అమెరికాలో విద్వేషానికి చోటు లేదు  | Raja Krishnamoorthi sounds alarm over anti-India hate after Texas incident | Sakshi
Sakshi News home page

అమెరికాలో విద్వేషానికి చోటు లేదు 

Jun 20 2026 4:28 AM | Updated on Jun 20 2026 11:17 AM

Raja Krishnamoorthi sounds alarm over anti-India hate after Texas incident

వివక్షకు వ్యతిరేకంగా అమెరికన్లు ఐక్యంగా ఉండాలి 

భారత వ్యతిరేక ఘటనలపై అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఆందోళన

వాషింగ్టన్‌: అమెరికాలో భారత్‌కు వ్యతిరేకంగా విద్వేష ఘటనలు పెరగటంపై భారత సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. వివక్ష, పక్షపాతాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. మతం, జాతీయతతో సంబంధం లేకుండా, ఏ వర్గంపై అయినా జరిగే ద్వేషపూరిత చర్యలను సమిష్టిగా వ్యతిరేకించాలని ఎక్స్‌ వేదికగా నొక్కి చెప్పారు. 

టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ఇటీవల జరిగిన ఒక సంఘటనను ఆయన ప్రస్తావించారు. ‘శ్వేతజాతి ఆధిపత్యవాదులుగా గుర్తించబడిన ఒక బృందం సిటీ హాల్‌ బయట భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ భారత జాతీయ జెండాను చించివేశారు. హిందువులైనా, ముస్లింలైనా, యూదులైనా.. ఎవరిపట్ల అయినా పక్షపాతం, వివక్షలకు వ్యతిరేకంగా మనం భుజం భుజం కలిపి నిలబడాలి. మతం, జాతీయతతో సంబంధం లేకుండా అందరూ ఐక్యంగా ఉండాలి’అని పిలుపునిచ్చారు.  

విద్వేషానికి వ్యతిరేకంగా సెనేట్‌లో తీర్మానం
ఈ విషయంపై కృష్ణమూర్తి గతంలో కాంగ్రెస్‌లో కూడా తన గళం వినిపించారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై దాడి చేస్తూ రేడియో హోస్ట్‌ మైఖేల్‌ సావేజ్‌ చేసిన ఒక విద్వేషపూరిత పోస్ట్‌ను ‘ట్రూత్‌ సోషల్‌’లో ట్రంప్‌ ప్రచారం చేయడాన్ని కృష్ణమూర్తి ఖండించారు. భారతీయ అమెరికన్లు, చైనీస్‌ అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ డెమొక్రటిక్‌ సభ్యులతో కలిసి సెనేట్‌లో ఆయన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

‘భారత్, చైనా గురించి అవమానకరమైన భాషను ఉపయోగించడం, వలసదారుల విధేయతను ప్రశ్నించడం, భారతీయ అమెరికన్లను, చైనీస్‌ అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని హానికరమైన మూసధోరణులను ప్రచారం చేయడం సరికాదు’ అని తీర్మానంలో పేర్కొన్నారు. ‘ది సావేజ్‌ నేషన్‌’రేడియో కార్యక్రమంలో ‘ఇక్కడ జన్మింంచిన ఒక శిశువు తక్షణమే పౌరురాలు అవుతుంది. ఆ తర్వాత వారు చైనా, భారత్‌ లేదా ఈ భూమ్మీద ఉన్న మరేదైనా నరక కూపం నుంచి మొత్తం కుటుంబాన్ని తీసుకువస్తారు’ అంటూ వ్యాఖ్యాత మైఖేల్‌ సావేజ్‌ చేసిన వ్యాఖ్యలను ట్రంప్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేయడాన్ని తీర్మానం ఖండించింది. ఈ భాష హానికరమైన మూస ధోరణులను బలపరుస్తుందని, వలస సమాజాల పట్ల విద్వేషాన్ని పెంచుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement