
పుతిన్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెలెన్‌స్కీతో ఉక్రెయిన్ శాంతి చర్చలు జరపబోతున్నారు. అయితే దానికంటే కొన్ని గంటల ముందు ఆయనో కీలక ప్రకటన చేశారు. జెలన్‌స్కీ కాస్త తగ్గి.. కాంప్రమైజ్ కావాలన్న రీతిలోనే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారాయన.
రష్యా నుంచి క్రిమియాను తిరిగి పొందడం, ఉక్రెయిన్ నాటోలో చేరడం ఈ రెండూ అసాధ్యమేనని ట్రంప్ ఆ పోస్టులో స్పష్టం చేశారు. ‘‘తలుచుకుంటే జెలెన్‌స్కీ వెంటనే రష్యాతో యుద్ధాన్ని ముగించవచ్చు. లేదంటే యుద్ధాన్ని కొనసాగించవచ్చు. 12 ఏళ్ల కిందట ఒక్క తూటా పేలకుండానే ఒబామా క్రిమియా భూభాగాన్ని రష్యాకు అప్పజెప్పారు. అలాగే నాటోలోనూ ఉక్రెయిన్ చేరడం వీలుకాదు. కొన్ని ఎన్నటికీ మారవు అనే విషయాన్ని గుర్తించాలి’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అలస్కా వేదికగా ట్రంప్ మూడు రోజుల కిందట అలస్కాలో భేటీ అయ్యారు. అయితే కాల్పుల విరమణ విషయంలో పుతిన్ అస్సలు తగ్గలేదని తెలుస్తోంది. యుద్ధవిరామం గురించి కాకుండా.. భూభాగాల మార్పిడిపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి. పుతిన్ ప్రతిపాదన ప్రకారం.. క్రిమియాపై సర్వాధికారాలు రష్యావే. అలాగే ఉక్రెయిన్ నాటోలో చేరకూడదు అనే షరతులు ఉన్నాయి. అయితే జెలెన్‌స్కీ మాత్రం రక్షణపరంగా కీలక ప్రాంతాలైన తూర్పు భూభాగాల ఉపసంహరణను తిరస్కరిస్తూనే శాంతి చర్చలకు సిద్ధమయ్యారు.
అలస్కా సమావేశం తర్వాత.. ట్రంప్ జెలెన్‌స్కీతో పాటు యూరోపియన్ నేతలతోనూ ఫోన్‌లలో మాట్లాడారు. పుతిన్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని వాళ్లను చేరవేశారాయన. అంతేకాదు.. శాంతి చర్చల్లో పురోగతి కనిపించిందని కూడా ప్రకటించారు.
వైట్‌హౌజ్‌లోని తన ఓవెల్ ఆఫీస్‌లోనే జెలెన్‌స్కీతో ట్రంప్ సోమవారం భేటీ కాబోతున్నారు. జెలెన్‌స్కీ గతంలో అమెరికాకు ఒంటరిగా వెళ్లి.. ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేత లైవ్‌లో తిట్లు తిన్నారు. ఈ క్రమంలో.. ఈసారి జెలెన్‌స్కీతో పాటు బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్, జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే తదితరులు వాషింగ్లన్ వెళ్తారని సమాచారం. ఉక్రెయిన్ భద్రతా హామీలతో పాటు రష్యాపై ఆంక్షలు కొనసాగించాలని వీళ్లంతా ట్రంప్‌ను ఒత్తిడి చేయనున్నట్లు తెలుస్తోంది.
బెదిరింపుల నుంచి బతిమాలేదాకా..
రష్యాపై ఆంక్షలు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై నేరుగా విమర్శలు.. ఉక్రెయిన్ యుద్ధం ఆపే క్రమంలో ట్రంప్ మొదటి నుంచి చేసుకొస్తోంది ఇదే. బెదిరింపులతోనే ఇరు దేశాధినేతలను దారికి తేవాలని ట్రంప్ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే అవేవీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ట్రంప్ సహనం కట్టలు తెంచుకున్నా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేకపోయింది. ఈ క్రమంలో అలస్కా భేటీ తర్వాత ట్రంప్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. పుతిన్ టఫ్‌గాయ్.. ఇక అంతా జెలెన్‌స్కీ చేతుల్లోనే ఉందంటూ వ్యాఖ్యానించారాయన. అయితే యూరోపియన్ దేశాల ప్రొత్సహంతో జెలెన్‌స్కీ కూడా ఈ విషయంలో అస్సలు తగ్గడం లేదు. దీంతో ట్రంప్ బతిమాలింపు దిశగా ప్రయత్నాలు చేయబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తర్వాత.. త్రైపాక్షికం?
పుతిన్, జెలెన్‌స్కీలతో కలిసి ట్రంప్ త్రైపాక్షిక సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. గ్జిన్‌హువా మీడియా సంస్థతో జర్మన్ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ మాట్లాడుతూ.. ఆగస్టు 22వ తేదీన ఈ భేటీ ఉండనుందని, జెలెన్‌స్కీ-ట్రంప్ భేటీ తర్వాత దీనిపై ఓ స్పష్టత వస్తుందని చెప్పారు. అయితే రష్యా, ఉక్రెయిన్ ఈ ప్రకటనపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు. ట్రంప్ ప్రతిపాదన ప్రకారం.. డోన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలి. బదులుగా యుద్ధ విరామంతో పాటు ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు దక్కుతాయి.