పాకిస్తాన్‌లో సంకీర్ణమే | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌లో సంకీర్ణమే

Published Thu, Feb 22 2024 5:47 AM

Pakistan elections 2024: Shehbaz Sharif set to be PM as coalition govt talks conclude - Sakshi

ఇస్లామాబాద్‌:  పాకిస్తాన్‌లో రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు, అధికార పంపకంపై పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌(పీఎంఎల్‌–ఎన్‌), పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) ఎట్టకేలకు తుది ఒప్పందానికి వచ్చాయి. నూతన ప్రధానమంత్రిగా పీఎంఎల్‌–నేత షహబాజ్‌ షరీఫ్‌(72), అధ్యక్షుడిగా పీపీపీ సీనియర్‌ నాయకుడు అసిఫ్‌ అలీ జర్దారీ(68) బాధ్యతలు చేపట్టనున్నారు.

రెండు పార్టిల మధ్య మంగళవారం అర్ధరాత్రి కీలక చర్చలు జరిగాయి. అనంతరం పీపీపీ చైర్మన్‌ బిలావల్‌ భుట్టో మీడియాతో మాట్లాడారు. పీఎంఎల్‌–ఎన్, పీపీపీ భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే సంకీర్ణ ప్రభుత్వ ప్రధానిగా షహబాజ్‌ షరీఫ్, అధ్యక్షుడి పదవికి తమ ఉమ్మడి అభ్యరి్థగా అసిఫ్‌ అలీ జర్దారీ పేర్లను ఖరారు చేసినట్లు ప్రకటించారు. తమ కూటమికి పార్లమెంట్‌లో తమకు సంఖ్యా బలం ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని బిలావల్‌ భుట్టో స్పష్టం చేశారు.

అయితే, ఎంతమంది ఎంపీలు మద్దతు ఇస్తున్నారన్న విషయాన్ని ఆయన బహిర్గతం చేయలేదు. ఒప్పందం ప్రకారం.. జాతీయ అసెంబ్లీలో స్పీకర్‌ పదవికి పీఎంఎల్‌–ఎన్‌ పార్టికి, డిప్యూటీ స్పీకర్‌ పదవి పీపీపీకి, సెనేట్‌లో చైర్మెన్‌ పదవి పీపీపీకి లభించనుంది. చర్చలు సానుకూలంగా ముగించినందుకు పీఎంఎల్‌–ఎన్, పీపీపీ నేతలకు షహబాజ్‌ షరీఫ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.

మంత్రి పదవుల విషయంలో పీపీపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని అన్నారు. అసిఫ్‌ అలీ జర్దారీ 2008 నుంచి 2013 దాకా పాకిస్తాన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. మరోసారి అదే పదవికి చేపట్టబోతున్నారు. నవాజ్‌ షరీఫ్‌ సోదరుడైన షషబాజ్‌ షరీఫ్‌ సైతం గతంలో ప్రధానమంత్రిగా సేవలందించారు.  ­పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్‌ జరిగిందని, ఈ ఎన్నిలను రద్దు చేసి, మళ్లీ నిర్వహించారంటూ మాజీ సైనికాధికారి అలీ ఖాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఇలాంటి పిటిషన్‌ పబ్లిసిటీ స్టంట్‌ అంటూ కొట్టేసింది.

Advertisement
 
Advertisement