నిర్ణయాధికారం లేకుండా ఇంకా ఎన్నాళ్లు ? | PM Narendra Modi calls for reform at UN | Sakshi
Sakshi News home page

నిర్ణయాధికారం లేకుండా ఇంకా ఎన్నాళ్లు ?

Published Sun, Sep 27 2020 2:20 AM | Last Updated on Sun, Sep 27 2020 10:31 AM

PM Narendra Modi calls for reform at UN - Sakshi

ఐక్యరాజ్య సమితి: ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌ను ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) భద్రతా మండలిలో నిర్ణయాధికారానికి దూరంగా ఇంకా ఎన్నాళ్లు ఉంచుతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. సమితిలో సంస్కరణలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని గట్టిగా నొక్కి చెప్పారు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ప్రపంచదేశాలు వ్యాక్సిన్‌ కోసం భారత్‌ వైపు చూస్తున్నాయని, అందరి అవసరాలు తీర్చే శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం జరిగిన సర్వప్రతినిధి సభలో ముందుగా రికార్డు చేసిన వీడియో ద్వారా మోదీ తన ప్రసంగాన్ని వినిపించారు. మారిపోతున్న పరిస్థితులకు అనుగుణంగా యూఎన్‌లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు. ‘‘ఐక్యరాజ్య సమితిలో నిర్ణయాధికారం కోసం భారత్‌ ఇంకా ఎన్నాళ్లు ఎదురు చూడాలి ? ప్రపంచ జనాభాలో 18 శాతం కంటే ఎక్కువగా ఉన్న అతి పెద్ద దేశానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేస్తున్న దేశానికి భద్రతామండలిలో నిర్ణయాధికారాన్ని కల్పించరా ? ’’అని మోదీ నిలదీశారు.

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు చైనా గండి కొడుతున్న విషయం తెలిసిందే. తాత్కాలిక సభ్య దేశంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రెండేళ్ల పాటు భారత్‌ కొనసాగనుంది. ఇదే సమయంలో మోదీ ఈ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటి పరిస్థితులు వేరు. ఈ నాటి ప్రపంచ దేశాల పరిస్థితులు వేరు. సమస్యలు, వాటికి పరిష్కారాలు అన్నీ వేర్వేరుగా ఉన్నాయి. చాలా దీర్ఘకాలంగా సంస్కరణల కోసం వేచి చూస్తున్నాం’’అని ప్రధాని చెప్పారు. మారాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మారకపోతే, ఆ తర్వాత మార్పు వచ్చినా అది బలహీనంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు.  

ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదం
గత 75 ఏళ్ల కాలంలో ప్రపంచ దేశాల్లో ఎన్నో ఉగ్రవాదుల దాడులు జరిగాయని, రక్తపుటేరులు ప్రవహించాయన్న ప్రధాని దానిని దీటుగా ఎదుర్కోవాలంటే యూఎన్‌లో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదం, ఆయుధాల సరఫరా, డ్రగ్స్, మనీ లాండరింగ్‌ వంటి వాటికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి తన గళాన్ని గట్టిగా వినిపించాలని, శాంతి భద్రతలు, సయోధ్య అంశాలకు మద్దతు పలకాలన్నారు. ప్రపంచ శాంతి స్థాపన కోసం ఇప్పటివరకు భారత్‌ 50 వరకు శాంతి మిషన్‌లను ప్రపంచం నలుమూలలకి పంపించిందని, జగతి సంక్షేమమే భారత్‌ ఆకాంక్ష అని మోదీ అన్నారు.  

కరోనాపై పోరాటంలో ఐరాస పాత్ర ఏది ?  
గత తొమ్మిది నెలల నుంచి ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తూ ఉంటే, కలసికట్టుగా పోరాడేందుకు ఐక్యరాజ్య సమితి చేస్తున్న ప్రయత్నాలేంటని మోదీ ప్రశ్నించారు. కరోనాపై యూఎన్‌ నుంచి గట్టి ప్రతిస్పందన కూడా కరువైందని అన్నారు. కరోనా కష్ట కాలంలో భారత్‌లో ఫార్మా రంగం అద్భుతమైన పనితీరుని ప్రదర్శించిందని, 150కి పైగా దేశాలకు వివిధ రకాలైన ఔషధాలను సరఫరా చేశామన్నారు. ప్రపంచంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తుల్లో అతి పెద్ద దేశమైన భారత్‌ అందరి అవసరాలు తీర్చేలా కరోనా టీకా డోసుల్ని ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలను సంక్షోభం నుంచి బయటపడేయగలదని హామీ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్‌పై భారత్‌ మూడో దశ ప్రయోగాల్లో ఉందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement