స్నేహితుడు బలహీనంగా ఉండకూడదు.. రష్యాతో తప్పదు: అమెరికాకు నిర్మలమ్మ రిప్లై

Russia Sanctions: Nirmala Sitharaman Comment On Ties With West - Sakshi

రష్యా - భారత్ వాణిజ్య మైత్రి పట్ల అమెరికా అభ్యంతరాలకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పొరుగు దేశంతో రక్షణ పరమైన సవాళ్లు ఉన్న దృష్ట్యా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ వైఖరి ఊహించిందేనన్నారు. అమెరికా దీన్ని అర్థం చేసుకోవాలన్నారు. 

‘‘అమెరికాకు భారత్ మిత్రదేశం. కానీ ఆ స్నేహితుడు బలహీనంగా ఉండకూడదు. బలహీన పడకూడదు’’ అని మంత్రి సీతారామన్ కామెంట్‌ చేశారు. తద్వారా భారత్ ను బలహీనపరిచే చర్యలకు దూరంగా ఉండాలన్న పరోక్ష సంకేతం పంపించారామె. భారతదేశం ఉదారవాద ప్రపంచంతో బలమైన స్నేహితులుగా ఉండాలని కోరుకుంటుంది. అయితే సరిహద్దులను రక్షించుకోవడానికి రష్యా సహాయం కావాల్సిందేనని ఆమె వాషింగ్టన్‌లో బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

అర్థం చేసుకున్నాం, కానీ..
ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన. నిర్మలా సీతారామన్ తిరిగొచ్చారు. అయితే.. అమెరికా వైఖరిని అర్థం చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. ‘‘భారత్ ఎప్పుడూ స్నేహంగానే ఉండాలని అనుకుంటుంది. అమెరికా కూడా స్నేహితుడు కావాలని అనుకుంటే.. ఆ ఫ్రెండ్ బలహీన పడకూడదు. భౌగోళికంగా మేము ఉన్న చోట బలంగా నిలదొక్కుకోవాలి’’అని మంత్రి పేర్కొన్నారు. ఈయూతో పాశ్చాత్య దేశాల నుంచి భారత్‌ స్నేహం కొరుకుంటోందని, కానీ, సరిహద్దు అంశాల దృష్ట్యా రష్యా సహకారం అవసరమేనని ఆమె అభిప్రాయపడ్డారు.

భారత్ ఎదుర్కొంటున్న సరిహద్దు భద్రతా సవాళ్లను మంత్రి గుర్తు చేశారు. కరోనా మహమ్మారి సమయంలోనూ ఉత్తర సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు తలెత్తడాన్ని ప్రస్తావించారు. పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్థాన్ తో నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలను గుర్తు చేశారు. ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయుధా, చమురు ఒప్పందాల విషయంలో రష్యాకు దూరంగా ఉండాలని వెస్ట్‌, అమెరికా చెప్తున్నా భారత్‌ వాణిజ్యాన్ని, ఒప్పందాల్ని కొనసాగిస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top