అరుదైన అంతరిక్ష శిల అరుదెంచె..

A rock smashed through their roof in New Jersey - Sakshi

న్యూజెర్సీలో ఇంట్లోకి దూసుకొచ్చిన కాన్‌డ్రైట్‌ గ్రహ శకలం   

న్యూజెర్సీ:  సువిశాలమైన అంతరిక్షంలో వింతలు విడ్డూరాలకు అంతు లేదు. మనకు తెలియని ఎన్నెన్నో విశేషాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇతర గ్రహాల నుంచి విడిపోయిన శిలలు సుదీర్ఘంగా ప్రయాణం సాగించి మన భూగోళంపై పడుతుంటాయి. ఇలాంటి శిలల వల్ల భూమిపై భారీ గోతుల్లాంటివి ఏర్పడుతుంటాయి. అత్యంత అరుదైన కాన్‌డ్రైట్‌ అంతరిక్ష శిల(గ్రహ శకలం)  అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఓ ఇంటి పై అంతస్తులోని పైకప్పును చీల్చుకొని పడక గదిలోకి దూసుకొచ్చింది.

న్యూజెర్సీ రాజధాని ట్రెంటాన్‌కు ఉత్తరాన ఉన్న హోప్‌వెల్‌ టౌన్‌షిప్‌లో ఇటీవలే మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఈ శిల వేగానికి పడక గదిలోని కలప గచ్చు కొంత ధ్వంసమయ్యింది. ఎవరో ఆకతాయిలు రాయి విసిరారని భావించిన ఆ ఇంటి యజమాని సుజీ కాప్‌ దాన్ని చేతిలోకి తీసుకొని పరిశీలించగా వేడిగా తగిలి చురుక్కుంది. అదొకలోహాన్ని పోలి ఉండడంతో ప్రభుత్వ అధికారులకు సమాచారం చేరవేశారు.

అధికారుల సూచన మేరకు ‘ద కాలేజ్‌ ఆఫ్‌ న్యూజెర్సీ’ సైంటిస్టులు రంగంలోకి దిగి, ఆ శిలను ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌తో క్షుణ్నంగా పరిశీలించారు. అది కాన్‌డ్రైట్‌ అంతరిక్ష శిలగా నిర్ధారించారు. బంగాళదుంప పరిమాణంలో 6/4 అంగుళాలు, 2.2 పౌండ్ల (దాదాపు ఒక కిలో) బరువు ఉన్నట్లు సైంటిస్టులు చెప్పారు. ఇలాంటి గ్రహశకలం గతంలో భూమిపై పడిన దాఖలాలు పెద్దగా లేవని తెలిపారు. అరుదైన గ్రహ శకలాన్ని పరీక్షించడం అద్భుతమైన అవకాశమని ద కాలేజ్‌ ఆఫ్‌ న్యూజెర్సీ ఫిజిక్స్‌ డిపార్టుమెంట్‌ చైర్మన్‌ నాథన్‌ మ్యాగీ చెప్పారు. ఈ శిలపై అధ్యయనం ద్వారా ఫిజిక్స్‌ ప్రొఫెసర్లు, విద్యార్థులు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చని వెల్లడించారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top