
కాబూల్: ‘‘పదిహేనేళ్లు దాటిన ఆడపిల్లలు, 45 ఏళ్ల లోపు వయస్సు గల వితంతువుల జాబితా ఇవ్వండి. వారిని తాలిబన్ యోధులకు ఇచ్చి పెళ్లి చేస్తాం’’.. అఫ్గనిస్తాన్‌లోని ఇమామ్‌లు, ముల్లాలకు తాలిబన్ గ్రూపు సాంస్కృతిక కమిషన్ పేరిట వచ్చిన నోట్ ఇది. రెండు దశాబ్దాల అనంతరం అమెరికా, దాని మిత్రపక్ష సేనలు అఫ్ఘానిస్తాన్ నుంచి వెనక్కి వచ్చిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఈ ప్రక్రియ మొదలైందో అప్పటి నుంచే తాలిబన్ గ్రూపు తమ విస్తరణ పెంచుకుంటూ.. ఆధిపత్యం ప్రదర్శిస్తూ నెమ్మదిగా.. తమ జన్మస్థానమైన కాందహార్‌లోకి ప్రవేశించింది.
ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూనే వరుస దాడులకు పాల్పడుతూ భయానక వాతావరణం సృష్టిస్తోంది. అంతేగాకుండా... పొగతాగకూడదు, గడ్డం గీసుకోకకూడదు, మహిళలు ఒంటరిగా బయటకు రాకూడదు వంటి నిబంధనలతో పౌరులపై ఆంక్షలు విధిస్తోంది. ఒకవేళ వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ హెచ్చరిస్తోంది. అయితే, ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. టీనేజర్లు, వితంతు మహిళలను సెక్స్ బానిసలుగా మార్చి పాకిస్తాన్‌లోని వజిరిస్తాన్‌కు తీసుకువెళ్తామంటూ ఓ ప్రకటనను విడుదల చేసింది.
దీంతో.. తమ బతుకులు మరోసారి అంధకారంలో కూరుకుపోతాయని, తమకు ఎలాంటి రక్షణ ఉండదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హజీ రోజీ బేగ్ అనే ఓ పెద్దాయన తాలిబన్ ఆగడాల గురించి ఫినాన్షియల్ టైమ్స్‌తో మాట్లాడుతూ... ‘‘ప్రభుత్వ నియంత్రణలో ఉన్నపుడు కాస్త సంతోషంగా ఉండేవాళ్లం. ఎంతో కొంత స్వేచ్ఛ ఉండేది. ఎప్పుడైతే తాలిబన్లు మళ్లీ పుంజుకున్నారో.. అప్పటి నుంచి నిరాశ ఆవహించింది. ఇంట్లో ఉన్నా.. గట్టిగా మాట్లాడటానికి వీల్లేదు.
కనీసం మ్యూజిక్ కూడా వినకూడదు. మార్కెట్లకు స్త్రీలు ఒంటరిగా వెళ్లే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్లు మా కుటుంబ సభ్యుల వివరాల గురించి ఆరా తీస్తున్నారు. పద్దెమినిదేళ్లు వస్తే అమ్మాయిలను ఇంట్లో ఉంచకూడదని, వారికి పెళ్లి చేయాలంటూ ఓ సబ్ కమాండర్ మమ్మల్ని బెదిరించాడు. నాకు తెలిసి కచ్చితంగా రెండు మూడు రోజుల్లో వాళ్లు నా కూతుళ్ల(23, 24 ఏళ్లు)కు బలవంతంగా పెళ్లిళ్లు చేస్తారు. మా బతుకులు మారవు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ‘ది సన్’ ఓ కథనం ప్రచురించింది.