breaking news
abhilasha
-
సెలవిక సమ్మర్‌కు సరదాగా స్కూల్‌కు
సెలవులు అయిపోయాయి.రేపో మాపో బడిగంట. ఇక అమ్మ ‘లేవరా’ అంటుంది. బయట స్కూల్ బస్ హారన్ మోగుతుంది. టీచర్ గుర్తొచ్చి భయమేస్తుంది. స్కూలుకు పోబుద్ధి కాదు. రెండు నెలల సెలవుల తర్వాత పిల్లలకు ఇలా అనిపించడం మామూలే. దీనిని స్కూల్ ఫీవర్ అనొచ్చు. అయితే ‘ఇలా నీకొక్కడికే కాదు... క్లాసంతా’ అని చెప్పాలి. పిల్లల్ని బడికి హుషారుగా సిద్ధం చేయాలి.తెలుగు రాష్ట్రాల్లో బడిగంట మోగే వేళన పిల్లలకు ఎన్నో సందేహాలు, లోలోపలి భయాలు, చిన్నపాటి ఆందోళనలు ఉంటాయి. కొత్త స్కూల్‌కి, కొత్త క్లాస్‌కి, కొత్త సెక్షన్‌కి మారడం... మళ్లీ ఆ భారీ స్కూల్ బిల్డింగ్‌లోకి అడుగు పెట్టడం... కొత్త టీచర్లను ఫేస్ చేయడం... అదీగాక ఇన్నాళ్లూ ఫోన్ చూసిన కళ్లతో రేపు బ్లాక్‌బోర్డ్ చూడాలంటే కష్టమే. అందుకే స్కూల్ ఫీవర్ తెచ్చుకుంటారు. అయితే దానికి విరుగుడు మాత్ర ఉంది.‘స్కూల్ ఫీవర్’ ఎందుకు?రెండు నెలలు ఇష్టానుసారం గడిచి ఉంటాయి. లేట్‌గా లేవడం, ఆడుకోవడం, టీవీ, నో హోంవర్క్.... ఇప్పుడు మళ్లీ టైమ్‌కి లేవాలి, ఇంట్లో స్కూల్లో రూల్స్ వస్తాయి... బ్రెయిన్ కి ఇది సడన్ బ్రేక్‌లా ఉంటుంది. అందుకే కడుపులో తిప్పేసినట్టు, ఏడుపు వచ్చేట్టు, చిరాకు కోపం, ఏదైనా ఎత్తుగడ వేయాలనిపించడం... పిల్లల్ని గమనించి మొదట వారిని ‘చిన్న పనుల్లో’ పెట్టాలి. ‘పుస్తకాలకు అట్టలు వేద్దాం రా’, ‘కొత్త పెన్ను పెన్సిలు బాక్స్‌లో పెట్టుకున్నావా?’, ‘యూనిఫామ్ సైజ్ చెక్ చేద్దాంరా’... ఈ పనులు చేయిస్తుంటే పిల్లల మైండ్‌కి ‘ఓకే, స్కూల్‌కి రెడీ అవ్వాలన్నమాట’ అనే ఫీలింగ్ వస్తుంది. ఫీవర్ దానంతట అదే తగ్గిపోతుంది.కొత్త బ్యాగ్ బెంగను పోగొడుతుందా?పోగొడుతుంది. కానీ బ్యాగ్ ఒక్కటే చాలదు. స్కూల్ ఫస్ట్ డే ఉదయం పిల్లలు లేచి చేసే మూడు పనులు వారి స్కూల్ ఫీవర్‌ని తరిమి కొడతాయి. ∙లేవగానే వారు చక్కగా తయారయ్యేలా చూసి అద్దంలో వారిని వారికి చూపించాలి. కొత్త యూనిఫామ్‌లో భలే బాగున్నావ్ అనాలి. ఏదో ఒక సరదా మాట చెప్పి నవ్వించాలి. నవ్వితే బ్రెయిన్ ‘నేను హ్యాపీ’ అని ఫిక్స్ అవుతుంది. ముందురోజు రాత్రే ఇష్టమైన టిఫిన్ కనుక్కుని ‘నీ ఫేవరెట్ టిఫిన్ రెడీ’ అని చెప్పాలి. కడుపు ఫుల్ అయితే మూడ్ ఆటోమేటిక్ సెట్. ∙స్కూల్‌కి వెళ్లేటప్పుడు ‘నీ బెస్ట్ ఫ్రెండ్ నీ సెక్షన్లోనే పడొచ్చు’ అనో, ‘ఈసారి ఎవరు కొత్త ఫ్రెండ్స్ అవుతారో’ అనో ఉత్సాహ పరచాలి. ‘క్లాస్‌రూమ్‌లకు కొత్తగా పెయింట్ చేయించారట’ అని చెప్పాలి. అలాంటివి వింటే పిల్లలు ఎగ్జయిట్ అవుతారు.హుషారుగా ఎలా ఉండాలి?‘మొదటిరోజు కాబట్టి నువ్వు ఈరోజు హుషారుగా ఉంటే సంవత్సరం అంతా హుషారుగా ఉంటావ్’ అని చెప్పాలి. ‘టీచర్ క్లాస్‌లోకి రాగానే గుడ్ మార్నింగ్ మేడం అని కాస్త గట్టిగా చెప్పు. లంచ్‌టైమ్‌లో ఒంటరిగా కూర్చోకు. ఇంకో విషయం... ఫస్ట్‌డే ఎవరూ నీ ర్యాంక్ అడగరు. నీ కొత్త షూస్, నీ నవ్వు చూస్తారు. నేను అందరితో కలిసిపోతా అనే ధైర్యంతో ఉండు’ అని చెప్పాలి.బస్సెక్కించేటప్పుడు ‘నీకు ఎలాంటి ఫీలింగ్ ఉందో నీ సెక్షన్లో ఉండే అందరు పిల్లలూ అలాంటి ఫీలింగ్‌తోనే ఇవాళ స్కూల్‌కి వస్తారు. ఏం పర్వాలేదు. వెళ్లు. అక్కడ బెంచీలు, బ్లాక్‌బోర్డు, బెల్ అన్నీ నీ కోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఏడాది నీదే. స్కూల్లో చదువు, ఆడు, కథలు విను, ఫ్రెండ్షిప్ చెయ్...’ అని చెప్పాలి. మొదటిరోజు దాటితే ఈ సంవత్సరం దాటేసినట్టే. కేస్ స్టడీ 1: కార్తికేయ, 7వ తరగతికార్తికేయ గుంటూరులో చదువుతున్నాడు. రేపు స్కూల్ తెరిస్తే సెవెన్త్‌లో కూచోవాలి. పోయిన సంవత్సరం ఆరుకు వచ్చినప్పుడు ఫస్ట్ డే ΄÷ద్దున్నే ‘కడుపునొప్పి’ అన్నాడు. అమ్మ టెంపరేచర్ చూసింది, జ్వరం లేదు. బస్సెక్కించబోతే మొహం అదోలా పెట్టి ‘కొత్త సెక్షన్లో నా ఫ్రెండ్స్ ఉండరు’ అన్నాడు. అమ్మ వాడితో ‘మా బుజ్జి కదూ. బ్యాగ్‌లో నీకిష్టమైన ఫుడ్ పెట్టాను. అది లంచ్‌లో నీ పక్కవాడితో షేర్ చేసుకో’ అని చెప్పింది. కార్తికేయ నసుగుతూనే బస్సెక్కాడు. డల్‌గా కూచున్నాడు. కాని సాయంత్రం ఇంటికి హుషారుగా వచ్చి ‘కొత్త ఫ్రెండ్ దొరికాడు మా’ అన్నాడు. స్కూల్ ఫీవర్ పోయింది. మళ్లీ ఈ సంవత్సరం కూడా ఈ ఫస్ట్‌డేకి ప్రిపేర్ చేయాలి.కేస్ స్టడీ 2: శ్రావ్య, 10వ తరగతిశ్రావ్య హైదరాబాద్‌లో ప్రయివేట్ స్కూల్. ఇప్పుడు 10కి వచ్చింది. 9వ క్లాస్‌లో మ్యాథ్స్‌లో 55 మార్కులు వచ్చాయి. సెలవులు అయిపోతున్నాయంటే శ్రావ్యకు మూడ్ పాడవుతోంది. ‘రేపు మ్యాథ్స్ మేడం సెలవుల్లో ఏం చేశావ్ అంటే ఏం చెప్పాలి? నన్నే లెక్క చేయమంటుందేమో’ అని ఏడుపు. అప్పుడు నాన్న పక్కన కూర్చుని ఒక పేపర్ ఇచ్చాడు. ‘దీనిమీద రాయి. టీచర్... నాకు లెక్కలు కష్టం. కానీ నేను నేర్చుకోవడానికి రెడీ. దయచేసి హెల్ప్ చేయండి. ఫస్ట్ డే ఇది మేడం డెస్క్ మీద పెట్టు. చదివిన ఏ టీచరూ హెల్ప్ చేయకుండా ఉండదు’ అన్నాడు. శ్రావ్యకు స్కూల్ ఫీవర్ పోయింది. బుర్రలో ‘భయం’ పోయి ‘భరోసా’ రావడంతో స్కూల్‌కు వెళ్లడానికి రెడీగా ఉంది. -
యుద్ధభూమిలో... జెండర్ పోరాటం
భారత సైన్యంలో తొలి మహిళా యుద్ధ హెలికాప్టర్ పైలట్‌గా చరిత్ర సృష్టించిన అభిలాష బరాక్ తాజాగా... ప్రతిష్ఠాత్మకమైన ‘యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ఇది ఇయర్’ అవార్డ్ అందుకున్నారు. లెబనాన్‌లోని ఐక్యరాజ్య సమితి దళంలో ఫిమేల్ ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్‌గా భారత బెటాలియన్‌లో పనిచేస్తున్నారు అభిలాష. లెబనాన్‌లో సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలలో లింగసమానత్వాన్ని పెంపొందించడానికి, మహిళలకు అండగా నిలవడంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.యునైటెడ్ నేషన్స్ ఇంటెరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్‌లో పనిచేస్తున్న మేజర్ బరాక్, దక్షిణ లెబనాన్‌లోని భారతీయ బెటాలియన్‌లో ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్, జెండర్ ఫోకల్ పాయింట్‌గా సేవలందిస్తున్నారు. గత సంవత్సరం జూన్‌లో ఈ మిషన్‌లో చేరినప్పటి నుంచి స్థానిక ప్రజలతో సన్నిహితంగా ఉంటూ మహిళలు, బలహీన వర్గాల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారు. వేలాది మంది మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చే విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.ఐరాస ప్రశంసలుఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో మహిళలతో కూడిన గస్తీ బృందాలకు నాయకత్వం వహించారు అభిలాష. ‘లెబనాన్ జెండర్ ఇనిషియేటివ్’ ఆమె విజయాలలో ఒకటి.‘లెబనాన్ జెండర్ ఇనిషియేటివ్’ అనేది ఏఐ–బేస్డ్ ప్లాట్‌ఫామ్. లింగ–ఆధారిత హింసను గోప్యంగా నివేదించడానికి, సహాయసేవలు, ఆత్మరక్షణ సమాచారాన్ని పొందడానికి పిల్లలకు సాయపడే వేదిక.శాశ్వత శాంతి వైపుగా...ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఐటీఈసీ) కార్యక్రమం కింద దక్షిణ లెబనానుకు చెందిన 75 మంది మహిళలకు స్కాలర్షిప్లు ఇప్పించడంలో సహాయపడ్డారు అభిలాష. ‘ఐటీఈసీ’ అనేది పునరుత్పాదక శక్తి, ఫైనాన్స్ వంటి రంగాలలో శిక్షణ అందించడంలో మహిళలకు సహాయపడుతుంది. శాంతి పరిరక్షకులకు, స్థానిక సమాజాలకు మధ్య నమ్మకాన్ని బలోపేతం చేయడానికి, మహిళలకు సహాయ సహకారాలు అందించే వ్యవస్థలను మెరుగుపరచడానికి అభిలాష చేసిన కృషిని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది.‘శాంతి పరిరక్షక మిషన్లను లింగ సమానత్వం అనేది ఎలా బలోపేతం చేయగలదో, శాశ్వత శాంతికి ఎలా దోహద పడగలదో బరాక్ నిరూపించారు’ అని అభిలాషను ప్రశంసించారు ఐక్యరాజ్య సమితి శాంతి కార్యకలాపాల అధిపతి జీన్–పియర్ లాక్రోయిన్స్. శాంతిభద్రతలలో మహిళల భాగస్వామ్యాన్నిప్రోత్సహించే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లే సైనిక శాంతి పరిరక్షకులకు 2016 నుండి యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ఇది ఇయర్’ అవార్డ్ ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డ్ అందుకున్న మూడో మహిళా అధికారి మేజర్ అభిలాష.బాల్యం నుంచే సైనిక క్రమశిక్షణహరియాణా రోహ్తక్ జిల్లా బాలంద్ గ్రామంలోని సైనిక కుటుంబంలో అభిలాష బరాక్ జన్మించారు. ఆమె తండ్రి కల్నల్ ఎస్.ఓమ్ సింగ్ జమ్మూ అండ్ కశ్మీర్ లైట్ ఇన్్రపాంటీలో సేవలందించగా, సోదరుడు ప్రస్తుతం భారతసైన్యంలో పనిచేస్తున్నారు. సైనిక కంటోన్మెంట్లో పెరగడం వల్ల అభిలాషలో క్రమశిక్షణ, సేవాభావం, దృఢసంకల్పం లాంటి విలువలు బాల్యంలోనే పాదుకున్నాయి.దిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీలో చదువుకున్న అభిలాష బీటెక్ (ఈసీయీ) చేశారు. చదువు పూర్తయిన తరువాత అమెరికాలోని డెలాయిట్‌లో బిజినెస్ టెక్నాలజీ అనలిస్ట్‌గా ఉద్యోగం సంపాదించారు అభిలాష. దేశానికి సేవ చేయాలనే సంకల్పం అభిలాషను భారత సాయుధ దళాల పరీక్షలకు సిద్ధమయ్యేలా చేసింది. సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బి) ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (వోటీఏ)లో శిక్షణ పొంది సెప్టెంబర్ 2018లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కార్పస్‌లో కమిషన్ పొందారు. కఠిన పరీక్షలు జయించి...భారత సైన్యం 2021లో మహిళా అధికారులకు యుద్ధవిమానయాన రంగం (కంబాట్ ఏవియేషన్)లో ద్వారాలు తెరిచింది. సాయుధ దళాలలో లింగ సమాన్వతం కోసం చేపట్టిన విస్తృత కార్యక్రమాలకు అనుగుణంగా ఈ విధాన మార్పు జరిగింది. కంబాట్ ఏవియేషన్‌లో చేరడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మహిళా అధికారులలో అభిలాష బరాక్ ఒకరు.పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, మెడికల్ ఎవల్యుయేషన్స్తో సహా... రకరకాల కఠినమైన ఎంపిక ప్రక్రియల తర్వాత కేవలం ఇద్దరు మాత్రమే ఎంపికయ్యారు. అందులో బరాక్ ఒకరు. ప్రీ–ఆర్మీ పైలట్ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తన బ్యాచ్‌లో ప్రథమస్థానంలో నిలిచినందుకు ప్రతిష్ఠాత్మకమైన ‘ఫ్లెడ్జింగ్’ ట్రోఫీని అందుకున్నారు. -
ఐరాస అవార్డు అందుకున్న అభిలాష
ఐక్యరాజ్యసమితి/న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన మేజర్ అభిలాష బారక్ ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నుంచి యూఎన్ మిలటరీ జెండర్ అడ్వొకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’అందుకున్నారు. భారత ఆర్మీలో మొట్టమొదటి మహిళా హెలికాప్టర్ పైలట్‌గాను అభిలాష గతంలో చరిత్ర సృష్టించారు. ఈమె లెబనాన్‌లో శాంతిపరిరక్షక విధులు నిర్వహించే భారత బెటాలియన్‌లో ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్, జెండర్ ఫోకల్ పాయింట్‌గా మేజర్ అభిలాష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శాంతి పరిరక్షక దళంలో పనిచేసే మహిళల పాత్ర ఎంత కీలకమైందో నిరూపించేందుకు గాను ఆమె చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది. ‘మీరు సేవ చేసే వారికి, మీతో కలిసి సేవలందించే వారికి ఆదర్శంగా నిలిచారంటూ పురస్కారం ప్రదానం సందర్భంగా ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్ వ్యాఖ్యానించారు. కలలకు, నాయకత్వానికి, ధైర్యానికి, మానవాళికి సేవ చేయాలనే సంకల్పానికి లింగబేధం లేదని ఆయన పేర్కొన్నారు. కాంగో, దక్షిణ సూడాన్‌లలో విధుల్లో ప్రాణత్యాగం చేసిన భారత ఆర్మీకి చెందిన నాయిబ్ సుబేదార్ సుజీత్ కుమార్ ప్రధాన్, లాన్స్ హవల్దార్ హర్బజన్ సింగ్‌లకు గుటెర్రస్ ‘డ్యాగ్ హామర్‌షోల్డ్’ పురస్కా రాలను ప్రదానం చేశారు. వారి తరఫున ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పి.హరీశ్ అందుకు న్నారు. శాశ్వత శాంతి నెలకొన్నప్పుడు మాత్రమే ప్రతి గొంతు వినిపిస్తుంది. ప్రతి వ్యక్తికి సాధికారత సాధ్యమవతుందని అవార్డు అందుకున్న మేజర్ అభిలాష పేర్కొన్నారు. మేజర్ గవానీ, మేజర్ రాధిక తర్వాత ఈ గౌరవం అందుకున్న మూడో భారత్ మహిళా అధికారి మేజర్ అభిలాష. అవార్డు అందుకున్న మేజర్ అభిలాష బరాక్‌ను ప్రధాని మోదీ అభినందించారు. మేజర్ అభిలాష అందించిన విశిష్ట సేవలకు, ఐరాస శాంతి పరిరక్షక దళాలకు భారత్ అందిస్తున్న చేయూతకు దక్కిన గౌరవంగా ఆయన ఎక్స్‌లో అభివర్ణించారు. -
మేజర్ అభిలాషకు ఐరాస అవార్డు
ఐక్యరాజ్యసమితి: లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి శాంతి మిషన్‌లో భారత శాంతి పరిరక్షక దళం తరఫున సేవలందిస్తున్న మేజర్ అభిలాష బారక్ ప్రతిష్టాత్మక మిలటరీ జెండర్ అడ్వొకేట్ అవార్డుకు ఎంపికయ్యారు. విధుల్లో భాగంగా మహిళలు, బాలికలకు చేరువయ్యేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఐరాస శుక్రవారం ఎక్స్‌లో తెలిపింది. యూఎన్ ఇంటెరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్(యూనిఫిల్)లో ఫిమేల్ ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్‌గా బారక్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారత ఆర్మీలో కంబాట్ హెలికాప్టర్ పైలట్‌గా ఎంపికైన మొట్టమొదటి మహిళ అభిలాష బారక్. ఈ నెల 29వ తేదీన ఐరాస శాంతిపరిరక్షక దళాల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అభిలాషకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డును గతంలో ఐరాస శాంతిపరిరక్షక దళాల్లో పనిచేసిన భారత్‌కు చెందిన మేజర్ సుమన్ గవానీ, మేజర్ రాధికా సేన్ తమ సేవలకు గుర్తింపుగా అందుకోవడం విశేషం. -
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై స్టేకు నో
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం శాఖ ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో విధుల్లో చేరాలని సీనియర్ ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్‌కు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్) బుధవారం సూచించింది. అక్కడ కూడా సీనియర్ అధికారుల అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ, విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను నిలుపుదల చేస్తూ, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.అభిలాష.. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆమెను మొదట పశ్చిమ బెంగాల్ కేడర్‌కు కేటాయించారు. అయితే ఆమె ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారిని వివాహం చేసుకుని 1997లో తన కేడర్‌ను ఏపీకి మార్చుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆమెను ఏపీకి కేటాయించారు. కేటాయింపుల అంశంపై గతంలో క్యాట్ ఇచ్చిన ఆర్డర్ ఆధారంగా ఆమె 11 సంవత్సరాలుగా తెలంగాణలో కొనసాగుతున్నారు. ఇలా రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించినా.. కొందరు ఐపీఎస్‌లు తెలంగాణలోనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్ అధికారులు డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి వెంటనే ఏపీకి వెళ్లేలా రిలీవ్ చేయాలని ఫిబ్రవరి 21న కేంద్రం.. తెలంగాణను ఆదేశించింది. దీంతో 22న తెలంగాణ సర్కార్ అంజనీకుమార్, అభిలాష బిస్త్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ అభిలాష క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జ్యుడీషియల్ సభ్యురాలు డాక్టర్ లతా బస్వరాజ్ పట్నే, పరిపాలన సభ్యురాలు శాలిని మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టింది.సీనియారిటీ వివాదం ఉంది..పిటిషనర్ తరఫు న్యాయవాది జె.సుధీర్ వాదనలు వినిపి స్తూ.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు నిలుపుదల చేయాలని కోరారు. ఐపీఎస్ అధికారుల సీనియారిటీకి సంబంధించిన వివాదం ఉందన్నారు. ఈ విషయంలో అభిలాష వాదనను గతంలో క్యాట్, హైకోర్టు సమర్థించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ వాదనలు విన్న బెంచ్.. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులపై వెంటనే స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కేంద్రం వాదనలు కూడా విని తీర్పు వెలువరిస్తామని, అప్పటివరకు ఏపీలో చేరాలని సూచించింది. -
ఇద్దరు ఐపీఎస్‌లను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి హోం కేడర్ ఏపీకి బదిలీ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్‌లను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల మేరకు ఇద్దరు అధికారులను రిలీవ్ చేసినట్టు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్‌కు సూచించారు.1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ ప్రస్తుతం తెలంగాణ రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా, 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితోపాటు ఏపీ హోం కేడర్‌కు వెళ్లాల్సిందిగా కేంద్ర హోంశాఖ సూచించిన కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని మాత్రం ఇంకా రిలీవ్ చేయలేదు. కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత రిలీవ్ చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
ఆ ఊరి పేరు ఐఏఎస్ ఫ్యాక్టరీ... స్త్రీ విద్యతో ఆ ఊరి పేరే మారింది!
ఒకప్పుడు ఆ ఊరి పేరు వినబడగానే ‘వామ్మో’ అనుకునేవారు. దొంగతనాలు, అక్రమ మద్యం వ్యాపారానికి పేరు మోసిన రాజస్థాన్‌లోని నయాబస్ గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఆదర్శ గ్రామం అయింది. అమ్మాయిల చదువుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి కారణం ఈ గ్రామానికి చెందిన మహిళలు ఐపీఎస్ నుంచి జడ్జీ వరకు ఉన్నత ఉద్యోగాలు ఎన్నో చేయడం. జడ్జీగా ఎంపికైన అభిలాష జెఫ్ విజయాన్ని ఊరు ఊరంతా సెలబ్రెట్ చేసుకుంది. ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు అభిలాష రోల్ మోడల్...ఒక ఇంట్లో పెద్ద ఉద్యోగం వస్తే... ఆ సంతోషం ఆ ఇంటికి మాత్రమే పరిమితమైపోతుంది. కానీ అభిలాష జెఫ్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆమె జడ్జీగా ఎంపికైన సందర్భం ఊరంతటికీ పండగ అయింది. అభిలాషను వీధుల్లో ఊరేగిస్తూ డీజే, డ్యాన్స్‌లతో ఆమె విజయాన్ని గ్రామస్థులు సెలబ్రెట్ చేసుకున్నారు. ఈ ఊరేగింపులో సంప్రదాయ రాజస్థానీ దుస్తులు ధరించిన మహిళలు ఎక్కువగా ఉన్నారు.ఈ ఊరేగింపులో పాల్గొన్న సరితా మీనా ఇలా అంటుంది... ‘మా అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాను. ఏదో ఒకరోజు మా అమ్మాయి అభిలాషలాగే పెద్ద ఉద్యోగం చేస్తుంది’ సరితా మీనాలాగే కలలు కన్న తల్లులు, ఎన్ని కష్టాలు వచ్చినా తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివిస్తామని ప్రతిజ్ఞ చేసిన తల్లులు ఆ ఊరేగింపులో ఎంతోమంది ఉన్నారు. రాజస్థాన్‌లోని నీమ్ కా ఠాణా జిల్లాలోని నయాబస్ గ్రామంలోని యువతులకు ఆ సంతోషకరమైన రోజు ఒక మలుపు.‘అభిలాషలాంటి అమ్మాయిల వల్ల ఊరికి జరిగిన మేలు ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివించాలనుకుంటారు. పది చాలు, పై చదువులు ఎందుకు అనే ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది’ అంటుంది కర్ణిక అనే గృహిణి.అభిలాషకు ముందు అల్కా మీనాను కూడా ఇలాగే ఊరేగించారు. ఈ గ్రామానికి చెందిన అల్కా మీనా ఐపీఎస్ పంజాబ్‌లో డిఐజీగా విధులు నిర్వహిస్తోంది. అల్కా మీనా నుంచి అభిలాష వరకు ఎంతోమంది మహిళలు ఎన్నో అడ్డంకులను అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. విశేషం ఏమిటంటే నయాబస్ను ఇప్పుడు ‘ఐఏఎస్ ఫ్యాక్టరీ’ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఊరి నుంచి ఐఏఎస్‌లాంటి ఉన్నత సర్వీసులకు ఎంపికైన వారు కూడా ఉన్నారు.ఇప్పుడు గ్రామంలో ఎటు చూసినా అల్కా మీనా, అభిలాషలాంటి విజేతల పోస్టర్లు కలర్ ఫుల్‌గా కనిపిస్తాయి. కోచింగ్ సెంటర్ల వారు అంటించిన ఈ పోస్టర్లలో ‘ఇలాంటి విజేతలు మీ ఇంట్లో కూడా ఉన్నారు’ అని ఉంటుంది.ఈ గ్రామంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు వారి ప్రపంచంలో మాత్రమే ఉండిపోకుండా ఎప్పుడూ ఊరితో టచ్‌లో ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిల చదువుకు సంబంధించి చొరవ తీసుకుంటారు. ఒకప్పుడు ఈ ఊళ్లో ఒకే స్కూల్ ఉండేది. అమ్మాయిల సంఖ్య అంతంత మాత్రమే. ఇప్పుడు మాత్రం ‘బాలికల పాఠశాల’తో కలిసి మూడు స్కూల్స్ ఉన్నాయి.చదువు వల్ల నయాబస్ ఆదర్శగ్రామం కావడం ఒక కోణం అయితే, స్త్రీ సాధికారత మరో కోణం. చదువు వల్ల అమ్మాయిలు తమ హక్కుల గురించి తెలుసుకోవడం నుంచి ఆర్థిక భద్రత, ఉన్నత ఉద్యోగం వరకు ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పర్చుకుంటున్నారు. తమ కలలను నిజం చేసుకుంటున్నారు.ఆటల్లోనూ...ఉన్నత చదువు, ఉద్యోగాలలోనే కాదు ఆటల్లో రాణిస్తున్న వారు కూడా నయాబస్లో ఎంతోమంది ఉన్నారు. దీనికి ఉదాహరణ... సలోని మీనా. గత ఏడాది ఇండో–నేపాల్ అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో ఇరవై ఏళ్ల మీనా మూడోసారి స్వర్ణం గెలుచుకొని ఊళ్లో సంబరం నింపింది. రాబోయే ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఆడాలనేది తన లక్ష్యం అని చెబుతుంది మీనా. భవిష్యత్‌కు సంబంధించి సలోని మీనాకు భారీ ప్రణాళికలు ఉన్నాయి. ఊరు అండ ఉంది. ఇంకేం కావాలి! చదువు అనేది వజ్రాయుధం, తిరుగులేని మహా ఉద్యమం అని మరోసారి నయాబస్ గ్రామం విషయంలో నిరూపణ అయింది. ఇల్లే ప్రపంచంగా మారిన ఎంతోమంది అమ్మాయిలు చదువుల తల్లి దయ వల్ల ప్రపంచాన్ని చూస్తున్నారు. ఉన్నత ఉద్యోగాల్లో వెలిగిపోతున్నారు. -
అదనపు కలెక్టర్‌గా అభిలాష
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా మహబాబూబాద్ జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా విధులు నిర్వర్తిస్తు న్న అభిలాష అభినవ్ నియమితులయ్యారు. అలాగే, ప్రస్తుత ఖమ్మం అదనపు కలెక్టర్ స్నేహలతను జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా నియమించారు. ఈమేరకు రాష్ట్రప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 బ్యాచ్ ఐఏఎస్ 2018వ బ్యాచ్‌కు చెందిన అభిలాష అభివన్‌కు 2020 ఆగస్టులో మహబూబాబాద్ అదనపు కలెక్టర్ తొలి పోస్టింగ్ వచ్చింది. అక్కడ పనిచేసిన మూడేళ్ల కాలంలో ఆమె మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. బిహార్‌కు చెందిన ఆమె పాట్నాలో పదో తరగతి 91శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. అలా గే, ఇంటర్ 85శాతం మార్కులతో 2007లో ఉత్తీర్ణత సాధించగా, బీటెక్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) నావి ముంబైలోని ఏసీ పటేల్ కళాశాలలో 2012లో పూర్తిచేశారు. అనంతరం పూణేలోని ఐబీఎంలో రెండేన్నరేళ్లు విధులు నిర్వర్తించిన అభిలాష వాలీబాల్ చాంపియన్ షిప్‌గా గుర్తింపు తెచ్చుకోవటంతో పాటు పెయింటింగ్ హాబీగా ఉంది. కాగా ఆమె తండ్రి గోల్నాథ్ సర్కార్ సైతం ఐపీఎస్ అధికారే కావడం విశేషం. స్నేహలతకు మంచి గుర్తింపు 2020 ఫిబ్రవరి 10న ఖమ్మం అదనపు కలెక్టర్‌గా విధుల్లో చేరిన స్నేహలత విధినిర్వహణలో మంచి పేరు సంపాదించారు. స్థానిక సంస్థలకు సంబంధించి వివిధ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ విజయవంతమయ్యేలా కీలక భూమిక పోషించారు. మన ఊరు – మన బడి, గ్రామాల్లో పల్లెప్రగతి పనులు వేగవంతమయ్యేలా కృషి చేశారు. కాగా, స్నేహలత ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించడం ద్వారా ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం పెరిగేందకు దోహదపడ్డారు. కల్లూరు ఆర్డీఓగా శివాజీ ఖమ్మం ఆర్డీఓ రవీంద్రనాథ్ తొర్రూరుకు బదిలీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(భూసేకరణ)గా ఉన్న బి.శివాజీని కల్లూరు ఆర్డీఓగా నియమించారు. ఈ స్థానంలో ఉన్న సీహెచ్.సూర్యనారాయణను కోదాడ ఆర్డీఓగా బదిలీ చేశారు. అలాగే, ఖమ్మం ఆర్డీఓ ఎం.వీ.రవీంద్రనాథ్ను తొర్రూరు ఆర్డీఓగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, ఖమ్మం ఆర్డీఓగా మాత్రం ఇంకా ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. -
‘అభిలాష’మూవీ ఎలా ఉందంటే..
టైటిల్: అభిలాష నటీనటులు: అమర్ దీప్, అశ్విని రెడ్డి, బాహుబలి ప్రభాకర్, సమ్మెట గాంధీ, కుమనన్ సేతురామన్ తదితరులు నిర్మాణ సంస్థ: హరిహర ధీర మూవీ మేకర్స్ నిర్మాత: సీహెచ్ శిరీష దర్శకత్వం: శివపస్రాద్ చలవాది సంగీతం : ఏంఏం కుమార్ నేపథ్య సంగీతం: రోహి బాబు సినిమాటోగ్రఫీ: సౌమ్యశర్మ ఎడిటర్: రవితేజ విడుదల తేది: జూన్ 2, 2023 ‘అభిలాష’కథేంటంటే.. వైదేహి(అశ్విని రెడ్డి) ఓ అనగారిన వర్గానికి చెందిన యువతి. ఉన్నత చదువులు చదివి, కలెక్టర్ కావాలనేది ఆమె కోరిక. కానీ ఆమె ఉన్న ఊర్లో అనగారిన వర్గానికి చెందిన వాళ్లు పెద్ద చదువులు చదువొద్దని కండీషన్ పెడతాడు గ్రామ పెద్ద. దీంతో ఊరి పెద్దకు తెలియకుండా వైజాగ్‌లో సివిల్స్‌కి ప్రిపేర్ అవుతుంది వైదేహి. ఈ క్రమంలో ఆమెకు శ్రీరామ్(అమర్దీప్) పరిచయం అవుతాడు. అతను ఉద్యోగం కోసం వైజాగ్ వచ్చి, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నానని అబద్దం చెప్పి వైదేహికి క్లోజ్ అవుతాడు. శ్రీరామ్ ఎందుకు వైదేహికి క్లోజ్ అయ్యాడు? సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వైదేహిని చంపేందుకు ప్రయత్నించేది ఎవరు? ఎందుకు? చివరకు వైదేహి తన లక్ష్యాన్ని నెరవేర్చుకుందా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘అభిలాష’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సరిగ్గా 40 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అభిలాష’ చిత్రం ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అదే పేరుతో ఓ సినిమా వస్తుందంటే కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు ఈ ‘అభిలాష’ చిత్రం అందుకోలేకపోయింది. కానీ ఓ మంచి సందేశాన్ని మాత్రం ఇచ్చింది. విద్య అనేది ఒక వర్గానికే కాదు, అందరికి ముఖ్యమనే మంచి మెసేజ్‌ని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ తెరపై చూపించడంలో కాస్త విఫలం అయ్యాడు. మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే.. అంతా కొత్తవాళ్లు అయినా వారి నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు. ఇక నటీనటుల ఫెర్పార్మెన్స్ విషయాలకొస్తే.. శ్రీరామ్‌గా అమర్ దీప్ తన పాత్రకు న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్‌లో ఈజ్‌తో చేశాడు. వైదేహిగా అశ్విని రెడ్డి చక్కగా నటించింది. సమ్మెట్ట గాంధీ, బాహుబలి ప్రభాకర్, కుమనన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తిరుపతి జావన అందించిన సాహిత్యం బాగుంది. నేపథ్య సంగీతం అక్కడక్కడ శృతిమించింది. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
మంచి సందేశంతో ‘అభిలాష’
అమర్ దీప్, అశ్వినీ రెడ్డి హీరో హీరోయిన్లుగా శివప్రసాద్ చలువాది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అభిలాష’. సీహెచ్ శిరీష నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటుడు పృథ్వీ ఈ సినిమా సీడీ, ట్రైలర్‌ను రిలీజ్ చేసి, ‘‘ఓ మంచి పాయింట్‌తో తీసిన ఈ చిత్రం ట్రైలర్ బాగుంది’’ అన్నారు. ‘‘వల్గారిటీ లేకుండా విద్యకు ఉన్న ప్రాధాన్యాన్ని సందేశాత్మకంగా ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు శివ ప్రసాద్. ‘‘బలగం’ సినిమా కోవలో ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు నిర్మాత సీహెచ్ శిరీష. -
Woman combat pilot: ఫస్ట్ టైమ్ అభిలాష నెరవేరింది
చిన్నప్పుడు అభిలాషకు తండ్రి కథలు చెప్పేవాడు. అవి కాలక్షేప కథలు, కంచికి వెళ్లే కథలు కావు. మన వీరసైనికుల నిజమైన జీవిత కథలు. ఆ కథలు వింటూ పెరిగిన అభిలాష భారత సైన్యంలో పనిచేయాలని గట్టిగా అనుకుంది. తాజాగా ‘ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమన్ కంబాట్ ఏవియేటర్’గా చారిత్రక గుర్తింపు పొందింది కెప్టెన్ అభిలాష బరాక్. అభిలాష బరాక్కు మిలిటరీ అనే మాట కొత్త కాదు. నాన్న ఓమ్‌సింగ్ సైనిక అధికారి. దీంతో దేశంలోని రకరకాల కంటోన్మెంట్లలో పెరిగింది అభిలాష. సైనికుల వీరగాథలను తండ్రి స్ఫూర్తిదాయకంగా చెబుతుండేవాడు. ఆ ప్రభావం తన మీద పడింది. అలా మిలిటరీలో పనిచేయాలనే కలకు అంకురార్పణ జరిగింది. ఒకరోజు ఇండియన్ మిలిటరీ అకాడమీలో తన సోదరుడి పాసింగ్ ఔట్ పరేడ్‌కు హాజరైంది అభిలాష. ఆ వాతావరణం తనను ఎంత ఉత్తేజపరిచింది అంటే...పనిచేస్తే మిలిటరీలోనే పనిచేయాలన్నంతగా. ‘మిలిటరీ యూనిఫామ్’లో తనను తాను చూసుకొని మురిసిపోవాలనుకునేంతగా! ‘నా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసుకున్న రోజు అది’ అని గతాన్ని గుర్తు చేసుకుంది అభిలాష. దిల్లీ టెక్నాలజికల్ యూనివర్శిటీలో బీటెక్ పూర్తిచేసిన అభిలాష 2018లో ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాప్స్’లో చేరింది. దీనికి ముందు కొన్ని ప్రొఫెషనల్ మిలిటరీ కోర్స్‌లు పూర్తిచేసింది. ‘ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు ఇది. కంబాట్ ఏవియేషన్ కోర్స్ విజయవంతంగా పూర్తి చేసిన కెప్టెన్ అభిలాష ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమన్ కంబాట్ ఏవియేటర్...’ అని ఆర్మీ తన అధికార ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలియజేసింది. ప్రత్యేక విధులు నిర్వర్తించే దళంగా ప్రసిద్ధమైన ఏవియేషన్ కాప్స్‌కు ఉన్న ఘనచరిత్ర తక్కువేమీ కాదు. రుద్ర, చీతా, ధృవ...మొదలైన హెలికాప్టర్లను ఆపరేట్ చేయడంతో పాటు సియాచిన్‌లాంటి సున్నిత ప్రాంతాలలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తుంది. ‘రెట్టించిన అంకితభావంతో పనిచేయడానికి తాజా బాధ్యత ప్రేరణ ఇస్తుంది’ అంటుంది హరియాణాకు చెందిన 26 సంవత్సరాల అభిలాష ‘స్విఫ్ట్ అండ్ ష్యూర్’ అనేది మన సైన్యానికి సంబంధించిన లక్ష్య ప్రకటిత నినాదం. ఈ నినాదాన్ని వేగంగా అందుకున్న యువ సైనికులలో అభిలాష ఒకరు. ఆమెకు అభినందనలు. -
పాపులర్ నవలలు.. వాటి ఆధారంగా వచ్చిన సినిమాలు
Top 10 Telugu Classic Movies Based On Novels: సాధారణంగా మనం చాలా సినిమాలను వాటి ట్రైలర్స్, టీజర్స్, ప్రమోషన్స్ నచ్చిన తర్వాత చూస్తాం. ఆ మూవీస్ కొంచెం ఆసక్తికరంగా ఉంటే వాటి గురించి పరిశోధిస్తాం. అవి రీమెక్ చేశారా? డబ్బింగ్ మూవీస్ ఆ? హాలీవుడ్ చిత్రాల నుంచి కాపీ కొట్టారా? లేదా ఏవైనా పుస్తకాలు, నవలల నుంచి స్ఫూర్తి పొంది తీశారా? అని. ఇలా ఏదో ఒక విధంగా తీసిని చిత్రాలంటే కొంచెం ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. అలాంటి సినిమాలు చూడటానికి, పుస్తకాలు చదవడానికి సైతం మనం మొగ్గుచూపుతాం. అలాగే రీమెక్ చిత్రాలైతే ఒరిజనల్ అండ్ రీమెక్ సినిమాలతో పోల్చడం వంటి విషయాలు మనకు ఒకరకమైన కిక్‌ను కూడా ఇస్తుంది. కాపీ సినిమాలు అయితే ఇంతకుముందు అలా మరే సినిమాలు వచ్చాయో తెలుసుకోవాలనే కుతుహలం ఏర్పడుతుంది. ఇలానే పాపులర్ అయిన కొన్ని నవలల నుంచి తీసుకున్న తెలుగు క్లాసిక్ సినిమాలు మీకోసం. 1. అభిలాష- యండమూరి వీరేంద్రనాథ్ (అభిలాష) 2. చంటబ్బాయి- మల్లాది వెంకటకృష్ణ మూర్తి (చంటబ్బాయి) 3. మీనా- యుద్దనపూడి సులోచనరాణి (మీనా) 4. సెక్రటరీ- యుద్దనపూడి సులోచనరాణి (సెక్రటరీ) 5. ప్రేమ్ నగర్- కోడూరి కౌసల్య దేవి 6. కాష్మోరా- యండమూరి వీరేంద్రనాథ్ (తులసిదళం) 7. అహా నా పెళ్లంటా- ఆది విష్ణు (సత్యం గారిల్లు) 8. డాక్టర్ చక్రవర్తి- కోడూరి కౌసల్య దేవి (చక్రభ్రమణం) 9. కన్యాశుల్కం- గురజాడ అప్పారావు 10. సితార- వంశీ (మహల్లో కోకిల) -
అభిలాష ‘హ్యాట్రిక్’ టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కేన్స్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్లేయర్ ఎ. అభిలాష సత్తా చాటింది. యూసుఫ్‌గూడలోని కేవీబీఆర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్లో అండర్–17, అండర్–19, మహిళల సింగిల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి మూడు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. ఆదివారం జరిగిన అండర్–17 బాలికల సింగిల్స్ ఫైనల్లో అభిలాష 15–10, 15–8తో ఎం. తేజస్విని (ఎస్ఎస్)పై గెలుపొందింది. అండర్–19 విభాగంలో 15–6, 15–13తో డి. శ్రేయ (స్పార్ధ)ను ఓడించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో అభిలాష 15–11, 15–12తో కె. ప్రణాలి (ఎల్బీ స్టేడియం)పై గెలుపొంది హ్యాట్రిక్ టైటిళ్లను సొంతం చేసుకుంది. మరోవైపు అండర్–13 బాలబాలికల విభాగంలో ఎస్. శ్రీరాగ్, కె. శ్రేష్టారెడ్డి చాంపియన్లుగా నిలిచారు. బాలుర సింగిల్స్ తుదిపోరులో శ్రీరాగ్ (ఫ్లయింగ్ లోటస్) 15–6, 15–7తో ఓంప్రకాశ్ రెడ్డి (కేన్స్)పై గెలుపొందగా... బాలికల కేటగిరీలో ఎ. సాయి చతుర (ఎంఎన్సీ)పై కె. శ్రేష్టారెడ్డి విజయం సాధించింది. బాలుర డబుల్స్ ఫైనల్లో బి. జశ్వంత్ రామ్–కె. జై ఆదిత్య (కేన్స్) జంట 15–7, 15–12తో ఓంప్రకాశ్ రెడ్డి– శ్రీరాగ్ (ఫ్లయింగ్) జోడీపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు అండర్–13 బాలికల డబుల్స్: 1. కె. వెన్నెల–కె. రితిక (వీబీఏ), 2. సాయి చతుర–ఎ. చరిష్మా (వీబీఏ). అండర్–15 బాలుర సింగిల్స్: 1. ఎం. శశాంక్ (స్పార్ధ), 2. ధరణ్ కుమార్ (సీఏబీఏ). బాలుర డబుల్స్: 1. ధరణ్ కుమార్– పీవీఎస్ సుజ్వాల్ (సీఏబీఏ), 2. కె. ఉదయ్ తేజ్–శ్రవంత్ సూరి (సీఏబీఏ). బాలికల డబుల్స్: 1. డీవీ లయ–డీవీ శ్రుతి, 2. కె. వైష్ణవి– మృత్తిక షెనోయ్. అండర్–17 బాలుర సింగిల్స్: 1. ఎస్. సాయి పృథ్వీ, 2. బి. యశ్వంత్ రామ్. బాలుర డబుల్స్: 1. బి. నిఖిల్ రాజ్–మనీశ్ కుమార్, 2. లోకేశ్ రెడ్డి–కె. రోహిత్ రెడ్డి. బాలికల డబుల్స్: 1. డీవీ లయ–డీవీ శ్రుతి, 2. డి. అను సోఫియా–ఎస్. వైష్ణవి. అండర్–19 బాలుర సింగిల్స్: 1. కె. తరుణ్ రెడ్డి (కేన్స్), 2. బి. యశ్వంత్ (కేన్స్). బాలుర డబుల్స్: 1. కె. అనికేత్ రెడ్డి–సాయిపృథ్వీ (కేన్స్), 2. తరుణ్ రెడ్డి–మహితేజ (కేన్స్). బాలికల డబుల్స్: 1. కోమల్–లిఖిత, 2. బుష్రా ఫాతిమా–పూజిత. పురుషుల సింగిల్స్: 1. కె. అనికేత్ రెడ్డి (కేన్స్), 2. కె. తరుణ్ రెడ్డి (కేన్స్). పురుషుల డబుల్స్: 1. మజర్ అలీ–విఘ్నేశ్వర్ రావు, 2. హర్ష–సాయి గౌడ్. మహిళల డబుల్స్: 1. కె. ప్రణాలి (ఎల్బీఎస్)–చక్ర యుక్తారెడ్డి (కేన్స్), 2. పూర్వి సింగ్–కె. ప్రణాలి రెడ్డి (వీబీఏ). 35+ పురుషుల సింగిల్స్: 1. ఆర్. శేషు సాయి, 2. వీవీవీ ప్రసాద్. 35+ పురుషుల డబుల్స్: 1. ఆర్. శేషు సాయి–జి. హరీశ్ (మధురానగర్), 2. వీవీవీ ప్రసాద్– వినోద్ కుమార్ (ఆర్ఆర్ స్పోర్ట్స్). 45+ పురుషుల సింగిల్స్: 1. నాగ రవి శంకర్ (మధురానగర్), 2. సి. రవి (మధురా నగర్). 55+ పురుషుల సింగిల్స్: 1. ప్రకాశ్, 2. అంబ్రోస్. పురుషుల డబుల్స్: 1. పున్నారెడ్డి–రవీందర్ రెడ్డి (ఎర్రమంజిల్), 2. ప్రకాశ్ (ఎల్బీఎస్)–ఆంబ్రోస్ (ఎస్సీ క్లబ్). -
అభిలాష ట్రిపుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఎ.అభిలాష మూడు టైటిళ్లను చేజిక్కించుకుంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో బుధవారం ముగిసిన ఈ టోర్నీలో ఆమె అండర్-15లో సింగిల్స్, డబుల్స్ టైటిళ్లతో పాటు అండర్-17 సింగిల్స్‌లోనూ విజేతగా నిలిచింది. ఫైనల్లో అభిలాష 15-12, 15-10తో చక్రయుక్తపై గెలిచింది. అండర్-15 సింగిల్స్ తుదిపోరులో ఆమె 16-14, 15-8తో ప్రణవిపై నెగ్గింది. డబుల్స్‌లో ప్రణవితో కలిసి 15-7, 15-8తో శ్రావ్య-పల్లవి జోషి జంటపై గెలిచింది. అండర్-13 బాలుర డబుల్స్‌లో శశాంక్ సాయి-నిక్షిప్త్ శౌర్య 15-11, 15-8తో శ్రీమాన్ ప్రీతమ్-సిద్ధార్థ్లపై నెగ్గారు. సింగిల్స్‌లో ఉన్నిత్ కృష్ణ 15-7, 15-10తో నిక్షిప్త్ శౌర్యపై గెలిచాడు. బాలుర అండర్-17 సింగిల్స్, డబుల్స్‌లో విష్ణువర్ధన్ గౌడ్ సత్తాచాటుకున్నాడు. రెండు విభాగాల్లోనూ విజేతగా నిలిచాడు. సింగిల్స్‌లో విష్ణువర్ధన్ 16-14, 15-11తో అంకిత్ రెడ్డిని కంగుతినిపించాడు. డబుల్స్‌లో విష్ణువర్ధన్-మొయినుద్దీన్ 15-11, 13-15, 15-9తో సాయి రోహిత్-ఆకాశ్ చంద్రన్లపై గెలుపొందారు. బాలుర అండర్-19 సింగిల్స్ ఫైనల్లో సాయం బొత్రా 15-10, 15-8తో ఆదిత్య గుప్తాపై, అండర్-15 సింగిల్స్‌లో యశ్వంత్ రామ్ 14-16, 16-14, 15-4తో శశాంక్ సాయిపై విజయం సాధించారు. పురుషుల తుదిపోరులో డబుల్స్ తుదిపోరులో వినాయక్-తన్షఖ్ 11-15, 16-14, 15-11తో విజేత-కిషోర్‌లపై గెలిచారు. సింగిల్స్‌లో వెంకట్ 15-10, 15-9తో శ్రీరామ్‌పై నెగ్గాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను పూజ గెలుచుకుంది. ఆమె 15-12, 15-10తో ప్రణాలి కర్ణిపై నెగ్గింది. డబుల్స్‌లో ప్రణవి-ప్రణాలి కర్ణి 15-10, 15-1తో మౌన్యశ్రీ-క్రాంతిలపై గెలుపొందారు. ఈ టోర్నీలో విజేత, రన్నరప్‌గా నిలిచిన బాలబాలికలను హైదరాబాద్ జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఈ జట్టు నేటి (గురువారం) నుంచి వరంగల్‌లో జరిగే తెలంగాణ రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తలపడుతుంది. హైదరాబాద్ జట్టు: విష్ణువర్ధన్ గౌడ్, అంకిత్, మొహమ్మద్ ఖాదిర్, అభిలాష, చక్రయుక్త రెడ్డి, సాయం బోత్రా, ఆదిత్య గుప్తా, సాయి రోహిత్, ఆకాశ్, ప్రణవి రెడ్డి, ప్రణాలి క ర్ణి, కృష్ణా రెడ్డి.


