పగ్గాలు చేపట్టిన లిజ్‌

Queen Elizabeth II appoints Liz Truss as Britain new Prime Minister - Sakshi

బ్రిటన్‌ను సమున్నతంగా తీర్చిదిద్దుతానని ప్రకటన

ఆమె కేబినెట్లో చేరొద్దని రిషి నిర్ణయం

హోం మంత్రిగా భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రెవర్మన్‌

లండన్‌: హోరాహోరి పోరులో నెగ్గి కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా ఎన్నికైన లిజ్‌ ట్రస్‌ (47)ను బ్రిటన్‌ ప్రధానిగా రాణి ఎలిజబెత్‌2 లాంఛనంగా నియమించారు. ట్రస్‌ మంగళవారం స్కాట్లండ్‌ వెళ్లి అక్కడి బాల్మోరల్‌ క్యాజిల్‌లో వేసవి విడిదిలో సేదదీరుతున్న 96 ఏళ్ల రాణితో భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా రాణి ఆమెను ఆహ్వానించారు. అంతకుముందు తాత్కాలిక ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ (58) రాణికి తన రాజీనామా సమర్పించారు.

కొత్త ప్రధానిని ప్రభుత్వ ఏర్పాటుకు రాణి ఆహ్వానించే ప్రక్రియ లండన్‌లోని బకింగ్‌హం ప్యాలెస్‌లో జరగడం ఆనవాయితీ. కానీ వృద్ధాప్యంతో రాణి ప్రయాణాలు బాగా తగ్గించుకున్నారు. దాంతో తొలిసారిగా వేదిక బాల్మోరల్‌ క్యాజిల్‌కు మారింది. ఎలిజబెత్‌2 హయాంలో ట్రస్‌ 15వ ప్రధాని కావడం విశేషం! 1952లో విన్‌స్టన్‌ చర్చిల్‌ తొలిసారి ఆమె ద్వారా ప్రధానిగా నియమితుడయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానం అందుకున్న అనంతరం ట్రస్‌ లండన్‌ తిరిగి వచ్చారు. ప్రధానిగా తొలి ప్రసంగం అనంతరం తన కేబినెట్‌ను ఆమె ప్రకటించనున్నారు.

భారత సంతతికి చెందిన అటార్నీ జనరల్‌ సుయెల్లా బెవర్మన్‌ను హోం మంత్రిగా ట్రస్‌ ఎంచుకున్నారు. ప్రధాని పీఠం కోసం ట్రస్‌తో చివరిదాకా హోరాహోరీ పోరాడిన భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ మాత్రం ఆమె కేబినెట్లో చేరబోనని దాదాపుగా స్పష్టం చేశారు. రాజీనామాకు ముందు జాన్సన్‌ వీడ్కోలు ప్రసంగం చేశారు. ‘ఆట మధ్యలో నిబంధనలు మర్చేయడం ద్వారా’ సహచర పార్టీ నేతలే తనను బలవంతంగా సాగనంపారంటూ ఆక్రోశించారు. తనను తాను అప్పగించిన పని విజయవంతంగా పూర్తి చేసిన బూస్టర్‌ రాకెట్‌గా అభివర్ణించుకున్నారు. మున్ముందు కూడా అవసరాన్ని బట్టి తళుక్కుమని మెరుస్తుంటానని చమత్కరించారు. ట్రస్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top