మహా విపత్తుకు ముందస్తు సూచికే.. అడ్డుకోకపోతే వినాశనమే!

Record-breaking glacier melt in Himalayas accelerating Pakistan floods - Sakshi

పాక్‌ వరదలపై నిపుణులు

హిమాలయాల్లో శరవేగంగా కరుగుతున్న మంచు

వాతావరణ మార్పులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. హిమాలయాల్లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. పాకిస్తాన్‌లో వరద బీభత్సం, చైనాలో కరువు కాటకాలు, భారత్‌లో కనీవినీ ఎరుగని వాతావరణ మార్పులు... వీటన్నింటికీ అదే కారణమని భారతీయ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని చోటా షిగ్రి హిమానీ నదాన్ని వారు కొన్నేళ్లుగా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఈ ఏడాది రికార్డు స్థాయిలో మంచు కరిగిపోయినట్టు వెల్లడైంది.

గత జూన్‌లో ఏర్పాటు చేసిన డిశ్చార్జ్‌ మెజరింగ్‌ వ్యవస్థ ఆగస్టుకల్లా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఇండోర్‌ ఐఐటీ గ్లేసియాలజిస్ట్‌ మహమ్మద్‌ ఫరూక్‌ ఆజం చెప్పారు. ‘‘గత మార్చి, ఏప్రిల్‌లో మన దేశంలో ఉష్ణోగ్రతలు 100 ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టాయి. హిమానీ నదాలు కరిగిపోవడమే అందుకు కారణం. గత వారం మా బృందమంతా షిగ్రి దగ్గరే ఉండి పరీక్షించాం. మంచు భారీగా కరిగిపోతోంది’’ అంటూ ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ‘‘అరేబియా సముద్రంలో అత్యధిక వేడిమి కారణంగా నీరంతా ఆవిరి మేఘాలుగా మారి ఎడతెరిపి లేకుండా వానలు కురిసి లానినో ప్రభావం ఏర్పడింది. దాంతో వాతావరణమే విపత్తుగా మారి పాక్‌ను అతలాకుతలం చేస్తోంది’’ అన్నది శాస్త్రవేత్తల వివరణ.

హిమాలయాలు కరిగిపోతే...?
గ్లోబల్‌ వార్మింగ్‌ దెబ్బకు హిమాలయాల్లో మంచు గత నాలుగు దశాబ్దాల్లో కరిగిన దాని కంటే 2000–2016 మధ్య ఏకంగా 10 రెట్లు ఎక్కువగా కరిగిపోయింది! దక్షిణాసియా దేశాలకు ఇది పెను ప్రమాద హెచ్చరికేనంటున్నారు. కారకోరం, హిందూకుష్‌ పర్వత శ్రేణుల్లో 55 వేల హిమానీ నదాలున్నాయి. హిమాలయ నదులైన గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర 8 దేశాల్లో 130 కోట్ల మంది మంచినీటి అవసరాలు తీరుస్తున్నాయి. 5,77,000 చదరపు కిలోమీటర్లలో వ్యవసాయ భూములకు నీరందిస్తున్నాయి. 26,432 మెగావాట్ల సామర్థ్యం ఉన్న హైడ్రోపవర్‌ స్టేషన్లున్నాయి. హిమాలయాల్లో మంచు కరిగిపోతే వీటన్నింటిపైనా ప్రభావం పడటమే గాక 2050 నాటికి దక్షిణాసియా దేశాల్లో 170 కోట్ల మందికి నీటికి కటకట తప్పదని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. దేశాల మధ్య నీటి కోసం యుద్ధాలూ జరగవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో పాకిస్తాన్‌ వాటా కేవలం 1 శాతమే. కానీ వాతావరణ మార్పులు ఇప్పుడు ఆ దేశాన్ని బలి తీసుకుంటున్నాయి.              

చైనాలో కరువు సంక్షోభం
► 17 ప్రావిన్స్‌లలో వరసగా 70 రోజుల పాటు ఎండలు దంచిగొట్టాయి. వడగాడ్పులకి 90 కోట్ల మంది అవస్థలు పడ్డారు
► చైనాలో ఏకంగా సగ భాగంలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి
► చైనాలో అతి పెద్ద నది యాంగ్‌జె ఎండిపోయిన పరిస్థితి వచ్చింది. 1865 తర్వాత ఈ నది నీటిమట్టం బాగా తగ్గిపోవడం మళ్లీ ఇప్పుడే.  
► చైనాలోని దక్షిణ ప్రావిన్స్‌లైన హుబై, జియాంగ్జీ, అన్‌హుయాయ్, సిచుయాన్‌లలో నీళ్లు లేక విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు మూతపడుతున్నాయి
► చైనాలో జల విద్యుత్‌లో 30శాతం సిచుయాన్‌ ప్రావిన్స్‌ నుంచే వస్తుంది. ఈ ప్రాంతంలో విద్యుత్‌ ఉత్పత్తి సగానికి సగం తగ్గిపోయింది
► చైనాలో కరువు పరిస్థితులు 25 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపిస్తే, 22 లక్షలకు పైగా హెక్టార్లలో వ్యవసాయ భూమి ఎండిపోయింది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top