పచ్చదనం పెరిగింది! | Sakshi
Sakshi News home page

పచ్చదనం పెరిగింది!

Published Mon, Apr 24 2023 4:28 AM

latest report of Global Forest Review is revealed - Sakshi

గత 20 ఏళ్లలో భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా చెట్లతో కూడిన విస్తీర్ణం (ట్రీ కవర్‌) పెరిగింది. 2000–2020 మధ్యకాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే 13.09 కోట్ల హెక్టార్ల మేరకు ట్రీ కవర్‌ పెరిగిందని ‘ధరిత్రీ దినోత్సవం’సందర్భంగా వెలువరించిన ‘గ్లోబల్‌ ఫారెస్ట్‌ రివ్యూ’తాజా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్ధ ‘వరల్డ్‌ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌’కు అనుబంధంగా గ్లోబల్‌ ఫారెస్ట్‌ రివ్యూ పనిచేస్తోంది. మరోవైపు ఎక్కువ విస్తీర్ణంలోనే పచ్చని అడవుల నరికివేత కొనసాగుతోంది.

ఈ 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా నికరంగా 10.06 కోట్ల హెక్టార్లలో అడవుల్ని కోల్పోయినట్లు నివేదిక వెల్లడిస్తోంది అయితే 36 దేశాల్లో మొక్కలు నాటడం, కలప తోటలు, పండ్ల తోటల విస్తీర్ణం పెరుగుతున్నందున.. అడవులు, కలప/పండ్ల తోటలతో కలిపి పచ్చని చెట్ల విస్తీర్ణం నికరంగా పెరిగిందని గ్లోబల్‌ ఫారెస్ట్‌ పేర్కొంది. అయితే దీర్ఘకాలం ఎదిగిన అడవుల్ని నరికివేయటం వల్ల కలిగే పర్యావరణ నష్టాన్ని.. తాజా ట్రీ కవర్‌ పూర్తిగా భర్తీ చేయలేదని నివేదిక స్పష్టం చేసింది.  

పెరిగిన 13.09 కోట్ల హెక్టార్ల ట్రీ కవర్‌లో 91% (11.86 కోట్ల హెక్టార్లు) అడవులు ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన పెరుగుదలతో పాటు అడవుల పునరుద్ధరణ పథకాల అమలు ఇందుకు దోహదపడుతున్నాయి. మిగతా 9% (1.23 కోట్ల హెక్టార్లు)లో వాణిజ్యపరంగా సాగు చేస్తున్న యూకలిప్టస్, సుబాబుల్, ఆయిల్‌పామ్, రబ్బరు, పండ్ల తోటలు ఉన్నాయి.

కలప తోటలు, పండ్ల తోటల సాగు ద్వారా పెరిగిన 1.23 కోట్ల హెక్టార్లలో దాదాపు సగం ఇండోనేసియాలోని ఆయిల్‌పామ్, బ్రెజిల్‌లోనే కలప తోటలే కావటం విశేషం. మలేసియా, ఉరుగ్వే, న్యూజిలాండ్‌ దేశాల్లోని ట్రీ కవర్‌లో 70% వాణిజ్య, ఉద్యాన తోటల వల్లనే సాధ్యమైంది. భారత్‌లో అడవులు, కలప / పండ్ల తోటలతో నికరంగా 8,74,100 హెక్టార్ల విస్తీర్ణంలో ట్రీ కవర్‌ పెరిగినట్లు గ్లోబల్‌ ఫారెస్ట్‌ రివ్యూ నివేదిక తెలిపింది.  

ఐరోపా దేశాల్లో  60 లక్షల హెక్టార్లలో..  
సియా దేశాల్లోనూ అంతే. అడవుల పునరుద్ధరణ పథకాలను పెద్ద ఎత్తున అమలు చే­యటం, వ్యవసాయ భూములను పడావుగా వదిలేయటంతో చెట్లు పెరగటం వల్ల ఈ నికర పెరుగుదల నమోదైనట్లు నివేదిక పేర్కొంది.  

ఇరవై ఏళ్లలో ట్రీ కవర్‌ నికరంగా పెరిగిన దేశాలు 36 ఉండగా అందులో చైనా, భారత్‌ కూడా ఉండటం విశేషం. ఐరోపా దేశాల్లో 60 లక్షల హెక్టార్లలో నికరంగా ట్రీ కవర్‌ పెరిగింది. భారత్, చైనా సహా అనేక మధ్య, దక్షిణాసియా దేశాల్లోనూ అంతే. అడవుల పునరుద్ధరణ పథకాలను పెద్ద ఎత్తున అమలు చే­యటం, వ్యవసాయ భూములను పడావుగా వదిలేయటంతో చెట్లు పెరగటం వల్ల ఈ నికర పెరుగుదల నమోదైనట్లు నివేదిక పేర్కొంది. 

అత్యధికంగా చైనాలో.. 
అత్యధికంగా చైనాలో 21,44,900 హెక్టార్ల మేర ట్రీ కవర్‌ పెరుగుదల చోటు చేసుకుంది. భారత్‌లో 8,74,100 హెక్టార్ల మేర నికర ట్రీ కవర్‌ పెరుగుదల ఉంది. ఉరుగ్వే మినహా ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లోని ఏ దేశంలోనూ ట్రీ కవర్‌లో నికర పెరుగుదల లేదు. అడవుల నరికివేత, కార్చిచ్చుల నష్టం అక్కడ ఎంత ఎక్కువగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 

Advertisement
Advertisement