బ్రిటన్‌ ప్రధాని పీఠం: తొలి రౌండ్‌ రిషిదే.. గట్టి పోటీ ఇస్తున్న పెన్నీ 

Rishi Sunak tops first round of voting in UK Leadership Contest - Sakshi

తప్పుకున్న జహావీ, హంట్‌ 

బరిలో మిగిలింది ఆరుగురు 

నేడు రెండో రౌండ్‌ ఓటింగ్‌ 

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని పీఠమెక్కబోయే కీలకమైన కన్జర్వేటివ్‌ పార్టీ నేత ఎన్నిక రేసులో భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్‌ (42) దూసుకెళ్తున్నారు. బుధవారం తొలి రౌండ్‌ ముగిసే సరికి ఆయన అత్యధికంగా 88 మంది పార్టీ ఎంపీల ఓట్లను సాధించారు. ప్రధాన పోటీదారు పెన్నీ మోర్డంట్‌ 67 ఓట్లతో గట్టి పోటీ ఇస్తున్నారు. లిజ్‌ ట్రస్‌ (50 ఓట్లు), కేమీ బదెనోక్‌ (40)తో పాటు భారత సంతతికి చెందిన అటార్నీ జనరల్‌ సుయెల్లా బ్రేవర్మన్‌ (32) కూడా తొలి రౌండ్‌ను గట్టెక్కారు.

కనీసం 30 మంది ఎంపీల మద్దతు కూడగట్టడంలో విఫలమై నదీం జహావీ, జెరెమీ హంట్‌ రేసు నుంచి వైదొలిగారు. దీంతో ఆరుగురు అభ్యర్థులు పోటీలో మిగిలారు. ఎంపీల మద్దతులో రిషి దూసుకుపోతుండగా విజేతను తేల్చడంలో కీలకమైన కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల్లో పెన్నీకి మద్దతు గణనీయంగా పెరుగుతున్నట్టు వస్తున్న వార్తలు పోటీని ఆసక్తికరంగా మారుస్తున్నాయి. గురువారం కన్జర్వేటివ్‌ ఎంపీలు తమ ఫేవరెట్‌ అభ్యర్థులను ఎన్నుకోనున్నారు. జూలై 21కల్లా ఇద్దరు అభ్యర్థులు బరిలో మిగలాల్సి ఉంటుంది. అది రిషి, పెన్నీయే అవుతారని భావిస్తున్నారు. తర్వాత 2 లక్షల మంది కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల్లో అత్యధికుల మద్దతు కూడగట్టుకునే వారే పార్టీ నేతగా ఎన్నికై సెప్టెంబర్‌ 5న ప్రధాని పీఠమెక్కుతారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top