ఇంక దేనికీ ఒప్పుకోం: ట్రంప్
నాటో సాయపడాలని వ్యాఖ్య
గ్రీన్‌లాండ్‌లో వెల్లువెత్తుతున్న నిరసనలు
నూక్ (గ్రీన్‌లాండ్): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ నామజపం నానాటికీ శ్రుతి మించుతోంది. ఆ ద్వీపం పూర్తిగా అమెరికా వశం అయి తీరాల్సిందేనని, అది తప్ప ఇంక దేనికీ అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన బుధవారం పునరుద్ఘాటించారు. అంతేకాదు, అందుకు నాటో కూటమి ఇతోధికంగా సాయపడాలని చెప్పుకొచ్చారు. వెనెజువెలాపై సైనిక చర్యతో అధ్యక్షుడు మదురో దంపతులను నిర్బంధించిన అనంతరం ట్రంప్ తన దృష్టినంతా గ్రీన్‌లాండ్‌పై కేంద్రీకరించడం తెలిసిందే.
ఇది గ్రీన్‌లాండ్‌తో పాటు ఆ ద్వీపాన్ని నియంత్రిస్తున్న డెన్మార్క్‌తో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అవసరమైతే సైనిక చర్య తప్పదని ట్రంప్, అలాగైతే తొలి తూటా పేల్చేది తామేనని డెన్మార్క్ పోటాపోటీ ప్రకట నలతో వాతావరణం బాగా వేడెక్కింది. ఈ పరిస్థితుల్లో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఒకవైపు డెన్మార్క్, గ్రీన్‌లాండ్ విదేశాంగ మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన బృందంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాషింగ్టన్‌లో భేటీ అవుతుండగా, అంతకు కేవలం కొద్ది గంటల ముందు ట్రంప్ మళ్లీ ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారు.
‘అమెరికా జాతీయ భద్రత నిమిత్తం గ్రీన్‌లాండ్ మాకు కావాల్సిందే. ఆ ప్రయత్నాలకు నాటో కూటమే సారథ్యం వహించాలి. లేదంటే గ్రీన్‌లాండ్‌పై రష్యా, చైనా పట్టు సాధిస్తాయి. అలా జరగనివ్వబోం’ అని సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’లో ఆయన వరుస పోస్టులు పెట్టారు. ‘మేం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థలో గ్రీన్‌లాండ్ అతి కీలకం’ అని పేర్కొన్నారు. అంతేకాదు, గ్రీన్‌లాండ్ అమెరికా గుప్పెట్లోకి వస్తే నాటో మరింత బలోపేతమైన శక్తిగా మారుతుందని చెప్పుకొచ్చారు.
డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రతినిధుల బృందం ఇప్పటికే వైట్‌హౌస్‌లో ఒక దఫా అమెరికా బృందంతో చర్చలు జరిపింది. వాన్స్‌తో భేటీ అనంతరం సెనేటర్లు, ఇతర ఉన్నతాధికారులతో వారు మరోసారి సమావేశం కానున్నారు. మరోవైపు, గ్రీన్‌లాండ్ స్వాధీన ప్రయత్నాలకు రక్షణ, లేదా ఇతర శాఖల నుంచి నిధులు వెచ్చించేందుకు వీల్లేదంటూ ఇద్దరు సెనేటర్లు తాజాగా బిల్లు ప్రవేశపెట్టారు. వీరిలో ఒకరు అధికార రిపబ్లికన్ పార్టీకి చెందినవారు కావడం విశేషం. శుక్ర, శనివారాల్లో వారి బృందం డెన్మార్క్‌లో పర్యటించనుంది.
డెన్మార్క్ ప్రధాని తదితరులతో భేటీ కావాలని వారు నిశ్చయించారు. తమ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలపై గ్రీన్‌లాండ్‌వాసులు మండిపడుతున్నారు. తాము అమ్మకానికి సిద్ధంగా లేమంటూ నినదిస్తున్నారు. ‘‘మేం డెన్మార్క్‌ను ఎంచుకున్నాం. ఆ దేశంలో భాగంగా, యూరోపియన్ యూనియన్ భాగస్వామిగా మాత్రమే కొనసాగుతాం. అంతే తప్ప అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరడం కల్ల’’ అని అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో వారు కుండబద్దలు కొడుతున్నారు.
చైనా, రష్యాలతో తమ ద్వీపానికి ముప్పుందన్న ట్రంప్ వాదనను గ్రీన్‌లాండ్‌వాసులు ఎద్దేవా చేస్తున్నారు. ఆయన నోట వస్తున్నవన్నీ కాల్పనిక గాథలని వారు చెప్పు కొచ్చారు. ‘‘ట్రంప్‌కు కావాల్సింది కేవలం మా ద్వీపంలోని అపార సహజ వనరులే. వాటికోసమే ఇలా ఇతర దేశాలను బూచిగా చూపుతూ ప్రయాస పడుతు న్నారు’’ అని మండిపడ్డారు. మరోవైపు, ఫిబ్రవరి 6న గ్రీన్‌లాండ్‌లో దౌత్య కార్యాలయం తెరుస్తున్నట్టు నాటో సభ్య దేశమైన ఫ్రాన్స్ కీలక ప్రకటన చేసింది. గ్రీన్‌లాండ్‌పై దాడి తప్పదన్న బ్లాక్‌మెయిలింగ్‌కు అమెరికా స్వస్తి పలకాలని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయల్ బారొట్ హితవు పలికారు.
డెన్మార్క్, గ్రీన్‌లాండ్ నేతల యునైటెడ్ ఫ్రంట్!
ట్రంప్‌కు వ్యతిరేకంగా డెన్మార్క్, గ్రీన్‌లాండ్ సంఘటితమవుతున్నాయి. ఈ దిశగా సమైక్య పోరు కోసం యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని వారు నిర్ణయానికి వచ్చారు. ‘‘గ్రీన్‌లాండ్ పూర్తిగా డెన్మార్క్‌కు చెందిన భాగమే. కనుక దానికి నాటో సైనిక రక్షణ పూర్తిస్థాయిలో కొనసాగుతుంది’’ అని ఇరు దేశాల ప్రధానులు మెట్టె ఫ్రెడరిక్సన్, జీన్స్ నీల్సన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘‘ప్రియ మైన గ్రీన్‌లాండ్‌వాసు లారా.. ఈ రోజు మనమంతా సంయుక్తంగా ఒక్కతాటిపై నిలబడి ఉన్నాం. మున్ముందూ అలాగే ఉండబోతున్నాం’’అని ఫ్రెడరిక్సన్ కోపెన్ హాగెన్‌లో మీడియా భేటీలో ప్రకటించారు. ‘‘అమెరికా, డెన్మార్క్‌లలో ఏదో ఒకదా న్నే ఎంచుకోవాల్సి వస్తే మా చాయిస్ ఎప్పటికీ డెన్మార్కే. నాటోనే. యూరోపియన్ యూని యనే’’ అని నీల్సన్ కుండబద్దలు కొట్టారు.


