‘మాల్యా అప్పగింతకు నో టైమ్‌లైన్‌’

No Timeline For Vijay Mallyas Extradition To India Says UK Envoy - Sakshi

లండ‌న్ : బ్యాంకుల‌కు వేల కోట్ల రూపాయ‌ల‌ను ఎగ‌వేసి బ్రిట‌న్‌లో త‌ల‌దాచుకుంటున్న లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యాను భార‌త్‌కు అప్పగించడం కోసం నిర్దిష్ట గడువును నిర్ణయించడం సాధ్యం కాదని  బ్రిటిష్ హై కమిషనర్ సర్ ఫిలిప్ బార్టన్ గురువారం చెప్పారు.  విజయ్ మాల్యాను భారత దేశానికి ఎప్పుడు అప్పగిస్తారు? అని అడిగిన ప్రశ్నపై బార్టన్ స్పందిస్తూ, ఇటువంటి అంశాలపై తమ ప్రభుత్వం ఎటువంటి వ్యాఖ్యలు చేయబోదని చెప్పారు. అయితే బ్రిటన్ కోర్టులు స్వతంత్రంగా పని చేస్తాయన్నారు. నేరస్థులు వేరొక దేశానికి వెళ్ళడం ద్వారా చట్టం నుంచి తప్పించుకుపోవడాన్ని నిరోధించడంలో పోషించవలసిన పాత్ర గురించి బ్రిటన్ ప్రభుత్వం, న్యాయస్థానాలకు తెలుసునని చెప్పారు.

 ఆన్‌లైన్‌  మీడియా స‌మావేశంలో మాట్లాడిన ఫిలిప్‌ బార్టన్‌.. నేర‌స్థులు స‌రిహ‌ద్దులు దాటి వెళ్లినంత‌మాత్రాన త‌ప్పించుకోలేర‌ని తేల‍్చిచెప్పారు. అయితే మాల్యాను ఫిబ్ర‌వ‌రిలోనే భార‌త్‌కు అప్ప‌గించాల్సి ఉండ‌గా, కొన్ని న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఏర్ప‌డ‌టంతో ఈ కేసు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ కేసుకు సంబంధించి విచార‌ణ జ‌రుగుతుంది. తనను భారత్‌కు అప్పగించడం తగదని మాల్యా బ్రిటన్‌ అత్యున్నత న్యాయస్థానాల్లో చేసిన వాదనలు ఇటీవలే వీగిపోయాయి. దీంతో ఇటీవ‌లె ‘శరణార్థి’ హోదాలో దేశంలో ఉంటానని మాల్యా  బ్రిటన్ ప్ర‌భుత్వానికి   విజ్ఞప్తి చేసిన‌ట్లు స‌మాచారం. దానికి ఆమోదముద్ర వేయవద్దని భార‌త్ ఇటీవ‌లె  బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసిన సంగ‌తి తెలిసిందే. (మాల్యా ‘శరణార్థి’ అభ్యర్థనను మన్నించొద్దు)

 కాగా 9వేల కోట్ల రూపాయలకు పైగా రుణాల ఎగవేత ఆరోపణలతో మాల్యా ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. అయితే మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు కొన్ని చట్టపరమైన సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాల్సి ఉందని బ్రిటిష్ హైకమిషన్ ప్రకటించింది. తాజాగా  శిక్షనుంచి తప్పించుకునే మార్గాలన్నీ మూసుకు పోవడంతో బ్యాంకుల కన్సార్షియంతో సెటిల్‌మెంట్‌ ప్యాకేజీని అంగీకరించాలంటూ కోరినట్టు తెలుస్తోంది. త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు అప్పగించడం ఖాయం అనుకుంటున్న తరుణంలో  ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మాల్యా సిద్ధం కావడం గమనార్హం. (ఆఖరి అస్త్రం : మాల్యా బంపర్‌ ఆఫర్‌ )

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top