
ఇస్లామాబాద్: పాకిస్తాన్- అమెరికాల మధ్య బంధం బలపడుతోంది. తాజాగా పాకిస్తాన్- యునైటెడ్ స్టేట్స్‌లు అరుదైన భూ ఖనిజాల ఎగుమతి కోసం కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేసే దిశగా ముందడుగు వేశాయని, దీంతో ఇరు దేశాల ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యం నూతన దశలోకి ప్రవేశిస్తున్నదని వార్తా పత్రిక ‘డాన్’ పేర్కొంది. గత సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌తో భూ ఖనిజాల ఎగుమతి కోసం అమెరికా ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది.
ఈ స్ట్రాటజిక్ మెటల్స్ (యూఎస్‌ఎస్‌ఎం) ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ తొలిసారిగా ఖనిజ నమూనాలను అమెరికాకు పంపింది. పాకిస్తాన్‌లో ఖనిజ ప్రాసెసింగ్, అభివృద్ధి సౌకర్యాల ఏర్పాటుకు అమెరికన్ సంస్థ దాదాపు 500 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధికి ఖనిజరంగం కీలకంగా నిలుస్తుంది. ఇప్పుడు ఈ అరుదైన భూ ఖనిజాల రవాణాతో పాకిస్తాన్ మరో ముందడుగు వేసిందని వాషింగ్టన్ వర్గాలు పేర్కొన్నాయి.
ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌డబ్యూఓ) సమన్వయంతో దేశీయంగా తయారైన ఈ ఖనిజంలో యాంటిమోనీ, రాగి సాంద్రత, నియోడైమియం, ప్రాసోడైమియం వంటి అరుదైన భూమి మూలకాలన్నాయి. యూఎస్‌ఎస్‌ఎం ఒక ప్రకటనలో ఈ రవాణాను పాకిస్తాన్-యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక మైలురాయిగా అభివర్ణించింది. ఈ ఒప్పందం అన్వేషణ, ప్రాసెసింగ్ మొదలుకొని పాకిస్తాన్ లోపల శుద్ధి కర్మాగారాల స్థాపన వరకు అభివృద్ధి చెందనుంది. ఈ రంగంలో ఇరు దేశాల సహకారం కోసం ఒక రోడ్‌మ్యాప్‌కు రూపకల్పన చేయనున్నారు. ఈ సందర్భంగా యూఎస్‌ఎస్‌ఎం సీఈఓ స్టేసీ డబ్ల్యూ హాస్టీ మాట్లాడుతూ ఈ మొదటి డెలివరీ.. యూఎస్‌ఎస్‌ఎం, పాకిస్తాన్‌ల ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ మధ్య సహకారానికి సంబంధించిన నూతన అధ్యాయాన్ని తెరుస్తుందన్నారు.
‘డాన్’ పేర్కొన్న వివరాల ప్రకారం ఈ ఒప్పందంతో పాకిస్తాన్ ప్రపంచంలోని కీలక ఖనిజాల మార్కెట్‌పై పట్టు సాధించగలదు. ఆర్థిక పరిపుష్టిని అందుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇదిలావుండగా పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఈ ఒప్పందంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పీటీఐ సమాచార కార్యదర్శి షేక్ వక్కాస్ అక్రమ్ దీనిపై స్పందిస్తూ పాక్ ప్రభుత్వం వాషింగ్టన్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లుందని, ఒప్పందపు పూర్తి వివరాలను బహిరంగంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఒప్పందాలు దేశంలో ఇప్పటికే ఉన్న అస్థిర పరిస్థితిని మరింత రెచ్చగొడతాయని అక్రమ్ ఆరోపించారు.