డెయిర్ అల్ బాలాహ్: గతేడాది అక్టోబర్‌లో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నాసరే గాజాపై ఇజ్రాయెల్ దాడుల దమనకాండ ఆగట్లేదు. దీంతో 2023 అక్టోబర్‌లో యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా గాజాలో మరణాల సంఖ్య 73,000కు చేరుకుందని గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సైనికులు యథేచ్ఛగా దాడులకు తెగబడుతున్నారని గాజా మంత్రిత్వ శాఖలోని రికార్డ్‌ల విభాగం సారథి జహీర్ అల్ వహేదీ, ప్రజా సంబంధాల విభాగ సారథి హమ్జా సలీం తెలిపారు.
ఖాన్ యూనిస్‌లో ఇద్దరు, సెంట్రల్ గాజాలో ఒక్కరు, గత గాయాలతో మరో ఇద్దరు ఆదివారం చనిపోయారని అధికారులు పేర్కొన్నారు. యుద్ధంలో ఇప్పటిదాకా గాజాలో 1,73,200 మందికిపైగా గాయాలపాలయ్యారు. 2023 అక్టోబర్ ఏడో తేదీన ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై హమాస్ సాయుధులు మెరుపుదాడి చేసి అక్కడ స్థానికులు, పర్యాటకులు, విదేశీయులుసహా మొత్తంగా 1,200 మందిని చంపేశారు.
251 మందిని బంధించి గాజాకు తీసుకొచ్చి సొరంగాల్లో దాచిపెట్టడం తెల్సిందే. ప్రతీకారంగా గాజా నగరాలపై ఇజ్రాయెల్ మొదలెట్టిన భీకరదాడుల్లో ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది పిల్లలు, మహిళలేనని గాజా మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కొనసాగిన పరస్పర కాల్పుల ఘటనల్లో కేవలం ఐదుగురు ఇజ్రాయెల్ సైనికులే చనిపోయారు.


