ఇరాన్‌పై అమెరికా మరో ట్విస్ట్‌.. | Karoline Leavitt React On Ceasefire Extension In West Asia Conflict, White House Dismisses 3-5 Day Ceasefire Reports | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై అమెరికా మరో ట్విస్ట్‌..

Apr 23 2026 10:56 AM | Updated on Apr 23 2026 11:14 AM

Karoline Leavitt react On ceasefire extension in West Asia conflict

వాషింగ్టన్‌: ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాల్పుల విరమణ గడువు పొడిగింపు, హార్మూజ్ జలసంధి దిగ్బంధంపై అమెరికా భారీ ట్విస్ట్‌ ఇచ్చింది. ఇరాన్‌తో కాల్పుల విరమణకు సంబంధించి ఐదు రోజుల గడువు ఉందన్న వార్తలు, నిరవధిక గడువు ఉందన్న సమాచారం నిజం కాదని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ ఎటువంటి నిర్దిష్ట గడువును ఇంకా విధించలేదని ఆమె తేల్చిచెప్పారు.

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హార్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న దిగ్బంధం పట్ల ట్రంప్ సంతృప్తిగా ఉన్నారు. ఇరాన్‌తో కాల్పుల విరమణకు సంబంధించి 3 నుంచి 5 రోజుల గడువు ఉందన్న వార్తలు నిజం కాదు. చర్చల సమయం, తదుపరి చర్యల గడువును అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే నిర్ణయిస్తారు. ఇక, ఇరాన్ ప్రస్తుతం చాలా బలహీనంగా ఉంది. చర్చలకు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు ఇప్పుడు ట్రంప్ చేతిలోనే ఉన్నాయి.

ఇరాన్‌కు ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులను అమెరికా అడ్డుకుంది. ఖర్గ్ ద్వీపం చమురు నిల్వలతో నిండిపోయింది. ఖర్గ్ ద్వీపం నుంచి చమురును బయటకు పంపే అవకాశం లేకుండా అమెరికా దిగ్బంధించింది. దీనివల్ల ఇరాన్ ప్రతిరోజూ సుమారు 500 మిలియన్ల ఆదాయాన్ని కోల్పోతోంది. కనీసం తన సొంత ప్రజలకు వేతనాలు కూడా చెల్లించలేని స్థితికి ఇరాన్ చేరుకుంది. ట్రంప్ ప్రయోగించిన ఈ ఆర్థిక ఒత్తిడి సత్ఫలితాలను ఇస్తోంది అని చెప్పుకొచ్చారు.

 ఇరాన్‌ కౌంటర్‌.. 
మరోవైపు.. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో శాంతి చర్చలకు అసలైన అడ్డంకులు ఎక్కడ ఉన్నాయో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోషల్ మీడియాలో వివరించారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను అమెరికా గౌరవించక పోవడం ఒక కారణమని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఓడరేవులపై, ఆర్థిక వ్యవస్థపై కొనసాగుతున్న ఆంక్షలు, దిగ్బంధం మరో కారణమని చెప్పారు. అమెరికా నుంచి వస్తున్న సైనిక, రాజకీయ బెదిరింపులు శాంతి చర్చలకు అడ్డంకులని తెలిపారు. అమెరికా మాటలకు, చేతలకు మధ్య ఉన్న తేడాను ప్రపంచం మొత్తం చూస్తోందని విమర్శించారు. ఇరాన్ ఎప్పుడూ చర్చలకు, ఒప్పందాలకు సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో హార్మూజ్‌ను తెరిచే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement