‘నా సీటది.. లేస్తావా.. లేపమంటావా?’.. ఎయిర్‌పోర్టులో మహిళపై యువకుని దౌర్జన్యం | Man Slaps Woman at Airport for Not Giving up Chair Video Goes Viral | Sakshi
Sakshi News home page

‘నా సీటది.. లేస్తావా.. లేపమంటావా?’.. ఎయిర్‌పోర్టులో మహిళపై యువకుని దౌర్జన్యం

Aug 2 2025 12:40 PM | Updated on Aug 2 2025 1:01 PM

Man Slaps Woman at Airport for Not Giving up Chair Video Goes Viral

బొగోటా: కొలంబియాలోని ఎల్ డొరాడో విమానాశ్రయంలో ఆ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అవుతోంది. కూర్చున్న సీటును వదులుకునేందుకు ఇష్టపడని ఒక మహిళపై ఒక యువకుడు దాడి చేశాడు. దీంతో విమానాశ్రయంలో కాసేపు గందరగోళం నెలకొంది.

కొలంబియాలోని బొగోటాలో గల ఎల్ డొరాడో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఉదంతం టెర్మినల్ వద్ద జరిగింది. ఒక మహిళ తాను కూర్చున్న సీటును ఇచ్చేందుకు నిరాకరించడంతో ఒక యువకుడు ఆమె చెంపపై కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. ఇది టెర్మినల్ వద్ద గందరగోళానికి దారితీసింది.
 

ఆ యువకుడిని హెక్టర్ శాంటాక్రూజ్‌ గాను, బాధితురాలిని క్లాడియా సెగురాగా విమాన సిబ్బంది గుర్తించారు. అతను పక్కకు వెళ్లినప్పుడు అతని భార్య పక్కనున్న సీటులో క్లాడియా సెగురా కూర్చుంది. అతను తిరిగి వచ్చి ఆమెను కుర్చీలో నుంచి లేవాలని కోరాడు. అయితే ఆమె అందుకు నిరాకరించింది. దీంతో అతను ఆమెతో ‘నువ్వు లేస్తావా? లేదా నన్ను లేపమంటావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తరువాత పక్కనే ఉన్న ఒక వ్యక్తితో ఫోన్‌లో రికార్డు చేయమని ​కోరుతూ, ఆమెపై చేయి చేసుకున్నాడు.

దీనిని గమనించిన అక్కడున్నవారు అతనిని అడ్డుకున్నారు. తరువాత అక్కడి భద్రతా సిబ్బంది అతనికి సంకెళ్లు వేసి, అక్కడి నుంచి తీసుకెళ్లారు.  క్లాడియా సెగురా తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ‘నేను వెయిటింగ్ ఏరియాకు చేరుకున్నప్పుడు, అక్కడంతా నిండిపోయింది. అయితే ఒక ఖాళీ కుర్చీని చూశాను. ఆ కుర్చీలో ఏమీ లేకపోవడంతో దానిలో కూర్చున్నాను.  ఇంతలో అతను వచ్చి నా చేతిపై కొట్టాడు. నా ఫోన్‌ లాక్కున్నాడు. నా ముఖంపైన,  తలపై బలంగా కొట్టాడు’ అని చెప్పుకొచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement