సెల్‌ఫోన్‌ కోసం 262 అడుగుల ఎత్తులో.. | Man Jumps Brazil Waterfalls For Cell Phone Viral Video | Sakshi
Sakshi News home page

చావు నోట్లో తలపెట్టి.. బతికి బట్ట కట్టాడు

Jun 9 2026 11:46 AM | Updated on Jun 9 2026 12:01 PM

Man Jumps Brazil Waterfalls For Cell Phone Viral Video

పట్టు తప్పిందా ఇక అంతే!. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. అందుకే ఆ యువకుడి సాహసం.. అక్కడున్నవాళ్లను షాక్‌కు గురి చేసింది. ఉత్కంఠతో చివరి నిమిషం దాకా ఏం జరుగుతుందా? అని  ఊపిరి బిగబట్టేలా చేసింది. పోనీ అదంతా ఎందుకు చేశాడా? అని కారణం తెలిశాక.. కంగుతినడం అక్కడున్నవాళ్ల వంతు అయ్యింది. 

ఒక సాధారణ పర్యాటక విహారం క్షణాల్లోనే ఉత్కంఠభరిత ఘటనగా మారింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇగ్వాజు జలపాతం (Iguazu Falls) వద్ద ఓ టూరిస్ట్‌ ప్రాణాలను లెక్కచేయకుండా వేగంగా ప్రవహిస్తున్న నీటిలోకి దూకాడు. కాసేపు అలాగే గనుక ఉండి ఉంటే.. ప్రవాహం ధాటికి కచ్చితంగా వందల అడుగుల కిందకి పడిపోయేవాడే!. ఈ సంఘటన బ్రెజిల్‌ వైపు ఉన్న జలపాతం ప్రాంతంలో శనివారం (జూన్‌ 6) చోటుచేసుకుంది.

ఇగ్వాజు జలపాతం అర్జెంటీనా–బ్రెజిల్‌ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద జలపాత వ్యవస్థల్లో ఒకటి. సుమారు 262 అడుగుల లోతు ఉంటుందది. రెండు దేశాల మధ్య ప్రాంతం కావడంతో పర్యాటకులు ఇక్కడికి పోటెత్తుతుంటారు. అదే సమయంలో ఇక్కడి భద్రతా చర్యలు అంతంత మాత్రంగానే ఉండడం తరచూ వార్తల్లో వినిపిస్తుంటుంది. 

అలా.. ఓ పర్యాటకుడు ఈ వాటర్‌ఫాల్‌ అంచుల్లో దిగడం ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఉన్నట్లుడి.. ఓ టూరిస్ట్‌ రాళ్లపై నుంచి దూకి ప్రవాహంలోకి వెళ్లి ఏదో వెతకబోయాడు. జలపాతం ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. బలమైన నీటి ప్రవాహం, జారిపోయే రాళ్లు, కేవలం కొద్ది అడుగుల దూరంలోనే ప్రాణాంతకమైన ఎత్తు ఉండటంతో ఈ ప్రాంతాన్ని అధికారులు కఠినంగా నియంత్రిస్తారు. అయినప్పటికీ ఆ వ్యక్తి చేసిన చర్య అక్కడున్న పర్యాటకులను తీవ్రంగా షాక్‌కు గురిచేసింది. కాసేపు ఏదో వెతికి.. ఆలస్యం చేయకుండా వెంటనే బయటకు వచ్చేశాడు. 

అతగాడి చేష్టలను ఇతర పర్యాటకులు వీడియోగా రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. అయితే చావు నోట్లో తలపెట్టి రావడానికి సెల్‌ఫోన్‌ కారణమంట!. చేజారి అది పడిపోయిందని.. అందుకే అతను అలా సాహసం చేశాడని తెలుస్తోంది. మరి సెల్‌పోన్‌ దొరికిందా? లేదా? అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. 

అదృష్టవశాత్తూ అతనికేం కాలేదు. సురక్షితంగా బయటకు వచ్చాడు. అయితే ఈ సంఘటన భద్రతా నియమాలపై మరోసారి చర్చకు దారితీసింది.ఇది మొదటిసారి జరిగిన ఘటన కాదని అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఓ పర్యాటకుడు తన టోపీ కోసం ఇలాగే చేశాడు. ఆ టైంలో అధికారులు సకాలంలో స్పందించడంతో బతికి బట్టకట్టాడు.

Advertisement
 
Advertisement
Advertisement