ఇరాన్‌ అధ్యక్షుడు పెజేష్కియాన్‌ సంచలన వ్యాఖ్యలు | Masoud Pezeshkian says over 14 million citizens ready to die defending Iran as a US deadline | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ అధ్యక్షుడు పెజేష్కియాన్‌ సంచలన వ్యాఖ్యలు

Apr 7 2026 2:59 PM | Updated on Apr 7 2026 7:07 PM

Masoud Pezeshkian says over 14 million citizens ready to die defending Iran as a US deadline

టెహ్రాన్‌: ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో సహా ఇరాన్‌ ప్రజలంతా ప్రాణ త్యాగం చేస్తామన్నారు. హర్మూజ్‌ జలసంధిని తెరవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు డెడ్‌లైన్‌ విధించారు. ఆ గడువు సమీపిస్తున్న వేళ పెజేష్కియాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్ విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, లేదంటే పవర్ స్టేషన్లు, వంతెనలు వంటి కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అదే జరిగితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని సూచించారు.   

ఈ నేపథ్యంలో పెజెష్కియన్ మాట్లాడుతూ.. “14 మిలియన్లకు పైగా ఇరానీయులు తమ ప్రాణాలను దేశం కోసం అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. నా దేశం కోసం నేనూ ఎప్పుడూ, ఎప్పటికీ ప్రాణ త్యాగం చేస్తా’నని పునరుద్ఘాటించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇరాన్‌లో మొత్తం జనాభా సుమారు 90 మిలియన్లు. గతంలో జరిగిన ప్రభుత్వ దమనకాండలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో 14 మిలియన్ల సంఖ్యను ప్రకటించడం, అమెరికా దాడులను అడ్డుకోవడానికి ఒక వ్యూహాత్మక ప్రయత్నంగా భావిస్తున్నారు. ప్రభుత్వ అనుకూల మీడియా, సందేశాల ద్వారా ప్రజలను స్వచ్ఛందంగా త్యాగానికి సిద్ధమవ్వమని పిలుపునిస్తోంది.

ఈ ప్రకటన ఇరాన్‌లోని అంతర్గత అసంతృప్తిని తగ్గించడమే కాకుండా, అమెరికా దాడులను నిరోధించడానికి ఒక ప్రచార మార్గంగా కనిపిస్తోంది. ప్రజలలో నిజమైన మద్దతు ఎంత ఉందో అనేది ప్రశ్నార్థకమే. అయినప్పటికీ, ఇరాన్ నాయకత్వం దేశ రక్షణ కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రపంచానికి చూపించడానికి ప్రయత్నిస్తోంది.

ఇరాన్ అధ్యక్షుడి ప్రకటన, అమెరికా హెచ్చరికలు, ప్రజల అసంతృప్తి అన్నీ కలిపి పశ్చిమాయాలో పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement