అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలో మీజిల్స్(తట్టు) వ్యాధి తీవ్ర రూపం దాల్చింది. గత నాలుగు రోజుల్లోనే 88 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 646కు చేరింది. కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా క్లెమ్సన్,ఆండర్సన్ విశ్వవిద్యాలయాలకు కూడా ఈ వైరస్ పాకింది.
ఈ యూనివర్సిటీల్లో చాలా మంది విద్యార్థులు ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా ఈ వ్యాధి తీవ్రత వాయువ్య ప్రాంతంలోని ఎక్కువగా స్పార్టన్‌బర్గ్ (Spartanburg) పట్టణంలో ఎక్కువగా ఉంది. వ్యాధి సోకిన వారిలో ఎక్కువమంది టీకా తీసుకోని వారే కావడం గమనార్హం. ఈ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గాలి ద్వారా అత్యంత వేగంగా వ్యాపించే ఈ వైరస్ వల్ల నిమోనియా, మెదడు వాపు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ప్రమాదంలో అమెరికా హోదా..
కాగా 2000 సంవత్సరంలో అమెరికా మీజిల్స్ రహిత దేశంగా ప్రకటించబడింది. అయితే ఇప్పుడు కేసులు అధికంగా పెరుగుతుండడంతో అమెరికా తన "మీజిల్స్ రహిత" హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే యూటా, అరిజోనా, ఉత్తర కరోలినా వంటి రాష్ట్రాల్లో కూడా మీజిల్స్ కేసులు నమోదవుతున్నాయి.


