మీడియా ఒత్తిళ్లు తట్టుకోలేకపోయా | Prince Harry Explains Why he Stepped Back From Royal Family | Sakshi
Sakshi News home page

మీడియా ఒత్తిళ్లు తట్టుకోలేకపోయా

Feb 27 2021 4:13 AM | Updated on Feb 27 2021 12:20 PM

Prince Harry Explains Why he Stepped Back From Royal Family - Sakshi

లండన్‌: బ్రిటన్‌ రాచరిక కుటుంబాన్ని వీడి రావడానికి మీడియా పెట్టిన ఒత్తిడే కారణమని ప్రిన్స్‌ హ్యారీ నిందించారు. బ్రిటన్‌ మీడియా తమ కుటుంబాన్ని ఊపిరాడనివ్వకుండా చేసిందని, దీని వల్ల ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొన్నానని వెల్లడించారు. అమెరికాలోని సీబీఎస్‌ చానెల్‌లో జేమ్స్‌ కార్డన్‌ హోస్ట్‌గా నిర్వహించే లేట్‌ లేట్‌ షో కార్యక్రమంలో హ్యారీ పాల్గొన్నారు. ప్రజా సేవ నుంచి తానేమీ దూరంగా పారిపోలేదని స్పష్టం చేశారు. ‘‘‘నేను ఎప్పుడూ ప్రజల నుంచి దూరంగా పారిపోవాలని అనుకోలేదు. కానీ బ్రిటన్‌ మీడియా వల్ల ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. నా మానసిక ఆరోగ్యం దెబ్బ తింది. అలాంటప్పుడు ప్రతీ భర్త, ప్రతీ తండ్రి ఏం చేద్దామనుకుంటారో నేనూ అదే చేశాను.

ఇది బాధ్యతల్ని విడిచిపెట్టడం కాదు. ఒక్క అడుగు వెనక్కి వేయడమే. బ్రిటన్‌ మీడియా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే’’అని అన్నారు. ప్రిన్స్‌ హ్యారీ, ఆయన భార్య మెఘన్‌ మెర్కల్‌ గత ఏడాది జనవరిలో రాచ కుటుంబాన్ని వీడుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ జంట ఇప్పడు ఇక పూర్తిగా రాచ కుటుంబానికి దూరమయ్యారని గత వారమే బకింగ్‌çహామ్‌ ప్యాలెస్‌ వర్గాలు వెల్లడించాయి. అమెరికాలోని కాలిఫోర్నియాకు మకాం మార్చడానికి ముందు బ్రిటన్‌లోని టాబ్లాయిడ్‌లు తమపై జాతి వివక్షని ప్రదర్శించాయంటూ హ్యారీ దంపతులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మెఘన్‌ తండ్రి శ్వేతజాతీయుడు కాగా,తల్లి ఆఫ్రికన్‌ అమెరికన్‌ కావడంతో బ్రిటన్‌ పత్రికల రాతలు తమను బాధించాయని హ్యారీ చెప్పారు.  

ఆ సిరీస్‌ అంతా కట్టుకథే  
రాచకుటుంబాన్ని వీడిన తర్వాత హ్యారీ ఒక చానెల్‌కి పూర్తి స్థాయి ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే తొలిసారి.  రాణి ఎలిజెబెత్‌పై నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ది క్రౌన్‌ సిరీస్‌లో వాస్తవాలేవీ చూపించలేదని ధ్వజమెత్తారు. నిజజీవితంలో తమ కుటుంబం ఎదుర్కొన్న ఒత్తిళ్ల కంటే, మీడియా కథనాల వల్ల ఎక్కువ ఒత్తిళ్లు ఎదురవుతున్నాయంటూ హ్యారీ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement