
Kim Jong Un vows to build 'invincible' military: నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్యాంగ్‌యాంగ్‌లో మంగళవారం జరిగిన డిఫెన్స్ ఎగ్జిబిషన్ షోలో పాల్గొన్న ఆయన 'అజేయమైన' సైన్యాన్ని నిర్మిస్తానంటూ ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో కిమ్ మాట్లాడుతూ.. పొరుగుదేశమైన దక్షిణ కొరియాతో మేము ఎలాంటి శత్రుత్వాన్ని కోరుకోవడం లేదు. ఆయుధ సామాగ్రిని కేవలం ఆత్మరక్షణ కోసమే సమకూర్చుకుంటున్నాం. ఎవరితోనూ యుద్ధాలు చేయడానికి కాదు. మేము ఎవరితోనూ యుద్ధం కోరుకోవడం లేదు. అదే సమయంలో దేశ సార్వభౌమత్వ రక్షణ కోసం ప్రత్యర్థుల్లో భయాన్ని పెంచడంపై మాట్లాడతామని కిమ్ అన్నారు.
చదవండి: (తీవ్ర సంక్షోభంలో శ్రీలంక.. కిలో పాలపొడి రూ.1,195)
కొరియా ద్వీపకల్పంలో అస్థిరతకు అమెరికానే కారణమన్న కిమ్.. తన దేశం యొక్క అతి ముఖ్యమైన లక్ష్యం ఎవరూ సవాలు చేయలేని సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండటమే అని చెప్పారు. ఉత్తర కొరియా చర్యలపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఆ దేశం మాత్రం తన అణ్వాయుధాలను అంతకంతకూ పెంచుకుంటూ వెళ్తోంది. మరీ ముఖ్యంగా ఇటీవలే ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులను, క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించడం గమనార్హం.