
పాకిస్తాన్- అఫ్గనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో కారు బాంబు పేలుడు జరిగింది. కారులోని బాంబును రిమోట్ కంట్రోల్‌తో పేల్చిన ఘటనలో పాక్ మాజీ ఎంపీతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. మామండ్ బజౌర్‌లోని దమడోలా ప్రాంతంలో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం పేలుడు జరిగిన సమయంలో పాక్ పార్లమెంటు మాజీ సభ్యుడు హిదయతుల్లా అక్కడే ఉన్నారు. కాగా ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్, ప్రధాన కార్యదర్శి నదీమ్ అస్లాం చౌదరి ఈ పేలుడును ఖండించారు. ఈ ఘటనలో మృతులకు సంతాపం వ్యక్తం చేశారు.
హిదయతుల్లా 2012 నుండి 2018 వరకు, తిరిగి 2018 నుండి 2024 వరకు సెనేట్‌లో స్వతంత్ర సభ్యునిగా ఉన్నారు. హిదయతుల్లా పాక్ ఎగువ సభలోని విమానయాన స్టాండింగ్ కమిటీ చైర్మన్, నేషనల్ యాంటీ టెర్రరిజం అథారిటీ (నాక్టా) సభ్యునిగా కూడా ఉన్నారు. ఈ దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా బాధ్యత వహించలేదు.