటు ఇది పనిచేయనున్నట్లు రోస్‌కాస్మోస్‌ వెల్లడించింది.

చంద్రయాన్‌ ఇలా..
ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు ఏ దేశ అంతరిక్ష నౌక కూడా చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువంపై ‘చంద్రయాన్-3’ ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించాలని భావిస్తున్న ఇస్రోకు రష్యా షాకిచ్చే ప్రయత్నం చేస్తోంది. చంద్రయాన్‌-3 కంటే ముందే రష్యా లూనా-25 అక్కడికి చేరుకున్న అవకాశముంది. చంద్రయాన్-3 చంద్రుడిపై దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న ల్యాండ్ కానుండగా.. అంతకంటే లూనా-25 అక్కడే అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక, 1976 తర్వాత రష్యా చేపట్టిన తొలి లూనార్‌ ల్యాండర్‌ ప్రయోగం ఇదే కావడం విశేషం. 

మరోవైపు..ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌–3 మిషన్‌ చంద్రుడికి మరింత చేరువయ్యే సమయంలో ల్యాండర్‌ మాడ్యూల్‌లో అమర్చిన ‘‘ల్యాండర్‌ హారిజెంటల్‌ వెలాసిటీ కెమెరా’’(ఎల్‌హెచ్‌వీసీ) రెండు ఛాయా చిత్రాలను తీసి పంపింది. వాటిని ఇస్రో తన వెబ్‌సైట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈనెల 6న ఎల్‌హెచ్‌వీసీ ఇనుస్ట్రుమెంట్‌ చంద్రుడ్ని తీసిన వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా లూనార్‌ కక్ష్యలో నుంచి చంద్రుడ్ని వీడియోతో పాటు ఛాయా చిత్రాలు తీయడం విశేషం. ప్రయోగం రోజున అంటే గత నెల 14న ‘‘ల్యాండర్‌ ఇమేజర్‌ కెమెరా’’భూమిని తీసిన ఛాయాచిత్రాలను కూడా గురువారం విడుదల చేసింది. చంద్రయాన్‌–1, చంద్రయాన్‌–2 ప్రయోగాల కంటే చంద్రయాన్‌–3 మిషన్‌లో అత్యంత హై రిజల్యూషన్‌ కెమెరాలను అమర్చినట్టుగా తెలుస్తోంది. ఈ రెండు చాయా చిత్రాలతో పాటుగా 14 సెకన్లపాటు తీసిన వీడియో కూడా ఎంతో స్పష్టతతో కూడి ఉండడం విశేషం. 

ఇది కూడా చదవండి: సుందర హవాయి దీవుల్లో పెనువిషాదం: కార్చిచ్చుకు గాలి తోడై నగరం బుగ్గి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement