ఎలక్టోరల్‌ విజయం.. బైడెన్‌ ఉద్వేగ ప్రసంగం!

Joe Biden Says Rule of Law US Constitution Will of People Prevailed - Sakshi

వాషింగ్టన్‌: ‘‘చాలా ఏళ్ల క్రితమే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనే జ్యోతి వెలిగింది. మహమ్మారి గానీ, అధికార దుర్వినియోగం గానీ ఆ వెలుగును ఏమాత్రం మసకబార్చలేవు. ఐకమత్యానికి అద్దం పట్టేలా చరిత్రలో మరో పుటను తిరగవేసే సమయం ఆసన్నమైంది. ఈ యుద్ధంలో అమెరికా ఆత్మ, ప్రజాస్వామ్యం గెలుపొందాయి. తమ ఉనికిని చాటుకున్నాయి ’’ అని అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు.  ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు వేసిన ఎత్తుగడలు చిత్తు అయిపోయాయంటూ రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన మద్దతుదారులను ఉద్దేశించి విమర్శలు చేశారు. వాస్తవాన్ని అంగీకరించకుండా దానిని మార్చాలన్న వారి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి ఘటనలు చూడలేదంటూ బైడెన్‌ విమర్శించారు.(చదవండి: వైట్‌హౌస్‌ నుంచి వెళ్లాల్సిందే)

అదే విధంగా.. ట్రంప్‌ ప్రయత్నాలను ఏకగ్రీకవంగా తిరస్కరించిన సుప్రీంకోర్టుకు బైడెన్‌ ధన్యవాదాలు తెలిపారు.కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు సంబంధించి మొత్తం 538 మంది ఎలక్టర్లు సోమవారం తమ తమ రాష్ట్రాల రాజధానుల్లో సమావేశమై అధ్యక్ష అభ్యర్థులకు ఓట్లు వేశారు. ఈ క్రమంలో.. తాజా సమాచారం ప్రకారం.. బైడెన్‌కు 306 ఓట్లు రాగా, ట్రంప్‌నకు 232 ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బైడెన్‌ డెలావర్‌లో మాట్లాడుతూ..  ‘‘20 మిలియన్‌ మంది అమెరికన్‌ ప్రజల ఓట్లను ప్రభావితం చేసేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి కొన్ని వర్గాలు. అధ్యక్ష అభ్యర్థి తను ఓడిపోయిన చోట్ల ఫలితాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించారు.

అయితే వ్యవస్థలపై నమ్మకంతో అమెరికా ప్రజలు ఓటు వేశారు. ఆ నమ్మకం నిలబడింది. ఎన్నికల వ్యవస్థ సమగ్రత రక్షించబడింది. చట్టం, అమెరికా రాజ్యాంగం, ప్రజల ఆకాంక్ష నెరవేరింది’’ అని పేర్కొన్నారు. తన విజయం ఖరారైందని, ఆ ఆనందాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలే తప్ప ఎదురుదాడికి దిగాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మహమ్మారి కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం, వ్యాక్సినేషన్‌ తమ ముందున్న తక్షణ కర్తవ్యమని, అదే విధంగా కోవిడ్‌ సంక్షోభం కారణంగా నష్టపోయిన వారిని ఆర్థికంగా ఆదుకుంటామని అమెరికాకు కాబోయే 46వ అధ్యక్షుడు జో బైడెన్‌ పునరుద్ఘాటించారు. తాను అమెరినక్లందరికీ ప్రెసిడెంట్‌ను అని మరోసారి స్పష్టం చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top