అలెక్సీ నవాల్ని మరణం.. వెలుగులోకి సంచలన విషయం

Navalni May Have Killed With Single Punch On Heart - Sakshi

మాస్కో: ఇటీవల రష్యా జైలులో వివాదాస్పద స్థితిలో మరణించిన పుతిన్‌ రాజకీయ ప్రత్యర్థి, రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నవాల్ని మృతికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నవాల్నిని జైలులో గుండెపై ఒకే ఒక్క గుద్దు గుద్ది చంపేసి ఉంటారని మానవహక్కుల కార్యకర్త వ్లాదిమిర్‌ ఒసెచిన్‌ తెలిపారు. ఇది రష్యా గూఢచారి సంస్థ కేజీబీ వేగులు  చేసిన హత్యే అయి ఉండొచ్చన్నారు.

కేజీబీ ప్రత్యేక వేగులకు మనుషులను గుండెపై ఒకే ఒక్క గుద్దు గుద్ది చంపేయడంపై శిక్షణ ఇస్తారని చెప్పారు. ఇది వారి హాల్‌మార్క్‌ హత్య చేసే విధానమని తెలిపారు. ఈ హత్య చేసే ముందు నవాల్ని శరీరాన్ని బలహీపర్చే ఉద్దేశంతో జీరో డిగ్రీ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో అతడిని ఉంచారన్నారు. ఇలా చేయడం వల్ల మనిషిలో రక్తప్రసరణ నెమ్మదిస్తుందని చెప్పారు. అనంతరం గుండెపై గుద్ది చంపేస్తారన్నారు.

కాగా, గత వారం ఆర్కిటిక్‌ పోలార్‌ వోల్ఫ్‌లోని పీనల్‌ కాలనీ జైలు అలెక్సీ నవాల్ని వివాదాస్పద స్థితిలో మృతి చెందారు. జైలులో సాయంత్రం వేళ కొద్దిసేపు వాకింగ్‌ తర్వాత నావల్ని ఇబ్బందిగా ఫీలయ్యారని, అనంతరం  ఆయన కుప్పకూలారని జైలు అధికారులు వెల్లడించారు. అత్యంత వివాదాస్పదంగా మారిన నావల్ని మృతిపై రష్యాలో ఆయన అభిమానుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా సహా పలు దేశాధినేతలు నవాల్ని మృతికి పుతినే కారణమని పరోక్షంగా వ్యాఖ్యానించాయి. నవాల్ని భార్య, కూతురును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కాలిఫోర్నియాలోని ఓ హోటల్‌లో కలిసి పరామర్శించారు. 

ఇదీ చదవండి.. నవల్ని మృతదేహం తల్లికి  అప్పగింత

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top