Pegasus: కాస్ట్‌లీ గూఢచారి.. పెగాసస్‌!

NSO Group spyware Pegasus infects your device - Sakshi

పెగాసస్‌ స్పైవేర్‌ రహస్యాల పుట్ట పగులుతోంది..
ఒక్కటొక్కటిగా వివరాలు వెల్లడవుతూంటే.. ముక్కున వేలేసుకోవడం.. సామాన్యుల వంతు అవుతోంది!
నేతలు, విలేకరులు, హక్కుల కార్యకర్తలు..బోలెడంత మందిపై నిఘానేత్రానికి అయిన ఖర్చెంత?
వ్యాప్తి ఏ మేరకు? ఏం చేయగలదు? ఎలా చేస్తుంది?

పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం సామాన్యుల వల్ల అయ్యే పని కానే కాదు. ఎన్‌ఎస్‌ఓ టెక్నాలజీస్‌ స్వయంగా చెప్పినట్లు, ప్రభుత్వాలు, ప్రభుత్వ నిఘా సంస్థలు మాత్రమే కొనుగోలు చేయగలవు. ఉపయోగించగలవు. ఖరీదు కోట్లలోనే. ఎందుకంటే సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేయడం మొదలుకొని నిఘా వేయాల్సిన ఫోన్లు, డెస్క్‌టాప్‌ల సంఖ్య, ఏ రకమైన వివరాలు కావాలి? వంటి అనేక అంశాలకు వేర్వేరుగా ఛార్జీలు వసూలు చేస్తుంది ఎన్‌ఎస్‌ఓ టెక్నాలజీస్‌. 2016లో న్యూయార్క్‌ టైమ్స్‌ సేకరించిన వివరాల ప్రకారం చూస్తే.. పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టలేషన్‌ చార్జీనే దాదాపు రూ.3.5 కోట్లు ఉంటుంది.

ఐఫోన్‌/ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లు పదింటిపై నిఘా పెట్టేందుకు అయ్యే ఖర్చు ఇంకో రూ.నాలుగు కోట్లు ఖరీదు చేస్తుంది. అప్పట్లో విస్తృత వాడకంలో ఉన్న బ్లాక్‌బెర్రీ ఫోన్లు ఐదింటిపై నిఘా పెట్టేందుకు రూ.3.5 కోట్లు, ఇన్నే సింబియాన్‌ ఫోన్లకు రూ.కోటి వరకూ అవుతుందని న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం తెలిపింది. ఇది బేసిక్‌ ప్యాకేజీ.. నిఘా వేయాల్సిన స్మార్ట్‌ఫోన్ల సంఖ్య ఇంకో వంద పెరిగితే రూ.5.5 కోట్లు వదిలించుకోవాలి. ఇంకో యాభై మందిపై నిఘాకు రూ.3.5 కోట్లు, సంఖ్య 20 అయితే కోటి రూపాయలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. 

ఇవన్నీ కాకుండా.. మెయింటెన్స్‌ ఛార్జీలు మొత్తం ఛార్జీల్లో 17 శాతం వరకూ ఉండగా.. నిర్దిష్ట సమయం తరువాత రెన్యువల్‌ ఛార్జీలు వేరుగా చెల్లించాల్సి ఉంటుంది. భారత్‌లో పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ బారిన పడ్డ వారి సంఖ్య దాదాపు 300 అన్నది నిజమైతే.. మొత్తం ఖర్చు సుమారు 40 లక్షల డాలర్లు లేదా రూ.28 కోట్లు అవుతుందన్నమాట. మెయింటెనెన్స్‌ చార్జీలు, ఇతర ఖర్చులు కూడా కలుపుకుంటే.. మొత్తం ఖర్చు రూ.యాభై కోట్ల వరకూ అయి ఉండవచ్చునని అంచనా. 2016 నాటి లెక్కలకు ద్రవ్యోల్బణం తదితర అంశాలను జోడించి చూస్తే.. ప్రస్తుతం పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ కోసం కనీసం రూ.వెయ్యికోట్ల కంటే ఎక్కువే ఖర్చుఅయి ఉండాలి.  

అన్నింటిలోకీ చొరబడిందా?
భారత్‌లో పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా 300 మందిపై నిఘా వేసేందుకు ప్రయత్నాలు జరిగాయని వార్తలొచ్చాయి. అయితే వీరందరి స్మార్ట్‌ఫోన్లలోనూ ఆ స్పైవేర్‌ జొరబడిందా? అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాచారం లేదు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు చెందిన సెక్యూరిటీ ల్యాబ్‌ 67 స్మార్ట్‌ఫోన్లను పరిశీలించగా ఇరవై మూడింటిలో స్పైవేర్‌ ఉందని, ఇంకో 14 వాటిలో లోనికి జొరబడే ప్రయత్నం జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని ‘ద వైర్‌’ ఒక కథనంలో తెలిపింది. మిగిలిన 30 మంది స్మార్ట్‌ఫోన్ల పరీక్షలు ఏ రకమైన ఫలితమూ ఇవ్వలేదని, ఫోన్లను వదిలించుకోవడం ఇందుకు కారణం కావచ్చునని తెలిపింది.  

రెండేళ్ల క్రితం పార్లమెంటరీ కమిటీ విచారణ
ఈ అంశంపై 2019లో ఐటీపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ విచారణ జరిపింది. అప్పట్లో ఈ సాఫ్ట్‌వేర్‌ 121 మందిపై ప్రభావం చూపినట్లు సమాచారం. తమిళనాడులోని కుడంకుళం అణువిద్యుత్‌ కేంద్రంపై, అణుశక్తి విభాగాలపై సైబర్‌ దాడి జరిగిందని తెలిసింది. కుడంకుళం అణువిద్యుత్‌ కేంద్రం పరిపాలన విభాగంపై ఈ సాఫ్ట్‌వేర్‌ దాడి చేసినట్లుగా సమాచారం. అయితే కేంద్ర హోంశాఖ, ఎలక్ట్రానిక్స్‌ మరియు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్య చేయకపోవడం గమనార్హం. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ తన విచారణలో భాగంగా 17 మందిని విచారించినట్లు, ఇందులో మానవహక్కుల కార్యకర్తలతోపాటు జగదల్‌పూర్‌ లీగల్‌ ఎయిడ్‌ సభ్యులు ఉన్నారు. మొత్తం విచారణపై కమిటీ ఏ రకమైన నివేదిక ప్రభుత్వానికి సమర్పించకపోవడం కొసమెరుపు!   

చొరబడేది ఇలా...
► ఇజ్రాయెల్‌ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎస్‌ఓ టెక్నాలజీస్‌ సిద్ధం చేసిన పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంటర్నెట్‌ ఉన్న స్మార్ట్‌ఫోన్లలోకే చొరబడుతుంది. తాజా వెర్షన్లు ఫోన్‌కు వచ్చిన లింకులు, మెసేజ్‌ను క్లిక్‌ చేయకుండానే సాఫ్ట్‌వేర్‌ను జొప్పించగలదని చెప్తున్నారు.

► స్పైవేర్, స్టాకర్‌వేర్‌లు యాంటీ థెఫ్ట్‌ (ఫోన్‌ చోరీకి గురికాకుండా చూసేవి) అప్లికేషన్ల రూపంలో వస్తూంటుంది. యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌లు స్మార్ట్‌ఫోన్లలోకి జొరబడే వైరస్, మాల్‌వేర్‌లను గుర్తించగలదు. స్పైవేర్, స్టాకర్‌వేర్‌లు వీటి కంటపడకుండా మనకు ఏదో ఉపయోగాన్ని ఇచ్చేవన్న ముసుగులో మన స్మార్ట్‌ఫోన్లలోని సమాచారాన్ని సెంట్రల్‌ సర్వర్‌కు పంపుతూ ఉంటుంది.

► ఒక్కసారి లోనికి జొరబడితే పెగాసస్‌ లాంటి స్పైవేర్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లోనే పనిచేస్తూంటాయి. వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ వంటి అప్లికేషన్ల సాఫ్ట్‌వేర్లలో ఉండే లొసుగులను ఆసరాగా చేసుకుని పనిచేస్తుంది ఇది. అంతేకాదు.. పెగాసస్‌ స్మార్ట్‌ఫోన్‌ ‘రూట్‌ ప్రివిలైజెస్‌’ను పొందేందుకు ప్రయత్నిస్తుంది. ఈ రూట్‌ ప్రివిలైజెస్‌తో పెగాసస్‌ తనకు అవసరమైన వివరాలు సేకరించేందుకు తగిన సాఫ్ట్‌వేర్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేయగలదు. ఈ క్రమంలో ఫోన్‌ అడ్మినిస్ట్రేటర్‌గానూ ఈ పెగాసస్‌ మారిపోతుంది.

సోకిన తరువాత...?
రిమోట్‌ సర్వర్‌ ద్వారా అందే సూచనతో మన ఫోన్‌ పనిచేస్తూంటుంది. అవసరమనుకుంటే.. మన కెమెరా ఆటోమెటిక్‌గా ఓపెన్‌ అయిపోతుంది. ఫొటోలు తీసేస్తుంది కూడా. అంతేకాకుండా.. మైక్రోఫోన్‌ ఆన్‌ చేసి మన మాటలు రికార్డ్‌ చేయడం, లేదా ఎస్‌ఎంఎస్, వాట్సప్‌ సందేశాల్లోని సమాచారాన్ని సర్వర్‌కు చేరవేడం చేయగలదు. కేలండర్‌లోకి జొరబడి మన అపాయింట్‌మెంట్లను గుర్తిస్తుంది. గుర్తించేంత వరకూ రిమోట్‌ సర్వర్‌కు సంకేతాలు పంపుతూనే ఉంటుంది.  

పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రభుత్వాల వద్ద మాత్రమే ఉంటుంది. జాతీయ భద్రత, ఉగ్రవాదం మినహా మిగిలిన అంశాల కోసం భారత ప్రభుత్వం ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఉంటే అది కచ్చితంగా అక్రమమే. ఒకవేళ ప్రభుత్వం వాడకపోయి ఉంటే మరీ ప్రమాదం. జాతీయ భద్రతకు భంగం కలిగినట్లే. పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌పై న్యాయ విచారణ జరగాల్సిందే
– శశి థరూర్, ఐటీపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌
 
 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top