Anthony Fauci: భారత్‌లో లాక్‌డౌన్‌ పెట్టండి..!

Joe Biden Top Medical Adviser Advises Total Lockdown In India - Sakshi

వాషింగ్టన్‌: భారత దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతిని కట్టడి చేయాలంటే కొన్ని వారాలు సంపూర్ణంగా లాక్‌డౌన్‌ విధించాలని అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు, వైట్‌హౌస్‌ వైద్య సలహాదారు డాక్టర్‌ ఆంటోని ఫౌచీ సూచించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయాలని అన్నారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఆక్సిజన్, మందులు, పీపీఈ కిట్లు సరిపడా సమకూర్చుకోవాలని హితవు పలికారు. తమ తల్లుల్ని, తండ్రుల్ని తీసుకొని ఆస్పత్రుల ఎదుట, రోడ్ల మీద ఆక్సిజన్‌ కోసం ప్రజలు వెదుకుతున్నారని తనతో చాలా మంది చెప్పారని సంక్షోభ నివారణకి సరైన కేంద్రీకృత వ్యవస్థ లేకపోవడమే దీనికి కారణమని ఫౌచీ అభిప్రాయపడ్డారు. తొందరపడి కరోనాపై విజయం సాధించామని భారత్‌ ప్రకటనలు చేసిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

‘‘దేశాన్ని తాత్కాలికంగా మూసేయాలి. అలా చేస్తేనే కరోనా వ్యాప్తిని అడ్డుకోగలరు. ఆ సమయంలో కరోనాపై దీర్ఘ కాల పోరాటానికి అవసరమైన ప్రణాళిక రూపొందించాలి. కొంతమంది నిపుణులతో కూడిన కేంద్రీకృత వ్యవస్థని ఏర్పాటు చేసి కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలి’’అని ఫౌచీ చెప్పారు. ఏ దేశం కూడా లాక్‌డౌన్‌ విధించడానికి ఇష్టపడదని, అయినప్పటికీ, వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ఆరు నెలలు అక్కర్లేదని, కొన్ని వారాలు చాలని అన్నారు. గత ఏడాది చైనా పూర్తిగా దేశాన్ని మూసేసి సంక్షోభం నుంచి బయటపడిందని ఆయన గుర్తు చేశారు. 

చదవండి:
US Travel Ban: భారత ప్రయాణికులపై ఆంక్షలు, వారికి మినహాయింపు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top