కోవిడ్‌ కష్టాలు విని బైడెన్‌ భావోద్వేగం

Joe Biden talks with health care workers about COVID-19 crisis - Sakshi

నర్సుల సేవలను కొనియాడిన బైడెన్‌  

న్యూయార్క్‌: కోవిడ్‌ మహమ్మారి మిగిల్చిన విషాదాన్ని వింటూ అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ భావోద్వేగానికి గురయ్యారు. కరోనాపై యుద్ధంలో ముందువరుసలో నిలబడి పోరాడుతోన్న ఆరోగ్య సిబ్బందితో మాట్లాడారు. కోవిడ్‌పై వివిధ వర్గాల వారి అనుభవాలను తెలుసుకునేందుకు ఒక ఐసీయూలో పనిచేసే నర్సు, ఒక ఇంటిపని కార్మికురాలు, ఒక టీచర్, అగ్నిమాపక సిబ్బందితో బైడెన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

ఫిబ్రవరి నుంచి కోవిడ్‌ ఆసుపత్రిలోని ఐసీయూలో సేవలందిస్తోన్న నేషనల్‌ నర్సెస్‌ యునైటెడ్, మిన్నెసోటా చాప్టర్‌ అధ్యక్షురాలు మేరీ టర్నర్‌ తన అనుభవాలను వివరిస్తూ కంటతడి పెట్టారు. సరైన రక్షణ సదుపాయాలు లేకపోవడం వలన తమ ఆసుపత్రిలో పనిచేసే నర్సులు ఎన్‌–95 మాస్కులను తిరిగి తిరిగి ఉపయోగించాల్సి వస్తోందని ఆమె వెల్లడించారు. ‘‘తాము చూడలేని తమ కుటుంబ సభ్యులకోసం అంతిమగడియల్లో విలపించిన ఎందరో కరోనా బాధితులను తన కరస్పర్శతో ఓదార్చాను’’అని ఆమె కన్నీటి పర్యంతమౌతూ జో బైడెన్‌కి వివరించారు.

మాస్క్‌ల కొరత, నర్సులు విరామం లేకుండా పనిచేయాల్సి రావడం, కనీస రక్షణ పరికరాలు లేకపోవడం, టెస్టింగ్‌ కిట్ల కొరతలతో సహా. దేశవ్యాప్తంగా మార్చి నెలనుంచి వృత్తిపరంగా తామెదుర్కొంటోన్న అనేక సమస్యలను ఆమె జోబైడెన్‌ ముందుంచారు. సౌకర్యాల లేమి కారణంగా ఆరోగ్య కార్యకర్తలకు గత యేడాది కాలంగా కోవిడ్‌ పరీక్షలు నిర్వహించలేదని ఆమె వెల్లడించారు. భావోద్వేగంతో మాట్లాడుతోన్న టర్నర్‌ అనుభవాలను విన్నతరువాత, అందుకు సమాధానంగా బైడెన్‌ మాట్లాడుతున్నప్పుడు జో బైడెన్‌ కన్నీటిని తుడుచుకోవడం కనిపించింది.

తాను వైస్‌ప్రసిడెంట్‌గా ఉండగా వాల్టర్‌ రీడ్‌ మెడికల్‌ సెంటర్‌లో ఐసీయూలో, నైట్‌ షిఫ్టుల్లో పనిచేస్తోన్న నర్సులకు తాను రాత్రి భోజనాన్ని అందించేందుకు వెళ్ళేవాడినని బైడెన్‌ తెలిపారు. బైడెన్‌ కుమారుడు బ్యౌ 2015లో బ్రెయిన్‌ కాన్సర్‌తో మరణించడానికి ముందు చివరి పది రోజులు వాల్టర్‌ రీడ్‌ మెడికల్‌ సెంటర్‌లోనే గడిపారు. ‘‘మీరు నన్ను భావోద్వేగానికి గురిచేశారు. నాలాగే ఎవరైనా నెలల కొద్దీ సమయం ఐసీయూలో గడిపినట్లయితే, ఐసీయూలో పనిచేసే నర్సులపై ఉండే మానసిక ఒత్తిడిని అర్థం చేసుకోగలుగుతారు’’అని బైడెన్‌ వివరించారు. ‘‘మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే, మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది, మీ శ్రమకు తగిన ప్రతిఫలం చెల్లించాలి’’అని బైడెన్‌ ఆరోగ్యసిబ్బంది సేవలను కొనియాడారు.

గవర్నర్లతో భేటీకానున్న బైడెన్‌
ట్రంప్‌ అధికార మార్పిడికి అడ్డంకులు సృష్టిస్తున్న నేపథ్యంలో డెమొక్రాటిక్, రిపబ్లికన్‌ పార్టీలకు చెందిన కొందరు గవర్నర్లతో బైడెన్‌ భేటీకానున్నారు. ఐదుగురు రిపబ్లికన్, నలుగురు డెమొక్రాటిక్‌ పార్టీలకు చెందిన గవర్నర్లతో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్‌ వర్చువల్‌గా భేటీ కానున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top