ఐరాస అవార్డు అందుకున్న అభిలాష | Major Abhilasha Barak Honoured With UN Military Gender Advocate Award | Sakshi
Sakshi News home page

ఐరాస అవార్డు అందుకున్న అభిలాష

Jun 8 2026 4:09 AM | Updated on Jun 8 2026 6:21 AM

Major Abhilasha Barak Honoured With UN Military Gender Advocate Award

మేజర్‌ అభిలాషను ప్రశంసించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఐక్యరాజ్యసమితి/న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన మేజర్‌ అభిలాష బారక్‌ ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ నుంచి యూఎన్‌ మిలటరీ జెండర్‌ అడ్వొకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు’అందుకున్నారు. భారత ఆర్మీలో మొట్టమొదటి మహిళా హెలికాప్టర్‌ పైలట్‌గాను అభిలాష గతంలో చరిత్ర సృష్టించారు. ఈమె లెబనాన్‌లో శాంతిపరిరక్షక విధులు నిర్వహించే భారత బెటాలియన్‌లో ఎంగేజ్‌మెంట్‌ టీమ్‌ కమాండర్, జెండర్‌ ఫోకల్‌ పాయింట్‌గా మేజర్‌ అభిలాష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

 శాంతి పరిరక్షక దళంలో పనిచేసే మహిళల పాత్ర ఎంత కీలకమైందో నిరూపించేందుకు గాను ఆమె చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది. ‘మీరు సేవ చేసే వారికి, మీతో కలిసి సేవలందించే వారికి ఆదర్శంగా నిలిచారంటూ పురస్కారం ప్రదానం సందర్భంగా ఐరాస సెక్రటరీ జనరల్‌ గుటెరస్‌ వ్యాఖ్యానించారు. కలలకు, నాయకత్వానికి, ధైర్యానికి, మానవాళికి సేవ చేయాలనే సంకల్పానికి లింగబేధం లేదని ఆయన పేర్కొన్నారు. 

కాంగో, దక్షిణ సూడాన్‌లలో విధుల్లో ప్రాణత్యాగం చేసిన భారత ఆర్మీకి చెందిన నాయిబ్‌ సుబేదార్‌ సుజీత్‌ కుమార్‌ ప్రధాన్, లాన్స్‌ హవల్దార్‌ హర్బజన్‌ సింగ్‌లకు గుటెర్రస్‌ ‘డ్యాగ్‌ హామర్‌షోల్డ్‌’ పురస్కా రాలను ప్రదానం చేశారు. వారి తరఫున ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పి.హరీశ్‌ అందుకు న్నారు. శాశ్వత శాంతి నెలకొన్నప్పుడు మాత్రమే ప్రతి గొంతు వినిపిస్తుంది.

 ప్రతి వ్యక్తికి సాధికారత సాధ్యమవతుందని అవార్డు అందుకున్న మేజర్‌ అభిలాష పేర్కొన్నారు. మేజర్‌ గవానీ, మేజర్‌ రాధిక  తర్వాత ఈ గౌరవం అందుకున్న మూడో భారత్‌ మహిళా అధికారి మేజర్‌ అభిలాష. అవార్డు అందుకున్న మేజర్‌ అభిలాష బరాక్‌ను ప్రధాని మోదీ అభినందించారు. మేజర్‌ అభిలాష అందించిన విశిష్ట సేవలకు, ఐరాస శాంతి పరిరక్షక దళాలకు భారత్‌ అందిస్తున్న చేయూతకు దక్కిన గౌరవంగా ఆయన ఎక్స్‌లో అభివర్ణించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement