ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కొత్త ప్రెస్ సెక్రటరీ | My president I mean my husband Trumps new press secretary Katie Zacharia | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కొత్త ప్రెస్ సెక్రటరీ

Oct 14 2026 8:10 AM | Updated on Oct 14 2026 8:27 AM

My president I mean my husband Trumps new press secretary Katie Zacharia

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కొత్త ప్రెస్‌ సెక్రటరీ కేటీ జకారియా తొలి మీడియా సమావేశం అనూహ్య పరిణామాలతో ముగిసింది. బాధ్యతలు చేపట్టిన రెండో రోజే వైట్‌హౌస్‌ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన ఆమె.. కేవలం 14 నిమిషాల్లోనే సమావేశాన్ని ముగించారు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రసంగం, విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో ఇబ్బందులు పడి, చివర్లో ట్రంప్‌ను తన భర్తగా పొరబడటం వంటి పరిణామాలు అక్కడ నవ్వులు పూయించాయి. ఆమె పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్‌ తనను ప్రెస్‌ సెక్రటరీగా నియమించినందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని కేటీ జకారియా తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయాలని చాలాకాలంగా కోరుకుంటున్నానని అన్నారు. అనంతరం సుమారు ఆరు నిమిషాల పాటు ముందుగా సిద్ధం చేసుకున్న ప్రసంగాన్ని చదివారు. అందులో ట్రంప్‌ను ప్రశంసించడంతోపాటు ఆయన ప్రభుత్వం సాధించిన విజయాలుగా తాను భావిస్తున్న అంశాలను ప్రస్తావించారు.

‘తెలుసుకుని తిరిగి సమాధానం చెబుతా’
వెనెజువెలాపై జరిగిన యుద్ధాన్ని ‘చారిత్రాత్మకమైన ఒకరోజు యుద్ధం’గా అభివర్ణించారు. అదే సమయంలో ఇరాన్‌తో ఘర్షణ తొమ్మిదో నెలకు చేరువవుతోందన్నారు.
తర్వాత ఫాక్స్‌ న్యూస్‌ ప్రతినిధి పీటర్‌ డూసీ ప్రశ్న అడిగారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీతో ట్రంప్‌కు తాజాగా తలెత్తిన విభేదాల నేపథ్యంలో.. అమెరికా ఉక్రెయిన్‌తో నిఘా సమాచారాన్ని పంచుకోవడం నిలిపివేసిందా అని ప్రశ్నించారు. దీనిపై కేటీ వెంటనే సమాధానం చెప్పలేకపోయారు. ఆ విషయం గురించి తెలుసుకుని తిరిగి సమాధానం చెబుతానని డూసీకి తెలిపారు. తొలి మీడియా సమావేశంలోనే కీలకమైన ప్రశ్నకు తక్షణ సమాధానం ఇవ్వలేకపోవడం చర్చనీయాంశమైంది.

నలుగురు పిల్లలను పెంచుకుంటూ..
తర్వాత డైలీ మెయిల్‌ ప్రతినిధి గ్రీస్‌లో అమెరికా రాయబారిగా ఉన్న కింబర్లీ గిల్‌ఫాయిల్‌ గురించి ప్రశ్నించారు. ఏథెన్స్‌లో ఆమె వ్యవహారశైలికి సంబంధించి వచ్చిన వార్తల నేపథ్యంలో.. ట్రంప్‌ ఆమెను రాయబారి పదవి నుంచి తొలగించాలని ఇంకా ఆలోచిస్తున్నారా అని అడిగారు. దీనికి కేటీ జకారియా స్పందిస్తూ.. గిల్‌ఫాయిల్‌ను పదవికి రాజీనామా చేయాలని ట్రంప్‌ కోరినట్లు వెల్లడించారు. గిల్‌ఫాయిల్‌ గతంలో ఫాక్స్‌ న్యూస్‌ వ్యాఖ్యాతగా పనిచేశారు. ట్రంప్‌ పెద్ద కుమారుడైన డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌తో గతంలో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ అంశంపై కేటీ చేసిన ప్రకటన సమావేశంలో కీలక పరిణామంగా నిలిచింది. కేటీ జకారియా కుటుంబ జీవితం గురించి డైలీ మెయిల్‌ విలేకరి మరో ప్రశ్న అడిగారు. నలుగురు పిల్లలను పెంచుకుంటూ, ఒత్తిడితో కూడుకున్న ప్రెస్‌ సెక్రటరీ బాధ్యతలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. గతంలో ఈ పదవిలో ఉన్న కరోలిన్‌ లీవిట్‌ ఇద్దరు పిల్లల సంరక్షణతో ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవడంలో ఎదురైన సవాళ్ల కారణంగా రాజీనామా చేసినట్లు వచ్చిన కథనాలను కూడా ప్రస్తావించారు. దీనికి సమాధానం చెప్పే క్రమంలో కేటీ తడబడ్డారు.

‘నా అధ్యక్షుడు.. అంటే నా భర్త’ అంటూ..
కుటుంబ బాధ్యతల గురించి మాట్లాడుతున్న సమయంలో కేటీ జకారియా ట్రంప్‌ను తన భర్తగా పేర్కొనడం నవ్వులు పూయించింది. ‘నా అధ్యక్షుడు.. క్షమించండి, నా భర్త ఇక్కడ ఉన్నారు’ అని ఆమె అన్నారు. వెంటనే తన పొరపాటును గుర్తించినప్పటికీ, అప్పటికే మీడియా సమావేశంలో నవ్వులు వినిపించాయి. అనంతరం ఆమె తేరుకుని ట్రంప్‌ను ప్రశంసించడం కొనసాగించారు. కుటుంబాలకు అనుకూలంగా వ్యవహరించే అధ్యక్షుడు ట్రంప్‌ అని పేర్కొన్నారు. కుటుంబాలు ఉన్న మహిళలకు ఆయన ఎక్కువ అవకాశాలు కల్పించారని చెప్పారు. తనకు నలుగురు పిల్లలు ఉన్నారని తెలిసినా, ఈ ఉద్యోగం ఎంత కష్టమైనదో తెలిసినా ట్రంప్‌ తనపై నమ్మకం ఉంచారని, ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలననే విశ్వాసం తనకు ఉందని తెలిపారు.

14 నిమిషాల్లోనే ముగిసిన సమావేశం
ఈ పరిణామాల నేపథ్యంలో కేటీ జకారియా తొలి మీడియా సమావేశం కేవలం 14 నిమిషాల్లోనే ముగిసింది. ఆమె పనితీరుపై విమర్శలు వ్యక్తమైనప్పటికీ, వైట్‌హౌస్‌ మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచింది. వైట్‌హౌస్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ స్టీఫెన్‌ చ్యూంగ్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందిస్తూ.. కేటీ తొలి సమావేశం అద్భుతమైన ప్రారంభమని ప్రశంసించారు. ఆమె సమావేశాన్ని సమర్థంగా నిర్వహించారని, ఇప్పటివరకు ట్రంప్‌ ప్రభుత్వం చేసిన మంచి పనులను అమెరికా ప్రజలకు సమర్థంగా గుర్తుచేశారని పేర్కొన్నారు. కాగా, ట్రంప్‌ గత శుక్రవారం కేటీ జకారియాను కొత్త ప్రెస్‌ సెక్రటరీగా నియమించారు. ఆమె కరోలిన్‌ లీవిట్‌ స్థానంలో బాధ్యతలు చేపట్టారు. 

ఇదీ చదవండి: 9/11 రోజున ట్రంప్ ఎక్కడున్నారు? ఆయన వాదనలో వాస్తవమెంత?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement