కోరలు చాస్తున్న కొత్త రకం

The new coronavirus variant in Britain - Sakshi

ఉత్తర ఐర్లాండ్, ఇజ్రాయెల్‌కు వ్యాప్తి

నైజీరియాలో పీ681హెచ్‌ వేరియంట్‌ ఆనవాళ్లు  

లండన్‌/నైరోబీ/బీజింగ్‌: యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో వెలుగు చూసిన కరోనా వైరస్‌ కొత్త రకం(వేరియంట్‌) క్రమంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతోంది. తాజాగా ఉత్తర ఐర్లాండ్, ఇజ్రాయెల్‌లో ఈ కొత్త రకం కేసులు నమోదయ్యాయి. బాధితులు ఇటీవలే యూకే నుంచి వచ్చినవారు కావడం గమనార్హం. ఆఫ్రికా దేశమైన నైజీరియాలోనూ కరోనా కొత్త వేరియంట్‌ (పీ681హెచ్‌) ఆనవాళ్లు బయటపడ్డాయి. అయితే, దీని ప్రభావం, వ్యాప్తిపై మరింత అధ్యయనం అవసరమని నైజీరియా ప్రభుత్వం తెలిపింది.

ఈ వేరియంట్‌ తొలుత దక్షిణాఫ్రికాలో పుట్టి, యూకేలోకి ప్రవేశించిందన్న వాదన వినిపిస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకపోకలను యూకే రద్దు చేసింది.  కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ వ్యాప్తి పెరుగుతుండడంతో దాదాపు 40  దేశాలు యూకే నుంచి ప్రయాణాలను నిలిపివేశాయి. ఈ జాబితాలో తాజాగా చైనా, బ్రెజిల్‌ కూడా చేరాయి. ఎప్పటి నుంచి విమానాలు రద్దు చేస్తారన్న సమాచారాన్ని చైనా బయటపెట్టలేదు. నాన్‌–చైనీస్‌ పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్నవారు యూకే నుంచి తమ దేశంలోకి రాకుండా చైనా నవంబర్‌ నుంచే నిషేధం అమలు చేస్తోంది.  

కొత్త రకమైనా టీకాలు పనిచేస్తాయి  
కరోనా వైరస్‌లో ఎన్ని మార్పులు జరిగినా.. టb వ్యాక్సిన్‌ సమర్థంగా ఎదుర్కొంటుందని భావిస్తున్నట్లు మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌ ఫార్మా సంస్థలు ప్రకటించాయి. కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా తమ వ్యాక్సిన్‌  రోగ నిరోధక శక్తిని ప్రేరేపిస్తుందని వెల్లడింరాయి.

కొత్త వేరియంట్‌ భయానకం
యూకేను బెంబేలెత్తిస్తున్న కరోనా కొత్త రకం వేరియంట్‌తో మున్ముందు పరిస్థితి మరింత దారుణంగా మారనుందని ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్, ట్రోపికల్‌ మెడిసిన్‌’కు చెందిన సెంటర్‌ ఫర్‌ మ్యాథమెటికల్‌ మోడలింగ్‌ ఆఫ్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌ తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ కొత్త రకం వల్ల ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య, మరణాల రేటు వచ్చే ఏడాది భారీగా పెరుగుతుందని తెలియజేసింది. ఈ వేరియంట్‌ 56 శాతం అధిక వేగంతో వ్యాప్తి చెందుతుందని తెలిపింది. దీనిని అరికట్టడానికి కఠిన చర్యలు చేపట్టాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని పేర్కొంది. వారానికి కనీసం 20 లక్షల మందికి టీకా అందజేయాలని కోరింది.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top