
వాషింగ్టన్: అంతరిక్షంలో పుట్టుకొచ్చిన ఎర్రని కాంతి మొలకలా, అప్పుడే విచ్చుకుంటున్న కలువ పువ్వులా ఉంది కదూ! కానీ నిజానికది భూమిపైకి అమాంతంగా దూసుకొస్తున్న కాంతి ఖడ్గం! ఉరుములు మెరుపులతో కూడిన తుఫానుకు కారణమయ్యే మేఘాల పై ఆవరణలో, అంటే మిసోస్ఫియర్‌లో పిడుగుపాట్లు సంభవిస్తే ఇలాంటి కాంతిపుంజాలు ఏర్పడుతుంటాయి. వీటిని ట్రాన్సియెంట్ ల్యూమినస్ ఈవెంట్ (టీఎల్‌ఈ) చెబుతుంటారు. సాధారణంగా వీటిని భూమిపై నుంచి చూడడం కష్టం. అంతరిక్షం నుంచి మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి.
ఈ ఫొటోను వ్యోమగామి నికోల్ వేపర్ అయెర్స్ శుక్రవారం ఉదయం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి తీశారు. మెక్సికో, అమెరికా మీదుగా ఐఎస్‌ఎస్ ప్రయాణిస్తున్న సమయంలో ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘భూమిపై కాంతి స్తంభం’’గా దీన్ని అభివర్ణించారు. ఇదిప్పుడు శాస్త్ర, సాంకేతిక ప్రపంచాన్ని ఎంతగానో అబ్బురపరుస్తోంది. వీటిని సాంకేతిక భాషలో స్ప్రైట్ లైట్నింగ్ బోల్డ్ (ఎస్‌ఎల్‌బీ) అంటారు. సాధారణ పిడుగుపాట్లు మేఘాల నడుమ, లేదంటే మేఘాలకు, నేలకు నడుమ పడుతుంటాయి. ఈ ఎస్‌ఎల్‌బీలు మాత్రం మెసోస్పియర్‌లోని పలుచని ఆవరణలోనే పేలిపోతాయి. తద్వారా ఇలాంటి ఎర్రని ‘మొలకలు’ పుట్టుకొస్తుంటాయి.