Ashraf Ghani: భారీ నగదుతో పారిపోయాడు: రష్యా

Russia Says Afghan President Fled With Cars Chopper Full Of Cash:Report - Sakshi

నాలుగు కార్లు, హెలికాప్టర్‌ నిండా నగదుతో ఘనీ ఉడాయించాడు: రష్యా

సరిపోక కొంత నగదును వదిలేసి పారిపోయాడు

మాస్కో: తాలిబన్ల అక్రమణతో అఫ్గనిస్తాన్‌ అధ్యక్షుడు శ్రఫ్‌ ఘనీ  ఆదివారం దేశం విడిచిపారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా ఘనీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ భారీగా నగదు నిండిన నాలుగు కార్లతో పలాయనం చిత్తగించాడని పేర్కొంది. అంతేకాదు హెలికాప్టర్ పట్టకపోవడంతో కొంత నగదును విడిచిపోవాల్సి వచ్చిందంటూ కాబూల్‌లోని రష్యా రాయబార  కార్యాలయం సోమవారం ప్రకటించింది.

తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించడంతో ఘనీ నాలుగు కార్లు, హెలికాప్టర్‌ నిండా నగదుతో దేశం విడిచి పారిపోయాడని రష్యా వ్యాఖ్యానించింది. రక్తపాతాన్నినివారించాలని భావించినట్టు అతను పేర్కొన్నాడని తెలిపింది. రష్యన్ రాయబార కార్యాలయ ప్రతినిధి ఇస్చెంకో తన వ్యాఖ్యలను రాయిటర్స్‌తో ధృవీకరించారు. నాలుగుకార్లు డబ్బుతో నిండి ఉన్నాయి, డబ్బులో కొంత భాగాన్ని హెలికాప్టర్‌లో నింపడానికి ప్రయత్నించారు, కానీ సరిపోక పోవడంతో వదిలేశారన్నారు. దీనికి సంబంధించిన  సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.

అలాగే కాబూల్‌లో దౌత్యపరమైన ఉనికిని నిలుపుకుంటామనీ, తాలిబన్లతో సంబంధాలు పెంచుకోవాలని భావిస్తున్నామని రష్యా ప్రకటించింది. వారిని దేశపాలకులుగా గుర్తించడం తొందరపాటు  కాకపోయి నప్పటికీ, తాలిబన్ల ధోరణిని నిశితంగా గమనిస్తుందని ప్రకటించడం విశేషం.  తాలిబన్లతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటామని చైనా ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. 

కాగా అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ తొలుత తజకిస్తాన్‌కు వెళ్లిపోయినట్లు రిపోర్టులు వచ్చాయి. అలాగే ఘనీ, ఆయన భార్య, చీఫ్ ఆఫ్ స్టాఫ్, దేశ భద్రతా సలహాదారు ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌కు పారిపోయారని అల్ జజీరా వార్తా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి ఘనీ ఎక్కడ తలదాచుకున్నదీ స్పష్టత లేదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top